గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్‌బీసీ(రాస్‌బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.
ఆర్‌బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.
‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’
క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్‌కాస్టర్‌ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటు
గూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్‌లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్‌బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.
రష్యా గూగుల్ ఎల్‌ఎల్‌సీ దివాలా!
గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్‌ఎల్‌సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.
(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్‌లెట్లు!)
గూగుల్ స్పందన ఇదే..
‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment