మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.
ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్‌లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.
ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..
ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్‌పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment