సామాజిక మాధ్యమాల సాయంతో స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడే వారిపై సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది. సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ బిజినెస్ సాగిస్తున్న రవీంద్ర బాలు భారతి అనే వ్యక్తిపై చర్య తీసుకుంది. ఏప్రిల్ 4, 2025 వరకు సెక్యూరిటీ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా తాను సంపాదించిన మొత్తం రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
19 లక్షల మందికి సలహాలు..
నిబంధనల ప్రకారం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. అందులోనూ చాలా నియామాలున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా కొన్ని రోజులుగా రవీంద్ర బాలు భారతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టుబడి సలహాలు, స్టాక్ సిఫార్సులు చేస్తున్నట్లు సెబీ గుర్తించింది. దాంతో స్టాక్ మార్కెట్‌పై అనుభవం లేనివారే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించినట్లు తెలిపింది. తనకు చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్‌ల్లో దాదాపు 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో పెద్దమొత్తంలో నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టుబడి సలహాలు ఇస్తూ భారీగా నగదు పోగు చేసినట్లు సెబీ పేర్కొంది.
రూ.10 లక్షలు జరిమానా
రవీంద్ర సంపాదించిన డబ్బును రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌పై ఇన్వెస్ట్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఏప్రిల్ 2025 వరకు ఎలాంటి సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారతి, అతని సంస్థ, తన సహచరులపై సెబీ నిషేధం విధించింది. రవీంద్ర, తన సహచరులకు రూ.10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ మోసాలతో సంపాదించిన రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది.
ఇదీ చదవండి: రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణ
స్వతహాగా నేర్చుకోవడం ఉండదు..
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా, బంధువులు, స్నేహితులు చెబుతున్నారని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా డబ్బులు వచ్చినట్లు కనిపించినా దీర్ఘకాలంలో చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో ఎదుటి వ్యక్తులు, వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడే స్వభావం అలవడుతుందని అంటున్నారు. దాంతో మార్కెట్ గురించి స్వతహాగా నేర్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వీడియోలు చూసి ట్రేడింగ్ చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment