Sebi bans
-
నిధులు మళ్లింపు.. అంబానీపై రూ.25 కోట్ల పెనాల్టీ
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్హెచ్ఎఫ్ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. -
విదేశీ ఈటీఎఫ్‌లో పెట్టుబడులొద్దు
ముంబై: విదేశీ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడులను అనుమతించవద్దంటూ సెబీ తాజాగా దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫి)ను ఆదేశించింది. ఏప్రిల్ 1నుంచి తాజా ఆదేశాలు అమలుకానున్నాయి. కాగా.. ఎంఎఫ్‌లు విదేశీ సెక్యూరిటీల(షేర్లు)లో 7 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు సెబీ అనుమతిస్తుంది. అయితే 2022 జనవరిలోనే గరిష్ట పరిమితికి చేరడంతో విదేశీ సెక్యూరిటీలలో ఎంఎఫ్ పెట్టుబడులకు ఇప్పటికే సెబీ చెక్ పెట్టింది. ఈ బాటలో ప్రస్తుతం విదేశీ ఈటీఎఫ్‌లో పెట్టుబడులకు నో చెప్పింది. వెరసి ఇన్వెస్టర్ల నుంచి విదేశీ ఈటీఎఫ్‌ల కోసం పెట్టుబడులను అనుమతించవద్దంటూ ఎంఎఫ్‌లను ఆదేశించింది. దేశీయంగా 77 ఎంఎఫ్ పథకాలు విదేశీ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాగా.. విదేశీ మార్కెట్లు దిద్దుబాటుకు లోనుకావడంతో ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ క్షీణించే అవకాశముంది. దీంతో ఆమేర పెట్టుబడులకు సెబీ 2023లో అనుమతించింది. -
బడా నిర్మాతకు సెబీ షాక్.. ఈరోస్ ప్రమోటర్లపై నిషేధం
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షాకిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లతోపాటు.. ఎండీ సునీల్ అర్జన్ లుల్లా, సీఈవో ప్రదీప్ కుమార్ ద్వివేదిపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. నిధుల అక్రమ మళ్లింపు అభియోగాల కేసులో సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లుల్లా, ద్వివేదిలను ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా యాజమాన్య సంబంధ ఏ విధమైన పదవినీ చేపట్టకుండా నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఈరోస్ ఇంటర్నేషనల్సహా అనుబంధ సంస్థలలోనూ పదవులు నిర్వహించకుండా కొరడా ఝళిపించింది. ఇక ప్రమోటర్ సంస్థలు ఈరోస్ వరల్డ్‌వైడ్ ఎఫ్‌జెడ్ ఎల్ఎల్సీ, ఈరోస్ డిజిటల్ ప్రయివేట్ లిమిటెడ్‌కూ నిషేధం వర్తించనున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు నిధుల అక్రమ తరలింపునకు సహకరించాయన్న ఆరోపణలతో దింక్ఇంక్ పిక్చర్జ్ లిమి టెడ్, మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, స్పైసీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా లిమిటెడ్ పుస్తకాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించవలసిందిగా బీఎస్ఈని సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫోరెన్సిక్ ఆడిటర్ సెబీకి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. -
స్మాల్ క్యాప్ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున ఎస్ఎంఎస్లు పంపిణీ చేయడం ద్వారా ఐదు స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో మ్యానిపులేషన్‌కు పాల్పడినందుకు 135 సంస్థలపై సెబీ చర్యలు తీసుకుంది. అడ్డంగా సంపాదించినందుకు రూ.126 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, 7ఎన్ఆర్ రిటైల్ లిమిటెడ్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ లిమిటెడ్, జీబీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విషాల్ ఫ్యాబ్రిక్స్ షేర్లను కొనుగోలు చేయాలంటూ ఆయా సంస్థలు ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపించినట్టు సెబీ గుర్తించింది. మూడు పెద్ద బృందాలు కలసికట్టుగా ఈ ముందస్తు పథకాన్ని నడిపించినట్టు పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా ముందు ఆయా షేర్ల ధరలను పెంచుతూ వెళ్లారు. మానిపులేటివ్ ట్రేడ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. షేరు ధర పెరుగుతుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంది. ధరలను పెంచిన తర్వాత బై కాల్స్ ను ప్రసారం చేశారు. హనీఫ్ షేక్ అనే వ్యక్తి సూత్రధారిగా దీన్ని నడిపించాడు. బై కాల్స్ చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు రావడంతో వీరు తమవద్దనున్న షేర్లను అధిక ధరల వద్ద అమ్ముకుని బయటపడ్డారు. తద్వారా భారీ లాభాలను ఆర్జించారు’’అని సెబీ పేర్కొంది. -
మేహుల్ చోక్సీపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్ చోక్సీపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్సైడర్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది. ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ ప్రమోటర్, చైర్మన్ చోక్సీ నీరవ్ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు. -
క్లయింట్ల తరఫున ట్రేడింగ్‌పై నిషేధం లేదు: కార్వీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త క్లయింట్లను తీసుకోవటంపై మాత్రమే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 21 రోజుల పాటు నిషేధం విధించిందని, ప్రస్తుత క్లయింట్ల తరఫున ట్రేడింగ్ చేయటం, మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించటం వంటి అంశాల్లో ఎలాంటి నిషేధం లేదంటూ ఆర్థికసేవల సంస్థ ‘కార్వీ’ శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘మా వ్యాపారాల్లో సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నియంత్రణలో నడిచే స్టాక్ బ్రోకింగ్ కూడా ఒకటి. దీని పనితీరు, బుక్స్‌ను ఈ సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటాయి. ఆగస్టులో జరిగిన తనిఖీకి సంబంధించి సెబీకి ఎన్ఎస్ఈ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా 22న సెబీ తాత్కాలిక ఎక్స్‌పార్టీ ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్పందించాలని మాకు 21 రోజుల సమయం ఇచ్చింది. అప్పటిదాకా కొత్త క్లయింట్లను తీసుకోరాదని నిషేధించింది. ప్రస్తుత క్లయింట్ల తరఫున కార్యకలాపాలు సాగించటంపై మాత్రం ఎలాంటి నిషేధమూ లేదు’ అని సంస్థ వివరించింది. సంస్థ స్పందించిన అనంతరం దీనిపై మరింత సమగ్రంగా దర్యాప్తు జరిపి తాజా ఉత్తర్వుల్ని సమీక్షిస్తామని సెబీ తెలియజేసినట్లు కార్వీ పేర్కొంది. -
ఒడిదుడుకుల వారం!
► ఈ వారంలోనే ఎఫ్ అండ్ ఓ ముగింపు ► స్వల్పకాలంలో ‘అంతర్జాతీయ’ ప్రభావం ► రిలయన్స్‌పై సెబీ నిషేధం ప్రతికూలం ► ఐఎండీ అంచనాలు సానుకూలం ► మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే(గురువారం–ఈ నెల 30న) ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో మార్కెట్ దిశను అంతర్జాతీయ సంకేతాలు ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోకడలు.. ఈ అంశాలన్నింటి ప్రభావం కూడా స్టాక్ సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ నిషేధం విధించడం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. ఎల్‌నినో ప్రభావం వర్షాకాలం పూర్తయిన తర్వాతనే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)గత శుక్రవారం వెల్లడించడం మార్కెట్‌కు సానుకూలాంశమని నిపుణులంటున్నారు. సుదీర్ఘ కన్సాలిడేషన్.. మొత్తం మీద మార్కెట్ సుదీర్ఘకాల కన్సాలిడేషన్లోకి వెళుతోందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఇప్పటికే సానుకూల అంశాలన్నింటినీ మార్కెట్ గ్రహించిందని, ఇక మరింత పైకో, లేక కిందకో వెళ్లడానికి ముందు దీర్ఘకాల కన్సాలిడేషన్లోకి ప్రవేశిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 12న ముగుస్తాయి. మార్చి సిరీస్ డెరివేటివ్స్ ముగియనున్నందున ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ అభ్నిష్ కుమార్ ఆధ్య చెప్పారు. ఒబామాకేర్ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన హెల్త్‌కేర్ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి తగిన ఓట్లు రావనే అంచనాలతో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారని ఈ ప్రభావం కూడా మన స్టాక్ మార్కెట్‌పై ఉండనున్నదని వివరించారు.. మరోవైపు వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడ కూడా మన మార్కెట్‌పై ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి పేర్కొన్నారు. మార్కెట్ పై స్థాయిల్లో ఎంత బలంగా నిలదొక్కు కోగలదో అన్న అంశం కూడా ప్రభావం చూపుతుందని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. మరింత ముందుకే మార్కెట్ ! అత్యంత కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నందున మార్కెట్ జోరు కొనసాగుతుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. ఈ వారంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,000–9,250 పాయింట్ల రేంజ్లో(గత శుక్రవారం నిఫ్టీ 9,108 పాయింట్ల వద్ద ముగిసింది) కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా స్టాక్ సూచీలు గత వారంలో నష్టాలపాలయ్యాయి. గత మూడు వారాల్లో స్టాక్ సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. బీఎస్ఈ సెన్సెక్స్228 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ మన క్యాపిటల్ మార్కెట్లో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీగా విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ.22,268 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.16,177 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో వీరి ఇన్వెస్ట్మెంట్స్ ఈ నెలలో ఇప్పటివరకూ రూ.38,445 కోట్లుగా(584 కోట్ల డాలర్లు) ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.30,994 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.19,818 కోట్లు, వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.50,811 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని బజాజ్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాలా చెప్పారు. గత నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి.