‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి బ్రేకులు | Sebi may ban pool accounts for mutual fund | Sakshi
Sakshi News home page

‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి బ్రేకులు

Published Wed, Dec 25 2019 5:25 AM | Last Updated on Wed, Dec 25 2019 5:25 AM

Sebi may ban pool accounts for mutual fund - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ పూల్‌ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. క్లయింట్ల పెట్టుబడులు, సెక్యూరిటీలను ట్రేడింగ్‌ ద్వారా లేదా క్లియరింగ్‌ సభ్యులు మార్జిన్ల కోసం తరలించడం.. తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లపై రుణాలు తీసుకోవడం, సెటిల్‌మెంట్లకు సర్దుబాటు చేయడం వంటి ఘటనలు తన దృష్టికి వచ్చినట్టు సెబీ మంగళవారం విడుదల చేసిన చర్చా పత్రంలో వెల్లడించింది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలను మధ్యవర్తులైన స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ సభ్యులు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్వహించినప్పుడు అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని సెబీ పేర్కొంది. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి నిధులు పూల్‌ అకౌంట్లు లేదా ఎస్క్రో ఖాతాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వీటి మూలాలను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తెలుసుకోలేవని సెబీ గుర్తించింది. ‘‘ఫండ్స్‌ యూనిట్లు, నిధులు బ్రోకర్ల ఖాతాల నుంచి రిజి స్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు లేదా ఏఎంసీల ఖాతాలకు వెళ్లాలి. ఇందుకోసం ఇన్వెస్టర్ల నిధులు మధ్యవర్తుల స్థాయిలో పూలింగ్‌ ఖాతాల్లోకి వచ్చి వెళుతుంటాయి.

దీంతో ఆయా నిధుల మూలాలు, ఇన్వెస్టర్ల వివరాలు ఏఎంసీలకు తెలిసే అవకాశం ఉండడం లేదు’’ అని సెబీ పేర్కొంది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను సురక్షితంగా మార్చేందుకు స్టాక్‌బ్రోకర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిధులు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల పూలింగ్‌ను నిలిపివేయాలని ప్రతిపాదించినట్టు సెబీ వెల్లడించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తన క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్‌ అకౌంట్‌కు తరలించి వాటిపై రుణాలు తీసుకోవడం, అనంతరం చెల్లింపుల్లో సమస్య ఏర్పడడం ఇటీవలే జరిగింది. ఈ పరిణామాలతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇదే తరహా రిస్క్‌ లేకుండా చూడాలన్నది సెబీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం..  
సెబీ తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా.. క్లయింట్లు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు వీలు కల్పించాల్సి ఉంటుంది. ‘‘స్టాక్‌ బ్రోకర్ల ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో జరిగే లావాదేవీల కోసం.. ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా గుర్తింపు పొందిన క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు నిధులు వెళ్లేందుకు, అలాగే క్లియరింగ్‌ కార్పొరేషన్‌ నుంచి నేరుగా క్లయింట్‌ బ్యాంకు ఖాతాకు నిధులు జమయ్యేం దుకు తగిన వ్యవస్థలను స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది’’అని సెబీ తెలిపింది.

ప్రజావేగులకు ప్రోత్సాహకం
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల్లో తగిన సమాచారంతో ముందుకు వచ్చిన ప్రజావేగులను ప్రోత్సహించే నూతన విధానాన్ని సెబీ రూపొందించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిషేధ నిబంధనల కింద కనీసం రూ.కోటి రూపాయల మేర రికవరీకి అవకాశం ఉన్న కేసుల్లో సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. అలాగే, తనకు ఏ రూపంలో సమాచారం వచ్చిందన్నది సెబీ వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతుంది.

మైనర్ల పేరిట ఫండ్స్‌లో పెట్టుబడులు
మైనర్ల పేరిట వారి సంరక్షకులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం, మేజర్లుగా మారిన తర్వాత సాఫీగా బదలాయింపునకు సంబంధించి సెబీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అన్ని ఏఎంసీల పరిధిలో ఈ ప్రక్రియ ఏకరూపంలో ఉండేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. పెట్టుబడులు మైనర్ల బ్యాంకు ఖాతాల నుంచి లేదా చెక్‌ లేదా డీడీ రూపంలో ఇవ్వవచ్చు. మైనర్, సంరక్షకుని సంయుక్త ఖాతా నుంచీ నిధులు పంపొచ్చు.  మేజర్‌ అయిన తర్వాత.. మేజర్‌కు ఉండే పూర్తి  హక్కులు దఖలు పడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement