ఆచార్య ఎన్జీరంగా వర్సిటీలో కలకలం  | Police Arrested Acharya NG Ranga Agricultural University Vice Chancellor In Guntur | Sakshi
Sakshi News home page

ఆచార్య ఎన్జీరంగా వర్సిటీలో కలకలం 

Oct 21 2019 10:50 AM | Updated on Oct 21 2019 10:50 AM

Police Arrested Acharya NG Ranga Agricultural University Vice Chancellor In Guntur - Sakshi

వీసీని అరెస్టుచేసి తీసుకెళ్తున్న డీఎస్పీ

సాక్షి, గుంటూరు రూరల్‌ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ వి.దామోదర్‌నాయుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు కావడం ఆదివారం కలకలం సృష్టించింది. ‘తాను చెప్పిందే వేదం. చేసిందే చట్టం. తనకు ఎదురులేదు. అడ్డొస్తే ఎవరైనా సరే బదిలీ, లేదా డెప్యూటేషన్‌పై శంకరగిరి మాన్యాలే’ అన్నంతగా వీసీ వ్యవహారం సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ వి.దామోదర్‌నాయుడును ఆదివారం సాయంత్రం తుళ్లూరు డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వీసీని అరెస్ట్‌ చేశారన్న వార్త దావానంలా వ్యాపించి వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. వీసీ అక్రమాలకు, అరాచకాలకు బలై డెప్యూటేషన్లు, బదిలీలపై వెళ్లిన, జరిమానాలు చెల్లించిన బాధితుల్లో ఒకింత ఆనందం వ్యక్తమైంది.

అంతా ఏకపక్షం
వీసీ దామోదర్‌నాయుడు ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, మిగిలిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు లాం ఫాంలోని యూనివర్సిటీ కాంపౌండ్‌లో ఉండటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసిన ఘటనలు ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎదురు చెప్పిన ఎందరినో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
ఆరు నెలల క్రితం వర్సిటీ సిబ్బంది 453 మంది వీసీ అరాచకాలకు బలయ్యామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దేశ చరిత్రలో ఒక వీసీపై ఇంతటి భారీస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉండి ఉండకపోవచ్చు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో అంతమంది సిబ్బంది ఫిర్యాదులు చేసినా వీసీపై కనీస చర్యలు కరువయ్యాయి. ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తనకు బాగా తెలుసని, ఆయనదీ, తనదీ ఒకే ఊరని, తనను ఎవరూ ఏమీ చేయలేరని వీసీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయటంతోపాటు బదిలీ చేశారన్న ఫిర్యాదులు అందాయి. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నో అపాయింట్‌మెంట్‌
దామోదర్‌నాయుడు వీసీగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. వీసీ పీఏ సైతం వచ్చిన వారు ఎవరో తెలుసుకుని ఓ సామాజికవర్గం వారు కాకుంటే అపాయింట్‌మెంట్‌ సిద్ధం చేసేవారు కాదని సిబ్బంది, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇతర వర్గాల వారు కలిసేందుకు వస్తే పీఏ కూడా అంగీకరించేవారు కాదన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. 
పది రోజులకుపైగా విచారణ
వీసీపై ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి ప్రద్యుమ్నతో సింగిల్‌మన్‌ కమిటీని నియమించి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 500 మందికిపైగా వీసీ బాధితులు సుమారు పది రోజులపాటు తమకు జరిగిన అన్యాయాలను ప్రద్యుమ్న ఎదుట ఏకరువుపెట్టారు. ఈ క్రమంలో బాధితులు రాష్ట్ర గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఊరికి చెందిన ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అండ ఉండగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు ఉన్నతాధికారులను వీసీ బెదిరించారని సమాచారం. 
అంతటా వీసీ అరెస్టుపై చర్చ
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధలో ఉన్న కార్యాలయాలు, కళాశాలల్లో వీసీ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీసీ నిరంకుశత్వం, ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్య «ధోరణి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వీసీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసేవారని అంతటా చెప్పుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులను సైతం మాజీ సీఎం చంద్రబాబు తన క్లాస్‌మెంట్, కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన జిల్లావాసి అంటూ వీసీ బెదిరించేవారని, ఎట్టకేలకు తగిన శాస్తి జరిగిందని పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement