వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మోకా సత్తిబాబు
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం, గుంటూరు) : దొంగతనాలకు పాల్పడిన అంతర్‌జిల్లాల పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు వివరాలు వెల్లడించారు. చల్లపల్లి మండలం రామనగరానికి చెందిన ముచ్చు సీతారామయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పేకాట, కోడిపందేలు, చిత్తులాటలతో పాటు మద్యానికి బానిసయ్యాడు. అవసరాల కోసం చోరీలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నాడు. తొమ్మిదేళ్లలో చల్లపల్లి, మచిలీపట్నం, గుడివాడ, విజయవాడలతో పాటు గుంటూరు జిల్లాలోనూ పలు చోరీలకు పాల్పడ్డాడు. అనేక కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. దీంతో చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆ బాధ్యతను సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు ఏఎస్పీ చెప్పారు.
చాకచక్యంగా అరెస్ట్..
నేరస్తుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం సంతసెంటర్ టర్నింగ్ వద్ద సీతారామయ్యను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సీతారామయ్య ఇంటి పెరట్లో దాచి ఉంచిన సుమారు రూ.17 లక్షలు విలువ చేసే 358.084 గ్రాముల బంగారు ఆభరణాలు, 236.500గ్రాముల వెండి వస్తువులుతో పాటు ఎల్‌ఈడీ టీవీ, రూ.18,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో బందరు సీసీఎస్ ఇన్‌చార్జి డీఎస్పీ అజీజ్, సీఐ బీవీ సుబ్బారావు, చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ పి.నాగరాజు, అవనిగడ్డ సీసీఎస్ ఎస్‌ఐలు శ్రీనివాస్, సత్యనారాయణ, మచిలీపట్నం ఎస్‌ఐలు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment