Vice -Chancellor
-
‘షెల్టర్ కల్పిస్తామంటే చర్యలు తప్పవు’
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సరవణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 42 మంది మరణించగా, వందకు పైగా క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ క్యాంపస్‌లో అల్లర్ల బాధితులకు ‘షెల్టర్’ కల్పిస్తామని విద్యార్ధి సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై విశ్వవిద్యాలయ వీసీ జగదీష్ కుమార్ స్పందించారు. ‘ఢిల్లీలోని ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైనంత సాయం అందించాలనుకుంటున్నాం. కానీ, క్యాంపస్‌లోని కొన్ని విద్యార్థి సంఘాలు క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులకు ‘షెల్టర్’ కల్పిస్తామని ప్రకటిస్తున్నాయి. క్యాంపస్‌కు సంబంధంలేని వ్యక్తులు యూనివర్సిటీలోకి పవేశించటం వల్ల జనవరిలో హింసాత్మక ఆందోళనలు జరిగాయని విద్యార్థులు నిరసనలు తెలిపిన విషయాన్ని వీసీ జగదీష్ కుమార్ గుర్తు చేశారు. (కల్లోలం నుంచి క్రమంగా.. 148 ఎఫ్ఐఆర్లు) అల్లర్లలో బాధపడే వారికి సాయం చేయడం వల్ల ఎలాంటి హాని జరగనప్పటికి విశ్వవిద్యాలయ శాంతి, భద్రతల దృష్ట్యా బాధితులకు ‘షెల్లర్’ ఇవ్వకూడదని ఆయన తెలిపారు. దీనిపై విద్యార్థులు ఎంటువంటి ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు. అదేవిధంగా చట్టపరంగా క్యాంపస్‌లో ‘షెల్టర్’ ఇవ్వాలని ఎటువంటి నిబంధన లేదన్నారు. అయిన్పటికీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ జగదీష్ కుమార్ తెలిపారు.(ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా దాడి) -
ఏపీ ఆర్ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఆర్ సెట్-2019 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 14 యూనివర్శిటీల్లో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలను పొందేందుకు ఆర్ సెట్ నిర్వహిస్తునట్లు తెలిపారు. 70 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఈ నెల 8 నుంచి 11 వరుకు హైదరాబాద్‌తో సహా 10 నగరాల్లో ఏపీ ఆర్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆర్ సెట్ ప్రాథమిక కీ ఈ నెల 13న విడుదల చేస్తామన్నారు. ఈ నెల 15 వరుకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఒక నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిచ్చేది లేదని వీసీ ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఆచార్య ఎన్జీరంగా వర్సిటీలో కలకలం
సాక్షి, గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్‌నాయుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు కావడం ఆదివారం కలకలం సృష్టించింది. ‘తాను చెప్పిందే వేదం. చేసిందే చట్టం. తనకు ఎదురులేదు. అడ్డొస్తే ఎవరైనా సరే బదిలీ, లేదా డెప్యూటేషన్‌పై శంకరగిరి మాన్యాలే’ అన్నంతగా వీసీ వ్యవహారం సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్‌నాయుడును ఆదివారం సాయంత్రం తుళ్లూరు డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వీసీని అరెస్ట్ చేశారన్న వార్త దావానంలా వ్యాపించి వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. వీసీ అక్రమాలకు, అరాచకాలకు బలై డెప్యూటేషన్లు, బదిలీలపై వెళ్లిన, జరిమానాలు చెల్లించిన బాధితుల్లో ఒకింత ఆనందం వ్యక్తమైంది. అంతా ఏకపక్షం వీసీ దామోదర్‌నాయుడు ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, మిగిలిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు లాం ఫాంలోని యూనివర్సిటీ కాంపౌండ్‌లో ఉండటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసిన ఘటనలు ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎదురు చెప్పిన ఎందరినో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం వర్సిటీ సిబ్బంది 453 మంది వీసీ అరాచకాలకు బలయ్యామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దేశ చరిత్రలో ఒక వీసీపై ఇంతటి భారీస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉండి ఉండకపోవచ్చు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో అంతమంది సిబ్బంది ఫిర్యాదులు చేసినా వీసీపై కనీస చర్యలు కరువయ్యాయి. ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తనకు బాగా తెలుసని, ఆయనదీ, తనదీ ఒకే ఊరని, తనను ఎవరూ ఏమీ చేయలేరని వీసీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయటంతోపాటు బదిలీ చేశారన్న ఫిర్యాదులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నో అపాయింట్మెంట్ దామోదర్‌నాయుడు వీసీగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. వీసీ పీఏ సైతం వచ్చిన వారు ఎవరో తెలుసుకుని ఓ సామాజికవర్గం వారు కాకుంటే అపాయింట్మెంట్ సిద్ధం చేసేవారు కాదని సిబ్బంది, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇతర వర్గాల వారు కలిసేందుకు వస్తే పీఏ కూడా అంగీకరించేవారు కాదన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. పది రోజులకుపైగా విచారణ వీసీపై ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో సింగిల్‌మన్ కమిటీని నియమించి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 500 మందికిపైగా వీసీ బాధితులు సుమారు పది రోజులపాటు తమకు జరిగిన అన్యాయాలను ప్రద్యుమ్న ఎదుట ఏకరువుపెట్టారు. ఈ క్రమంలో బాధితులు రాష్ట్ర గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఊరికి చెందిన ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అండ ఉండగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు ఉన్నతాధికారులను వీసీ బెదిరించారని సమాచారం. అంతటా వీసీ అరెస్టుపై చర్చ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధలో ఉన్న కార్యాలయాలు, కళాశాలల్లో వీసీ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీసీ నిరంకుశత్వం, ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్య «ధోరణి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వీసీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసేవారని అంతటా చెప్పుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులను సైతం మాజీ సీఎం చంద్రబాబు తన క్లాస్మెంట్, కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన జిల్లావాసి అంటూ వీసీ బెదిరించేవారని, ఎట్టకేలకు తగిన శాస్తి జరిగిందని పేర్కొంటున్నారు. -
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తా
రెండు ప్రతిష్టాత్మక సంస్థల సారథులు కొలువుదీరారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించిన వీఎంఆర్డీయే చైర్మన్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా అదనపు బాధ్యతలు పొందిన ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డిలు శుక్రవారం ఆయా సంస్థల కార్యాలయాల్లో అభిమానులు, సిబ్బంది కోలాహలం మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థల పాలనను, ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విద్య, బోధనలకే పరిమితం కాకుండా ఏయూను సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా నిలుపుతామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య, విశాఖ కాలుష్యం వంటి వాటికి వర్సిటీ శాస్త్రీయ పరిష్కారాలు అన్వేషిస్తుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు వర్సిటీ వీసీగా ఆయన కార్యాలయంలో అదనపు బాధ్యతలను చేపట్టారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ సమక్షం తొలి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం తనను తీర్చిదిద్దన సోదరి డాక్టర్ పి.ఏ.ఎల్ రజని ఆశీస్సులు తీసుకున్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య టి.బైరాగిరెడ్డి ఆయన్ను అభినందించారు. డీఎస్ఎన్ఎల్యూ మాజీ వీసీ ఆచార్య వై.సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాసరావు, రమణమూర్తి, సుమిత్ర, టి.వినోదరావు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. సేవాకేంద్రం ఏర్పాటు వీసీ ఏయూ సెనేట్ మందిరంలో మీడియా ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. వర్సిటీలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సేవలు, సమాచారం అందిస్తామన్నారు. విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. రానున్న దశాబ్ద కాలం లో వర్సిటీలో చేసే అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను తాను సిద్ధం చేసుకున్నానని, దానిని త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి ఎం.జి. గోపాల్‌ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. ఆచార్యునిగా తన 32 సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులే మంచి మిత్రులుగా నిలు స్తారన్నారు. నంబర్‌వన్ వర్సిటీగా ఏయూను నిలపాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. నిధుల తరలింపు వల్లే సమస్య వర్సిటీకి అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమని, గత ఐదు సంవత్సరాలుగా నియామక ప్రక్రియలో లోపాల కారణంగా ఉద్యోగాలు భర్తీ చేయ డం సాధ్యపడలేదన్నారు. దీనికంటే పెద్ద సమస్య నిధుల కొరతేన్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీకి రావాల్సిన నిధులు పసుపు కుంకుమ పేరుతో తరలిపోయాయన్నారు. ముందుగా వీటిని తిరిగి తెచ్చుకోవడం ఎంతో అవసరమన్నారు. పేద విద్యార్థులకు అండగా.. పేద విద్యార్థులకు అండగా ఏయూ నిలుస్తుందన్నారు. వర్సిటీలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అదనపు సెక్షన్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో త్వరలో చర్చిస్తామని చెప్పారు. వైఎస్సార్‌కు నివాళి వీసీ బాధ్యతల స్వీకరణకు ముందు ఏయూ నిర్మాణానికి 1942లో వేసిన శిలాఫలకం వద్ద పూలు ఉంచారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి, మహాత్మాగాంధీ, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం తా ను రిజిస్ట్రార్‌గా పని చేసిన సమయంలో వీసీ గా ఉన్న ఆచార్య బీల సత్యనారాయణ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు. -
పుత్రోత్సాహం ఖర్చు రూ. కోటి
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మాజీ వీసీ తన పుత్రుడి ప్రయోగాల కోసం కోటి రూపాయలకుపైగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా వర్సిటీకి సంబంధంలేని వీసీ కుమారుడి పేరును శిలాఫలకంలో వేశారు. మాజీ వీసీ భర్త ఇప్పటికీ పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులన్నీ బినామీ కాంట్రాక్టర్ పేరుతో వారే చేయడమే కాకుండా కమీషన్ల రూపంలో భారీగా నొక్కేస్తున్నారని క్యాంపస్‌లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద వర్సిటీలో వీరు చేపట్టిన అన్ని ప్రయోగాల ఖర్చు కోటి రూపాయలు దాటుతోందనే విషయం బాహాటంగా వినిపిస్తోంది. సాక్షి, యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తాజా మాజీ వీసీ ప్రొఫెసర్ దుర్గా భవాని కుమారుడు ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. అతని ప్రయోగాల కోసం మహిళా వర్సిటీని ఎంచుకున్నారు. ఇప్పటికే వీసీ బంగ్లా ప్రహరీ పేరిట మట్టిగోడ నిర్మించగా, అది పాడైపోయింది. 45 లక్షల అంచనా వ్యయంతో ప్రారంభమైన గాంధీ స్క్వయిర్( గార్డెన్) నిర్మాణ ఖర్చు కోటి రూపాయలను దాటింది. 10 నెలలుగా గార్డెన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నిధులన్నీ వారికి ఏ మాత్రం ఉపయోగపడని గార్డెన్‌కు వినియోగిస్తున్నారు. క్యాంపస్‌లో ఇది హాట్ టాఫిక్‌గా మారింది. ఓ వైపు నిర్మాణం జరుగుతుండగానే ఎండిపోయిన గాంధీ స్వ్కయిర్(గార్డెన్) బినామీ కాంట్రాక్టర్ పేరుతో పనులు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీకి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు(ఎన్ఆర్ఐ) తోటకూర ప్రసాద్ గాంధీ విగ్రహాన్ని ఉచితంగా అందించారు. ఈ విగ్రహాన్ని క్యాంపస్‌లో ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. అయితే ఆ విగ్రహం ఏర్పాటు కోసం గార్డెన్ ఏర్పాటు చేసి అందులో పెట్టాలని నిర్ణయించారు. ఆర్కిటెక్చర్ చదివిన కుమారుడి ప్రయోగానికి దాన్ని వినియోగించాలని తాజా మాజీ వీసీ దుర్గాభవాని నిర్ణయించారు. 45లక్షల అంచనా వ్యయ్యం తో గాంధీ స్వ్కయిర్ పేరిట గార్డెన్ రూపొందిం చేందుకు ప్రణాళిక రూపొందిం చారు. తమకు బాగా కావాల్సిన ఒక బినామీ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కూలిన ప్రహరీ గోడ దుర్గాభవాని వీసీగా ఉన్న సమయంలో ఆమె బంగ్లాకు ప్రహరీ గోడను మట్టితో నిర్మించారు. ఆర్కిటెక్చర్ కోర్సులో కుమారుడు నేర్చుకున్న అంశాలపై ప్రయోగాలు చేయడానికి బంగ్లాను ఎంచుకున్నారు. మట్టితో ప్రహరీ గోడ నిర్మించడానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చుచేశారు. ఈ ప్రయోగం విఫలమైంది. బంగళా ఎంట్రెన్స్ దగ్గర ప్రహరీ గోడ పాడైపోయింది. వీసీ బంగ్లా వద్ద దెబ్బతిన్న ప్రహరీ గోడ పాలన ఆమె కనుసన్నల్లోనే వీసీగా దుర్గాభవానీ పదవీ కాలం గత ఏడాది అక్టోబర్ 26కు పూర్తయింది. అప్పటి నుంచి రెక్టార్ వి.ఉమ ఇన్చార్జి వీసీగా పనిచేస్తున్నారు. దుర్గాభవాని హయాంలో ఆమె ఆశీస్సులతో నియమితులైన రెక్టార్ ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మమత ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాభవాని కనుసన్నల్లోనే వర్సిటీ పాలన సాగుతోంది. వర్సిటీకి చెందిన అధికార వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వీసీ బంగ్లాలో పనిచేసే ఉద్యోగులతో ఇంట్లో పనులు చేయించుకుంటున్నారు. ఈ అంశంపై ఇటీవల నాన్ టీచింగ్ సిబ్బంది రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దుర్గాభవానికి ప్రొఫెసర్‌గా ఇంకా సర్వీసు ఉంది. ఆమె పనిచేసే జర్నలిజం విభాగంలో ప్రత్యేక గది, రెడ్ కార్పెట్, ఇతర ఖరీదైన ఫర్నీచర్‌ను అధికారులు సమాకూర్చుతున్నారు. నీటి కొరత మహిళా వర్సిటీలో తీవ్రమైన నీటి కొరత ఉంది. హాస్టల్లో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నా చర్యలు తీసుకోకుండా అధికారులు ఈ గార్డెన్లో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ పనులన్నీ మాజీ వీసీ భర్త దగ్గరుండి పర్యవేక్షించడం కొసమెరుపు. విద్యార్థుల ఫీజుల నుంచే.. వివిధ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నిధులను, హాస్టల్ విద్యార్థుల నుంచి అడ్మిషన్ రూపంలో చెల్లించే నిధులను దారి మళ్లించి గార్డెన్‌కు ఖర్చు చేస్తున్నారు. నెలల తరబడి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా కోటి రూపాయలు ఖర్చు చేసినా పూర్తికాలేదు. పూర్తయ్యే సరికి ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియని పరిస్థితి. పైగా ఈ గార్డెన్లో ఏర్పాటు చేసిన పచ్చిక ఇప్పటికే ఎండిపోయింది. ఫీజు లేకుండా డిజైన్ గాంధీ స్వ్కయిర్(గార్డెన్)కు దుర్గాభవాని కుమారుడు ఎలాంటి ఫీజు లేకుండా డిజైన్ సమకూర్చారు. అందుకే గాంధీ విగ్రహానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆమె కుమారుడు ఎన్.శ్రీహర్ష పేరు వేశాం. దుర్గాభవాని వీసీ పదవి నుంచి రిలీవ్ అయ్యాక.. ఆమెను తెలుగు యూనివర్సిటీకి ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమె కోరిక మేరకు మహిళా యూనివర్సిటీ వాహనాన్ని కేటాయించాం. ఇప్పుడు నిలిపివేశాం. మాజీ వీసీలకు వర్సిటీలో సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఆమె చాంబర్‌కు తగిన ఫర్నీచర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. – ప్రొఫెసర్ వి.ఉమ, ఇన్చార్జి వీసీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ -
136 రోజుల జేడీ సోదరుని పాలన..నేటితో
సాక్షి, తిరుపతి : ఎస్వీయూ వీసీగా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3న ఎస్వీయూ 18వ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ కేవలం 136 రోజులు మాత్రమే పనిచేశారు. ఈయన తన నాలుగు నెలల పాలనలో సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆర్కే అనురాధ, దూరవిద్యా విభాగానికి చెందిన మాజీ డైరెక్టర్ వి.రవి నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్లు విమర్శలున్నాయి. రెక్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ జీ.జానకి రామయ్యతో రాజీనామా చేయించడం మినహా ఇతర కీలక నిర్ణయాలు ఏమీ లేవు. ఈ నిర్ణయంకూడా వారి సూచనలకు అనుగుణంగానే తీసుకున్నట్లు క్యాంపస్‌లో ప్రచారం ఉంది. నియామకమే తప్పు ఎస్వీ యూనివర్సిటీ వీసీ నియామకానికి గత యేడాది ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ పోస్టుకు ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దరఖాస్తు చేయలేదు. జనవరిలో నిర్వహించిన సెర్చ్ కమిటీ సమావేశానికి వారం ముందు ఈయనను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికపుడు దరఖాస్తు తెప్పించుకున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్లపాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ రుణం తీర్చుకొనేందుకు... ప్రభుత్వం ఆయన సోదరుడైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌కు వీసీ పదవి కట్టబెట్టింది. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ సహకారం కూడా ఈయన నియామకంలో పాత్ర ఉంది. నియామకంపై కేసులు యూజీసీ నిబంధనల ప్రకారం వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి సభ్యుడుగా ఉండరాదు. విద్యారంగ నిపుణుడే సభ్యుడిగా ఉండాలి. ఎస్వీయూ సెర్చ్ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం గత యేడాది డిసెంబర్లో జీఓ జారీ చేసింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.మునిరత్నం రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ కేసులో తీర్పును ముందే ఊహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అయితే ముందు రోజే విధుల్లో చేరినట్లు అప్పటి అధికారుల సహకారంతో తప్పుడు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. అనంతరం ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ను తొలగించాలని కోరుతూ ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి కో వారెంటో దాఖలు చేశారు. వీసీ నియామకానికి సంబంధించిన రెండు కేసుల్లో ఈ నెల 24న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న విద్యాశాఖ మంత్రిని కలిసి తన రాజీనామా విషయంపై చర్చించారు. అమరావతి నుంచి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం సన్నిహితులతో చర్చించిన అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్, ఉన్నత విద్యామండలికి పంపారు. ఈ రాజీనామా ఆమోదం పొందడం లాంఛనమే. ముందే చెప్పిన సాక్షి ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ నియామకం, నిబంధనల ఉల్లంఘన, హైకోర్టులో కేసులు తదితర అంశాలపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఈ నెల 18న ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం అన్న శీర్షికన కథనం ప్రచురతమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
కదలరు..కదపలేరు!
సాక్షి, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. ఏళ్ల తరబడి వారు కొన్ని విభాగాల్లో తిష్ట వేయడంతో కొత్తగా వచ్చే ఏ విభాగాధిపతి అయినా వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిన పరిస్థితి. వారి స్థానాలను మారుస్తూ వైస్ చాన్సలర్ ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఉద్యోగులు ఖాతరు చేయరు. సీటు మారరు. వీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు కావడంతో పాటు వారు విధులు నిర్వహించే విభాగాలు ఆదాయం వచ్చేవి. దీంతో వారి లాబీయింగ్‌కు వర్సిటీ ఉన్నతాధికారులు తలొగ్గుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 265 మంది ఉన్నారు. వర్సిటీలో పని తక్కువ రాజకీయాలు ఎక్కువ. 12 మంది ప్రోఫెసర్లలో వారు బోధనతో పాటు పరిపాలనకు (బోధనేతర) సంబంధించి ఒక్కొక్కరు మూడు, నాలుగు విభాగాలకు అధిపతులుగా ఉంటున్నారు. వీరు హెడ్స్‌గా ఉన్నా చాలా విభాగాల్లో బోధనేతర సిబ్బంది హవానే నడుస్తోంది. వీరు వర్గాలుగా విడిపోయి పంతం నెగ్గించుకుంటున్నారు. వర్సిటీలో ఒక్క ఉద్యోగి కూడా జాబ్ చార్ట్ పాటించరు. వారి కనుసన్నల్లో పాలన.. పరీక్షల విభాగం, దూర విద్య విభాగం, పరిశోధన విభాగం, సీడీసీ, ఫైనాన్స్, ప్రిన్సిపల్ కార్యాలయాల్లో పాతుకు పోయిన ఉద్యోగుల కనుసన్నల్లో పాలన సాగుతోంది. ఆయా విభాగాలకు ఏ ప్రోఫెసర్ అధిపతిగా వచ్చినా ఆయన వారి మాట వినాల్సిందే. లేకపోతే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. సదరు కీలక వ్యక్తులు ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ ఆ విభాగం డైరెక్టర్ పెట్టాల్సిందే. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. దీంతో కొందరు ప్రొఫెసర్లు లేని పోని తలనొప్పులు ఎందుకని పరిపాలనా అంశాల జోలికి వెళ్లడం లేదు. వైస్‌చాన్సలర్ ఆదేశాలూ పట్టవు.. ఆర్‌యూలో పరిపాలన గాడి తప్పిందనేది బహిరంగ రహస్యమే. పరీక్షల విభాగం, డిస్టెన్స్, ఫైనాన్స్ విభాగాలు ఏర్పడినప్పటి నుంచి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు బదిలీ కాలేదు. రీసెర్స్, సీడీసీ విభాగాల్లో చాలా ఏళ్లుగా అక్కడే ఉన్నారు. ఈ కీలక విభాగాల్లో ఆదాయ మార్గాలు ఉండటంతో అక్కడి నుంచి కదలడానికి ఇష్ట పడరు. పూర్వపు వైస్‌చాన్సలర్ నరసింహులు ఆయన పదవీకాలం ముగిసే ఆరు నెలల ముందు బోధనేతర సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏ ఒక్క ఉద్యోగి కూడా వారి స్థానాల నుంచి కదలలేదు. తమను ఏమీ చేసుకోలేరనే ధీమానో.. సదరు అధికారి చేసిన తప్పిదాల గుట్టు వారి దగ్గర ఉందనే ధైర్యమో తెలియదు. బదిలీలకు సాహసించని ప్రస్తుత వీసీ ప్రస్తుత వీసీ ప్రసాదరావు బదిలీల ప్రక్రియ చేపట్టడానికి సాహసించడం లేదు. మొదట్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి వర్సిటీ పాలనను గాడిన పెడతానని పలు మార్లు మీడియా ముఖంగా వెల్లడించారు. ఏడాదవుతున్నా వాటి జోలికి వెళ్లడం లేదు. కదిపితే ఎక్కడ తన ఉనికికే ప్రమాదం వస్తుందనే అభిప్రాయంతో వీసీ బదిలీలకు సాహసించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇతర ఏ వీసీ హయాంలో జరగనన్ని గొడవులు, ఆందోళనలు ఈయన పీరియడ్‌లో జరుగుతున్నాయి. నాలుగైదు సార్లు బోధనేతర సిబ్బంది వీసీ చాంబర్లోకి వచ్చి ఆయనను అసభ్య పదజాలంతో దూషింనా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగుల్లో 80 శాతం మంది వీసీ సామాజిక వర్గానికి చెందినవారే. వీరిలో పలువురు ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థి నేతలు గత ఎన్నికల్లో కోడుమూరు, నందికొట్కూరు నియోజక వర్గాల టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వర్సిటీలో పోస్టులు, పదోన్నతులు పొందేందుకు వీసీపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. పక్కా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరింన పూర్వపు రిజిస్ట్రార్ అమర్నాథ్ రిలీవ్ అయ్యే ముందు కొందరు ఉద్యోగులకు పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు దస్త్రం సిద్ధం చేసిన విషయం బయటికి పొక్కడంతో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారు. అయినా, సదరు అధికారి తన పని తాను చేసినట్లు సమాచారం. ఈ దస్త్రం ప్రస్తుతం వీసీ దగ్గర ఉన్నట్లు వినికిడి. అదే టీడీపీ వ్యక్తిగా ముద్ర పడ్డ వీసీ ఒత్తిళ్లకు తలొగ్గి దస్త్రాన్ని క్లియర్ చేస్తారా? లేక పక్కన పెడతారో చూడాల్సి ఉంది. విభాగాల వారీగా కొందరు తిష్ట వేసిన స్థానాలు ☛ దూరవిద్య విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి, మరో ఇద్దరు ఉద్యోగులు ఆ విభాగం ఏర్పడినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ☛ రీసెర్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్, ముగ్గురు ఉద్యోగులదీ అదే పరిస్థితి. ☛ వర్సిటీ ప్లేస్మెంట్ అధికారిగా ఏళ్ల తరబడి ఒకరు కొనసాగుతున్నారు. ☛ పరీక్షల విభాగంలో ఉద్యోగులందరూ ఆ విభాగాన్ని శాసించే స్థాయి పాతుకుపోయారు. ☛ సీడీసీ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. ☛ ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఏళ్ల తరబడి ఉన్న ఉద్యోగులదే పెత్తనం ☛ కొత్తగా ఏర్పడిన ఫైనాన్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు అక్కడి నుంచి కదలకుండా ఉన్నారు. ☛ వర్సిటీలో 15 మంది దాకా ఉద్యోగులు ఉదయం వచ్చి సంతకం చేస్తారు. తర్వాత వారిసొంత వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. కొత్త రిజిస్ట్రార్ వచ్చాకే బదిలీలు వర్సిటీలో బోధనేతర సిబ్బంది బదిలీలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఉన్నారు. రెగ్యులర్ రిజిస్ట్రార్ వచ్చాక బదిలీల ప్రక్రియ చేపడతాం. కొంత మంది వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు. అడిగిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కదా. – ఎ.వి.ప్రసాదరావు, వీసీ -
అంతా సర్కారే చూసుకుంటుంది:వీసీలు
► హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీసీల స్పందన సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్స్లర్లు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలకు చేపట్టిన వీసీల నియామకాలు చెల్లవని గత గురువారం హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్సిటీల నూతన వీసీలు విధుల్లో కొనసాగుతారా? వైదొలుగుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా వీసీలు మాత్రం రోజువారీ విధుల్లో తలమునకలయ్యారు. గత నెల 25న నియామకమైన జేఎన్టీయూహెచ్ వీసీ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ సీతారామారావు అదే రోజు బాధ్యతలు స్వీకరించారు. వీసీల నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వీసీల్లో నర్మగర్భంగా ఆందోళన మొదలైంది. ‘తమను ప్రభుత్వమే నియమించింది. నియామకాలు కూడా పారదర్శకంగా జరిగాయి. నిబంధనలకు అనుగుణంగానే పదవులను అలంకరించాం. కోర్టు ఏం తీర్పు చెప్పినా ప్రభుత్వమే ఆ వ్యవహారాన్ని చూసుకుంటుంది. అసలు ఆ విషయాన్ని మేం పట్టించుకోవడం లేదు. మేం ప్రస్తుతం విధుల నిర్వహణ పైనే దృష్టి సారించాం. మాకొచ్చే ఇబ్బందేం లేదు’ అని ఓ వర్సిటీ వీసీ ధీమావ్యక్తం చేశారు. ‘కోర్టులంటే అందరికీ గౌరవమే. అయితే వీసీల నియామకాలు చెల్లవని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలు అందలేదు. అలాగని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ మాకు చేరలేదు. ప్రస్తుతమైతే వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం’ అని మరో వర్సిటీ వీసీ పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టాలను సవరించి ఇచ్చిన జీఓలకు అనుగుణంగా వీసీను నియమించారు. అసలు ఆ జీఓలే చెల్లవు. అటువంటప్పుడు వీసీ నియామకాలు ఏమాత్రం చెల్లుబాటు కాబోవు. బహుశా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ స్టే విధిస్తే.. కొన్నాళ్లు నూతన వీసీలు తమ పదవుల్లో కొనసాగుతారు. లేదంటే పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది’ అని ఓ మాజీ వీసీ వివరించారు. మరోపక్క కనీస అర్హతలు లేకున్నా.. వీసీలుగా నియమితులైన వారు మరింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీసీగా నియమితులు కావాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కానీ పలువురు వీసీలు ఐదేళ్ల అనుభవం ఉన్నా వీసీలుగా నియమితులయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పలువురు వీసీలను అడగగా.. ‘నగరంలో ఉన్న వర్సిటీలకు నూతన వీసీలుగా కొనసాగుతున్న వారందరికీ ప్రొఫెసర్‌గా పదేళ్ల పైబడే అనుభవం ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. మొత్తం మీద నాలుగు వారాల తర్వాత నూతన వీసీలు కొనసాగుతారా? పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.