misappropriating funds
-
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
బడా నిర్మాతకు సెబీ షాక్.. ఈరోస్ ప్రమోటర్లపై నిషేధం
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షాకిచ్చింది. కంపెనీ, ప్రమోటర్లతోపాటు.. ఎండీ సునీల్ అర్జన్ లుల్లా, సీఈవో ప్రదీప్ కుమార్ ద్వివేదిపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. నిధుల అక్రమ మళ్లింపు అభియోగాల కేసులో సెక్యూరిటీల మార్కెట్ల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా లుల్లా, ద్వివేదిలను ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా యాజమాన్య సంబంధ ఏ విధమైన పదవినీ చేపట్టకుండా నిషేధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఈరోస్ ఇంటర్నేషనల్సహా అనుబంధ సంస్థలలోనూ పదవులు నిర్వహించకుండా కొరడా ఝళిపించింది. ఇక ప్రమోటర్ సంస్థలు ఈరోస్ వరల్డ్‌వైడ్ ఎఫ్‌జెడ్ ఎల్ఎల్సీ, ఈరోస్ డిజిటల్ ప్రయివేట్ లిమిటెడ్‌కూ నిషేధం వర్తించనున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు నిధుల అక్రమ తరలింపునకు సహకరించాయన్న ఆరోపణలతో దింక్ఇంక్ పిక్చర్జ్ లిమి టెడ్, మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, స్పైసీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా లిమిటెడ్ పుస్తకాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించవలసిందిగా బీఎస్ఈని సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఫోరెన్సిక్ ఆడిటర్ సెబీకి నివేదికను దాఖలు చేయవలసి ఉంటుంది. -
‘డీలర్ డీల్’ పై ఏపీ సర్కార్ సీరియస్..
సాక్షి, అమరావతి: ఎస్సీ యువత ఉపాధి నిమిత్తం వాహనాలు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని డీలర్లకు దారి మళ్లించిన బాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘‘షికారు వెనుక డీలర్ల డీల్–ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయి పాలు’’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీలర్ల డీల్ విషయమై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఏం జరిగాయి? డీలర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? తదితర కోణాల్లో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ చినరాముడు, జనరల్ మేనేజర్ సునీల్ రాజ్‌కుమార్‌ల నుంచి వాటికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఉన్నతస్థాయి అధికారులు గురువారం పరిశీలించారు. చదవండి: టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్! విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ యువత పేరుతో టీడీపీ నేతల బినామీలకు, వారు సిఫారసులు చేసిన వారికి కేటాయించి అసలు లక్ష్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకుని ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసిన డీలర్ల డీల్ వ్యవహారం తోడైంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం గత ప్రభుత్వం రూ.365.67 కోట్లను డీలర్లకు అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో వాహనాలు ఇవ్వకుండా సుమారు రూ.67.68 కోట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్వాన్స్‌ను చెల్లించని డీలర్లు ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత డీలర్లతో ఒకటి, రెండుసార్లు సమావేశం నిర్వహించి వాహనాలు ఇవ్వలేకపోతే, అడ్వాన్స్ డబ్బులైనా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇన్నోవాలు, ఇటియోస్లు ఇచ్చేందుకు అడ్వాన్సులు తీసుకున్న రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) కంపెనీ రూ.23.05 కోట్లకు పైగా, కినెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్(పూణే), ఈగల్ అగ్రీ ఎక్విప్మెంట్ (కావలి) పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రూ.41.67 కోట్లకు పైగా, ఎంట్రాన్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ (పశ్చిమ గోదావరి జిల్లా) పేరుతో గమ్మిడి మోహిని రూ.2.93 కోట్ల మొత్తాన్ని వసూలుచేసేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. వాహనాలు ఇవ్వకుండా ప్రజాధనం లూటీచేసిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని తదుపరి చర్యలకు సమాయత్తమైంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తోంది. -
పుత్రోత్సాహం ఖర్చు రూ. కోటి
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మాజీ వీసీ తన పుత్రుడి ప్రయోగాల కోసం కోటి రూపాయలకుపైగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా వర్సిటీకి సంబంధంలేని వీసీ కుమారుడి పేరును శిలాఫలకంలో వేశారు. మాజీ వీసీ భర్త ఇప్పటికీ పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులన్నీ బినామీ కాంట్రాక్టర్ పేరుతో వారే చేయడమే కాకుండా కమీషన్ల రూపంలో భారీగా నొక్కేస్తున్నారని క్యాంపస్‌లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వర్సిటీలో వీరు చేపట్టిన అన్ని ప్రయోగాల ఖర్చు కోటి రూపాయలు దాటుతోందనే విషయం బాహాటంగా వినిపిస్తోంది. సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తాజా మాజీ వీసీ ప్రొఫెసర్ దుర్గా భవాని కుమారుడు ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. అతని ప్రయోగాల కోసం మహిళా వర్సిటీని ఎంచుకున్నారు. ఇప్పటికే వీసీ బంగ్లా ప్రహరీ పేరిట మట్టిగోడ నిర్మించగా, అది పాడైపోయింది. 45 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభమైన గాంధీ స్క్వయిర్( గార్డెన్) నిర్మాణ ఖర్చు కోటి రూపాయలను దాటింది. 10 నెలలుగా గార్డెన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నిధులన్నీ వారికి ఏ మాత్రం ఉపయోగపడని గార్డెన్‌కు వినియోగిస్తున్నారు. క్యాంపస్‌లో ఇది హాట్ టాఫిక్‌గా మారింది. ఓ వైపు నిర్మాణం జరుగుతుండగానే ఎండిపోయిన గాంధీ స్వ్కయిర్(గార్డెన్) బినామీ కాంట్రాక్టర్ పేరుతో పనులు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు(ఎన్ఆర్ఐ) తోటకూర ప్రసాద్ గాంధీ విగ్రహాన్ని ఉచితంగా అందించారు. ఈ విగ్రహాన్ని క్యాంపస్‌లో ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. అయితే ఆ విగ్రహం ఏర్పాటు కోసం గార్డెన్ ఏర్పాటు చేసి అందులో పెట్టాలని నిర్ణయించారు. ఆర్కిటెక్చర్ చదివిన కుమారుడి ప్రయోగానికి దాన్ని వినియోగించాలని తాజా మాజీ వీసీ దుర్గాభవాని నిర్ణయించారు. 45లక్షల అంచనా వ్యయ్యం తో గాంధీ స్వ్కయిర్ పేరిట గార్డెన్ రూపొందిం చేందుకు ప్రణాళిక రూపొందిం చారు. తమకు బాగా కావాల్సిన ఒక బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కూలిన ప్రహరీ గోడ దుర్గాభవాని వీసీగా ఉన్న సమయంలో ఆమె బంగ్లాకు ప్రహరీ గోడను మట్టితో నిర్మించారు. ఆర్కిటెక్చర్ కోర్సులో కుమారుడు నేర్చుకున్న అంశాలపై ప్రయోగాలు చేయడానికి బంగ్లాను ఎంచుకున్నారు. మట్టితో ప్రహరీ గోడ నిర్మించడానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చుచేశారు. ఈ ప్రయోగం విఫలమైంది. బంగళా ఎంట్రెన్స్ దగ్గర ప్రహరీ గోడ పాడైపోయింది. వీసీ బంగ్లా వద్ద దెబ్బతిన్న ప్రహరీ గోడ పాలన ఆమె కనుసన్నల్లోనే వీసీగా దుర్గాభవానీ పదవీ కాలం గత ఏడాది అక్టోబర్ 26కు పూర్తయింది. అప్పటి నుంచి రెక్టార్ వి.ఉమ ఇన్చార్జి వీసీగా పనిచేస్తున్నారు. దుర్గాభవాని హయాంలో ఆమె ఆశీస్సులతో నియమితులైన రెక్టార్ ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మమత ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాభవాని కనుసన్నల్లోనే వర్సిటీ పాలన సాగుతోంది. వర్సిటీకి చెందిన అధికార వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వీసీ బంగ్లాలో పనిచేసే ఉద్యోగులతో ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. ఈ అంశంపై ఇటీవల నాన్ టీచింగ్ సిబ్బంది రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దుర్గాభవానికి ప్రొఫెసర్‌గా ఇంకా సర్వీసు ఉంది. ఆమె పనిచేసే జర్నలిజం విభాగంలో ప్రత్యేక గది, రెడ్ కార్పెట్, ఇతర ఖరీదైన ఫర్నీచర్‌ను అధికారులు సమాకూర్చుతున్నారు. నీటి కొరత మహిళా వర్సిటీలో తీవ్రమైన నీటి కొరత ఉంది. హాస్టల్లో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నా చర్యలు తీసుకోకుండా అధికారులు ఈ గార్డెన్లో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ పనులన్నీ మాజీ వీసీ భర్త దగ్గరుండి పర్యవేక్షించడం కొసమెరుపు. విద్యార్థుల ఫీజుల నుంచే.. వివిధ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నిధులను, హాస్టల్ విద్యార్థుల నుంచి అడ్మిషన్ రూపంలో చెల్లించే నిధులను దారి మళ్లించి గార్డెన్‌కు ఖర్చు చేస్తున్నారు. నెలల తరబడి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కోటి రూపాయలు ఖర్చు చేసినా పూర్తికాలేదు. పూర్తయ్యే సరికి ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియని పరిస్థితి. పైగా ఈ గార్డెన్లో ఏర్పాటు చేసిన పచ్చిక ఇప్పటికే ఎండిపోయింది. ఫీజు లేకుండా డిజైన్ గాంధీ స్వ్కయిర్(గార్డెన్)కు దుర్గాభవాని కుమారుడు ఎలాంటి ఫీజు లేకుండా డిజైన్ సమకూర్చారు. అందుకే గాంధీ విగ్రహానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆమె కుమారుడు ఎన్.శ్రీహర్ష పేరు వేశాం. దుర్గాభవాని వీసీ పదవి నుంచి రిలీవ్ అయ్యాక.. ఆమెను తెలుగు యూనివర్సిటీకి ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమె కోరిక మేరకు మహిళా యూనివర్సిటీ వాహనాన్ని కేటాయించాం. ఇప్పుడు నిలిపివేశాం. మాజీ వీసీలకు వర్సిటీలో సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఆమె చాంబర్‌కు తగిన ఫర్నీచర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. – ప్రొఫెసర్ వి.ఉమ, ఇన్చార్జి వీసీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ -
సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. గత కొద్దిసంవత్సరాల క్రితం మూసివేసిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి నమోదు చేసిన కేసులో సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు తన దృష్టిలోకి వచ్చాయని... ఆగస్టు 7 తేదిలోపు నిందితులు కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. భారత మొట్టమొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ ను 2008లో మూసివేశారు.