పుత్రోత్సాహం ఖర్చు రూ. కోటి | Padmavathi Mahila University Former Vice Chancellor Misappropriating Funds | Sakshi
Sakshi News home page

పుత్రోత్సాహం ఖర్చు రూ. కోటి

Published Mon, Jul 1 2019 9:52 AM | Last Updated on Mon, Jul 1 2019 9:52 AM

Padmavathi Mahila University Former Vice Chancellor Misappropriating Funds - Sakshi

మాజీ వీసీ దుర్గాభవాని కుమారుడు శ్రీహర్ష పేరుతో ఉన్న శిలాఫలకం

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మాజీ వీసీ తన పుత్రుడి ప్రయోగాల కోసం కోటి రూపాయలకుపైగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా వర్సిటీకి సంబంధంలేని వీసీ కుమారుడి పేరును శిలాఫలకంలో వేశారు. మాజీ వీసీ భర్త ఇప్పటికీ పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులన్నీ బినామీ కాంట్రాక్టర్‌ పేరుతో వారే చేయడమే కాకుండా కమీషన్ల రూపంలో భారీగా నొక్కేస్తున్నారని క్యాంపస్‌లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వర్సిటీలో వీరు చేపట్టిన అన్ని ప్రయోగాల ఖర్చు కోటి రూపాయలు దాటుతోందనే విషయం బాహాటంగా వినిపిస్తోంది.   

సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తాజా మాజీ వీసీ ప్రొఫెసర్‌ దుర్గా భవాని కుమారుడు ఆర్కిటెక్చర్‌ పూర్తి చేశారు. అతని ప్రయోగాల కోసం మహిళా వర్సిటీని ఎంచుకున్నారు. ఇప్పటికే వీసీ బంగ్లా ప్రహరీ పేరిట మట్టిగోడ నిర్మించగా, అది పాడైపోయింది. 45 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభమైన గాంధీ స్క్వయిర్‌( గార్డెన్‌) నిర్మాణ ఖర్చు కోటి రూపాయలను దాటింది. 10 నెలలుగా గార్డెన్‌ నిర్మాణ పనులు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నిధులన్నీ వారికి ఏ మాత్రం ఉపయోగపడని గార్డెన్‌కు వినియోగిస్తున్నారు. క్యాంపస్‌లో ఇది హాట్‌ టాఫిక్‌గా మారింది.


ఓ వైపు నిర్మాణం జరుగుతుండగానే ఎండిపోయిన  గాంధీ స్వ్కయిర్‌(గార్డెన్‌)

బినామీ కాంట్రాక్టర్‌ పేరుతో పనులు 
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్‌ షిప్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు(ఎన్‌ఆర్‌ఐ) తోటకూర ప్రసాద్‌  గాంధీ విగ్రహాన్ని ఉచితంగా అందించారు. ఈ విగ్రహాన్ని క్యాంపస్‌లో ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. అయితే ఆ విగ్రహం ఏర్పాటు కోసం గార్డెన్‌ ఏర్పాటు చేసి అందులో పెట్టాలని నిర్ణయించారు. ఆర్కిటెక్చర్‌ చదివిన  కుమారుడి ప్రయోగానికి దాన్ని వినియోగించాలని తాజా మాజీ వీసీ దుర్గాభవాని నిర్ణయించారు. 45లక్షల అంచనా వ్యయ్యం తో గాంధీ స్వ్కయిర్‌ పేరిట గార్డెన్‌ రూపొందిం చేందుకు ప్రణాళిక రూపొందిం చారు. తమకు బాగా కావాల్సిన ఒక బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. 

కూలిన ప్రహరీ గోడ
దుర్గాభవాని వీసీగా ఉన్న సమయంలో ఆమె బంగ్లాకు ప్రహరీ గోడను మట్టితో నిర్మించారు. ఆర్కిటెక్చర్‌ కోర్సులో కుమారుడు నేర్చుకున్న అంశాలపై ప్రయోగాలు చేయడానికి బంగ్లాను ఎంచుకున్నారు. మట్టితో ప్రహరీ గోడ నిర్మించడానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చుచేశారు. ఈ ప్రయోగం విఫలమైంది.  బంగళా ఎంట్రెన్స్‌ దగ్గర ప్రహరీ గోడ పాడైపోయింది.
 


వీసీ బంగ్లా వద్ద దెబ్బతిన్న ప్రహరీ గోడ

పాలన ఆమె కనుసన్నల్లోనే
వీసీగా దుర్గాభవానీ పదవీ కాలం గత ఏడాది అక్టోబర్‌ 26కు పూర్తయింది. అప్పటి నుంచి రెక్టార్‌ వి.ఉమ ఇన్‌చార్జి వీసీగా పనిచేస్తున్నారు. దుర్గాభవాని హయాంలో ఆమె ఆశీస్సులతో నియమితులైన రెక్టార్‌ ఉమ, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మమత ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాభవాని కనుసన్నల్లోనే వర్సిటీ పాలన సాగుతోంది. వర్సిటీకి చెందిన అధికార వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వీసీ బంగ్లాలో పనిచేసే ఉద్యోగులతో ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. ఈ అంశంపై ఇటీవల నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. 
అంతేకాకుండా దుర్గాభవానికి  ప్రొఫెసర్‌గా ఇంకా సర్వీసు ఉంది. ఆమె పనిచేసే జర్నలిజం విభాగంలో ప్రత్యేక గది, రెడ్‌ కార్పెట్, ఇతర ఖరీదైన ఫర్నీచర్‌ను అధికారులు సమాకూర్చుతున్నారు.

నీటి కొరత
మహిళా వర్సిటీలో తీవ్రమైన నీటి కొరత ఉంది. హాస్టల్‌లో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నా చర్యలు తీసుకోకుండా అధికారులు ఈ గార్డెన్‌లో వాటర్‌ ఫౌంటైన్‌ ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ పనులన్నీ మాజీ వీసీ భర్త దగ్గరుండి పర్యవేక్షించడం కొసమెరుపు.

విద్యార్థుల ఫీజుల నుంచే..
వివిధ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నిధులను, హాస్టల్‌ విద్యార్థుల నుంచి అడ్మిషన్‌ రూపంలో చెల్లించే నిధులను దారి మళ్లించి గార్డెన్‌కు ఖర్చు చేస్తున్నారు. నెలల తరబడి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కోటి రూపాయలు ఖర్చు చేసినా పూర్తికాలేదు. పూర్తయ్యే సరికి ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియని పరిస్థితి. పైగా ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పచ్చిక ఇప్పటికే ఎండిపోయింది.
 
ఫీజు లేకుండా డిజైన్‌
గాంధీ స్వ్కయిర్‌(గార్డెన్‌)కు దుర్గాభవాని కుమారుడు ఎలాంటి ఫీజు లేకుండా డిజైన్‌ సమకూర్చారు. అందుకే గాంధీ విగ్రహానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆమె కుమారుడు ఎన్‌.శ్రీహర్ష పేరు వేశాం.  దుర్గాభవాని వీసీ పదవి నుంచి రిలీవ్‌ అయ్యాక.. ఆమెను తెలుగు యూనివర్సిటీకి ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో ఆమె కోరిక మేరకు మహిళా యూనివర్సిటీ వాహనాన్ని కేటాయించాం. ఇప్పుడు నిలిపివేశాం. మాజీ వీసీలకు వర్సిటీలో సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఆమె చాంబర్‌కు తగిన ఫర్నీచర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం.
   – ప్రొఫెసర్‌ వి.ఉమ, ఇన్‌చార్జి వీసీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement