ఎగవేతదార్లు(డిఫాల్టర్లు) నుంచి జరిమానా బకాయిలు వసూలు చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సరికొత్త ప్రణాళిక రచించింది. డిఫాల్టర్ల ఆస్తులు, ఇతర సమాచారాన్ని తెలియచేసే వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 515 మంది ఎగవేతదార్ల జాబితాను సెబీ విడుదల చేసింది. వీళ్లకు సంబంధించిన సమాచారాన్నే తెలియజేయాల్సి ఉంది.
రెండు దశల్లో చెల్లింపు
ఇలా డిఫాల్టర్ల ఆస్తుల సమాచారాన్ని తెలియజేస్తే సెబీ రెండు దశల్లో నజరానా అందిస్తుంది. ఎగవేతదారు నుంచి వసూలు చేసిన బకాయి విలువలో 2.5 శాతం లేదా రూ.5 లక్షలు.. ఏది తక్కువైతే అది తొలిదశలో చెల్లిస్తుంది. ఇక తుది దశ కింద బకాయి విలువలో 10 శాతం లేదా రూ.20 లక్షలు ఏది తక్కువైతే అది ఇవ్వనుంది.
సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యం
సెబీ ప్రకటన ప్రకారం.. డిఫాల్టర్లను నుంచి బకాయి వసూలుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నించినా పూర్తి బకాయి వసూలు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ ఎగవేతదారు ఆస్తులకు సంబంధించి విశ్వసయనీయ సమాచారం అందించేవారికి ఈ నజరానా అందిస్తారు. ఇదే సమయంలో సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలను, నజరానా మొత్తాన్ని గోప్యంగా ఉంచనున్నట్లు సెబీ పేర్కొంది.
ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరో తెలుసా?
సమాచారం అందించేవారికి ఎంత మేర నజరానాకు అర్హత ఉందనే అంశంపై సిఫారసు చేసేందుకు ఒక కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. ఈ నజరానాను ఇన్వెస్టర్ల భద్రత, అవగాహన నిధి నుంచి చెల్లిస్తారు. మార్చి 8 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 2021-22 సెబీ వార్షిక నివేదిక ప్రకారం.. వసూలు కష్టంగా మారిన బకాయిల విభాగం కింద 2022 మార్చి చివరి నాటికి రూ.67,228 కోట్ల బకాయిలను సెబీ గుర్తించింది. నజరానా ప్రకటించడం వల్ల బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు దోహదం చేస్తుందని సెబీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment