అంతా సర్కారే చూసుకుంటుంది:వీసీలు
► హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీసీల స్పందన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్స్‌లర్లు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలకు చేపట్టిన వీసీల నియామకాలు చెల్లవని గత గురువారం హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్సిటీల నూతన వీసీలు విధుల్లో కొనసాగుతారా? వైదొలుగుతారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా వీసీలు మాత్రం రోజువారీ విధుల్లో తలమునకలయ్యారు.
గత నెల 25న నియామకమైన జేఎన్‌టీయూహెచ్ వీసీ డాక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ సీతారామారావు అదే రోజు బాధ్యతలు స్వీకరించారు. వీసీల నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వీసీల్లో నర్మగర్భంగా ఆందోళన మొదలైంది. ‘తమను ప్రభుత్వమే నియమించింది. నియామకాలు కూడా పారదర్శకంగా జరిగాయి. నిబంధనలకు అనుగుణంగానే పదవులను అలంకరించాం. కోర్టు ఏం తీర్పు చెప్పినా ప్రభుత్వమే ఆ వ్యవహారాన్ని చూసుకుంటుంది.
అసలు ఆ విషయాన్ని మేం పట్టించుకోవడం లేదు. మేం ప్రస్తుతం విధుల నిర్వహణ పైనే దృష్టి సారించాం. మాకొచ్చే ఇబ్బందేం లేదు’ అని ఓ వర్సిటీ వీసీ ధీమావ్యక్తం చేశారు. ‘కోర్టులంటే అందరికీ గౌరవమే. అయితే వీసీల నియామకాలు చెల్లవని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలు అందలేదు. అలాగని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ మాకు చేరలేదు. ప్రస్తుతమైతే వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం’ అని మరో వర్సిటీ వీసీ పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల చట్టాలను సవరించి ఇచ్చిన జీఓలకు అనుగుణంగా వీసీను నియమించారు. అసలు ఆ జీఓలే చెల్లవు.
అటువంటప్పుడు వీసీ నియామకాలు ఏమాత్రం చెల్లుబాటు కాబోవు. బహుశా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ స్టే విధిస్తే.. కొన్నాళ్లు నూతన వీసీలు తమ పదవుల్లో కొనసాగుతారు. లేదంటే పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది’ అని ఓ మాజీ వీసీ వివరించారు. మరోపక్క కనీస అర్హతలు లేకున్నా.. వీసీలుగా నియమితులైన వారు మరింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వీసీగా నియమితులు కావాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి. కానీ పలువురు వీసీలు ఐదేళ్ల అనుభవం ఉన్నా వీసీలుగా నియమితులయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని పలువురు వీసీలను అడగగా.. ‘నగరంలో ఉన్న వర్సిటీలకు నూతన వీసీలుగా కొనసాగుతున్న వారందరికీ ప్రొఫెసర్‌గా పదేళ్ల పైబడే అనుభవం ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. మొత్తం మీద నాలుగు వారాల తర్వాత నూతన వీసీలు కొనసాగుతారా? పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.