ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతోపాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
సంపద రాబట్టేందుకు ఈడీ ప్రయత్నం
నిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్‌లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మంత్రి మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకు చెందిన రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.
ఎన్‌ఎస్‌ఈఎల్.. రూ.17.47 కోట్లు రికవరీ
వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ సృష్టించే లక్ష్యంతో 2005లో ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) కుంభకోణంకు సంబంధించి రూ.17.47 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి ఈ డబ్బును ఇచ్చినట్లు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ఆధ్వర్యంలోని ప్రధాన కేసుల నుంచి కనీసం రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
బ్లాక్ మనీ చట్టంతో పెరిగిన సంఖ్య
2015లో రూపొందించిన బ్లాక్ మనీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఆస్తులను ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పెరిగిందన్నారు. జూన్ 2024 నాటికి బ్లాక్ మనీ చట్టం కింద మొత్తం రూ.17,520 కోట్లకు సంబంధించి 697 కేసుల విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 163 ప్రాసిక్యూషన్‌లు ప్రారంభమైనట్లు తెలిపారు. పనామా పేపర్లు, పండోర పేపర్లు, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐజే లీక్‌ల వంటి హైప్రొఫైల్ అంశాలకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment