గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం.. | Google Monopoly Ends For Android TVs In India Check The Fine Details, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..

Published Tue, Apr 22 2025 7:56 AM | Last Updated on Tue, Apr 22 2025 9:12 AM

Google Monopoly Ends For Android TVs In India Check The Fine Details

గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్‌లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్‌గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్‌కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.

గూగుల్, ఆల్ఫాబెట్‌లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్‌లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.

సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్‌మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.

గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్‌ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్‌లో ఏవి ఇన్‌స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్‌లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్ స్టోర్‌లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్‌లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్‌లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్‌లకు సేవలు అందిస్తున్నారు.

కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్‌లను డిఫాల్ట్‌గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్‌మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement