
న్యూఢిల్లీ: జరిమానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న ఎగవేతదారుల నుంచి సొమ్ము రికవర్ చేసుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కొత్త పథకానికి తెరతీసింది. ఎగవేతదారుకు చెందిన ఆస్తుల వివరాలను వెల్లడించేవారికి రూ. 20 లక్షలవరకూ బహుమతి(రివార్డు)ని అందించేందుకు పథకం రచించింది. రివార్డును రెండు(మధ్యంతర, తుది) దశలలో అందించనుంది.
మధ్యంతర రివార్డు కింద ఎగవేతదారుడికి చెందిన ఆస్తి విలువ రిజర్వ్ ధరలో 2.5 శాతం మించకుండా లేదా రూ. 5 లక్షలవరకూ(వీటిలో ఏది తక్కువైతే అది) చెల్లిస్తారు. తదుపరి బకాయిల వసూల విలువలో 10 శాతం మించకుండా లేదా రూ. 20 లక్షలలోపు తుది బహుమతిగా ఇవ్వనుంది. అయితే రికవరీకి వీలయ్యే ఆస్తుల సమాచారమిచ్చే వ్యక్తి విశ్వాసపాత్రమైన వివరాలు అందించవలసి ఉంటుంది. సమాచారమిచ్చేవారి వివరాలు, రివార్డు తదితరాలను రహస్యంగా ఉంచుతారు. ఇందుకు అనుగుణంగా సెబీ 515 ఎగవేతదారులతో రూపొందించిన జాబితాను తాజాగా విడుదల చేసింది.