రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారంటే.. | Vivek Oberoi diversified his investments built substantial net worth through various business ventures | Sakshi
Sakshi News home page

రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారంటే..

Dec 18 2024 3:08 PM | Updated on Dec 18 2024 4:23 PM

Vivek Oberoi diversified his investments built substantial net worth through various business ventures

వివేక్‌ ఒబెరాయ్ ప్రముఖ నటుడిగానే అందరికి తెలుసు. కానీ, తన పదహారో ఏటే స్టాక్‌ మార్కెట్‌లో శిక్షణ తీసుకుని కమోడిటీ ట్రేడింగ్‌ చేసేవారని చాలా మందికి తెలియకపోవచ్చు. అలా స్టాక్‌ మార్కెట్‌, నట జీవితంలో వచ్చిన డబ్బుతో పాటు విభిన్న వ్యాపారాల వల్ల తాను ప్రస్తుతం రూ.1,200 కోట్ల సంపదను సృష్టించుకున్నారు. అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తన సంపదను ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు.

వివేక్ ఒబెరాయ్ చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి సారించేవారు. తాను సినిమాల్లోకి రాకముందే వాయిస్‌ఓవర్ అసైన్‌మెంట్‌లు, హోస్టింగ్ షోలు చేసేవారు. అందులో వచ్చిన డబ్బును సమర్థంగా పెట్టుబడి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దాంతో విభిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తూ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి స్టాక్ బ్రోకర్లతో శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. తన పదహారో ఏట మార్కెట్‌లో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్‌ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.

వ్యూహాత్మక పెట్టుబడులు

ముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో పట్టా పొందిన వివేక్‌ ఒబెరాయ్‌ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్‌ ఈక్విటీ, రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్‌ల్లో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: రైల్వే కొత్త రూల్‌.. ఒరిజినల్‌ ఐడీ లేకుండా రైలెక్కితే..

రియల్ ఎస్టేట్‌: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్థాపించారు.

డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.

ఈవెంట్ మేనేజ్‌మెంట్‌: వివేక్ ‘మెగా ఎంటర్‌టైన్‌మెంట్‌’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీని స్థాపించారు.

ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.

ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్‌’ ద్వారా పెట్టుబడులను మేనేజ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement