బడా నిర్మాతకు సెబీ షాక్‌.. ఈరోస్‌ ప్రమోటర్లపై నిషేధం | SEBI bars Eros Intl from market | Sakshi
Sakshi News home page

బడా నిర్మాతకు సెబీ షాక్‌.. ఈరోస్‌ ప్రమోటర్లపై నిషేధం

Published Fri, Jun 23 2023 4:04 AM | Last Updated on Fri, Jun 23 2023 7:14 AM

SEBI bars Eros Intl from market - Sakshi

న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షాకిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లతోపాటు.. ఎండీ సునీల్‌ అర్జన్‌ లుల్లా, సీఈవో ప్రదీప్‌ కుమార్‌ ద్వివేదిపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. నిధుల అక్రమ మళ్లింపు అభియోగాల కేసులో సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లుల్లా, ద్వివేదిలను ఏ లిస్టెడ్‌ కంపెనీలోనూ డైరెక్టర్‌ లేదా యాజమాన్య సంబంధ ఏ విధమైన పదవినీ చేపట్టకుండా నిషేధించింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌సహా అనుబంధ సంస్థలలోనూ పదవులు నిర్వహించకుండా కొరడా ఝళిపించింది. ఇక ప్రమోటర్‌ సంస్థలు ఈరోస్‌ వరల్డ్‌వైడ్‌ ఎఫ్‌జెడ్‌ ఎల్‌ఎల్‌సీ, ఈరోస్‌ డిజిటల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కూ నిషేధం వర్తించనున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు నిధుల అక్రమ తరలింపునకు సహకరించాయన్న ఆరోపణలతో దింక్‌ఇంక్‌ పిక్చర్జ్‌ లిమి టెడ్, మీడియావన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్, స్పైసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మీడియా లిమిటెడ్‌ పుస్తకాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను నియమించవలసిందిగా బీఎస్‌ఈని సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ సెబీకి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement