'సీఎం పాలన నియంతను తలపిస్తోంది'
ఏఎన్‌యూ (గుంటూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన నియంతను తలపిస్తోందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యమం ఉధృతమవుతోందని భావించి యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాలల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వటంపై శనివారం ఉదయం వర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహాలు, పరిపాలనాభవన్ వద్ద ధర్నా చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలనాభవన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. రిషితేశ్వరి ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలను అణచివేయటంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ మహిళలపై రక్షణ విషయంలో చూపాలన్నారు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాల బోర్డులను తొలగించటం రాజ్యాంగ విరుద్ధమని, ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటిని తొలగించవద్దన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారి హక్కులనే కాలరాసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరి గుడికి అనేక సార్లు వస్తున్న రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్.. పక్కనే ఉన్న యూనివర్సిటీకి మాత్రం రావటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా యూనివర్సిటీని సందర్శించి, పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కోరారు. బోర్డులు తొలగించటం లేదని ప్రకటించాలని రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌ను డిమాండ్ చేశారు.
దీనికి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం అమలు చేస్తున్నామని, తొలగించనని హామీ ఇచ్చే అధికారం తనకు లేదని చెప్పారు. విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నిర్ణయం మాత్రం వారిదేనన్నారు. మధ్యాహ్నంలోగా క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఉన్నాయని, వాటిని పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికలతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. సాయంత్రానికల్లా యూనివర్సిటీ వసతి గృహాలను ఖాళీ చేయించి పోలీసు అధికారులు గేట్లకు తాళాలు వేశారు.