న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్‌మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది.
నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్‌అండ్‌ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది.
సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment