న్యూఢిల్లీ: పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని నిర్ణీత గడువులోపు చెల్లించనందుకు గూగుల్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది.
పెనాల్టీ చెల్లించేందుకు గూగుల్‌కు ఇచ్చిన 60 రోజుల గడువు ఈ నెల 25నే ముగిసింది. దీంతో గూగుల్‌కు సీసీఐ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సీసీఐ నిబంధనల కింద జరిమానా చెల్లించేందుకు 30 రోజుల గడువే ఉంటుంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లామని, స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనుచిత వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సీసీఐ అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానాను విధించడం గమనార్హం. ప్లేస్టోర్ విధానాలపరంగా తనకున్న అధిక మార్కెట్ వాటాతో అనైతిక విధానాలు అనుసరిస్తున్నందుకు రూ.936 కోట్ల జరిమానా విధించాలంటూ అక్టోబర్ 25న మరో కేసు విషయంలో సీసీఐ ఆదేశించింది.
చదవండి: న్యూ ఇయర్‌లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు!
Comments
Please login to add a commentAdd a comment