Google India
-
Google Layoffs: ఆగని కోతలు.. ఈ సారి ఎంత మందినో..?
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో వరుస లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరికొందరిని వదిలించుకుంది. గూగుల్ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 453 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. తొలగించిన ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి మెయిల్స్ వెళ్లినట్లు తెలిసింది. బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం.. గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మెయిల్స్ పంపారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగించనున్నట్లు గత నెలలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం తొలగించిన 453 ఉద్యోగాలు గతంలో ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతల్లో భాగామేనా లేక కొత్త రౌండ్ లేఆఫ్‌లు ఉన్నాయా అన్నది ధ్రువీకరించలేదు. ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సీఈఓ సుందర్ పిచాయ్ నుంచి కూడా కొన్ని ఇన్పుట్లు ఉన్నట్లు తెలిసింది. తొలగింపులకు దారితీసిన నిర్ణయాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. జనవరిలో పంపిన నోట్లో యూఎస్ వెలుపల తొలగించిన గూగుల్ ఉద్యోగులకు స్థానిక నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా రావాల్సినవన్నీ అందుతాయని ఆయన పేర్కొన్నారు. గూగుల్లోనే ఇతర టెక్ కంపెనీల్లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అమెజాన్ తన వర్క్‌ఫోర్స్ నుంచి 18 వేల మందిని తొలగించాలని యోచిస్తోంది. ఇది తొలుత 10 వేల మందికే పరిమితం అనుకున్నా తర్వాత ఈ అంచనా మరింత పెరిగింది. మెటా కూడా 13 వేల మంది ఉద్యోగులను తొలగించింది. (ఇదీ చదవండి: లేఆఫ్‌ల ట్రెండ్.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్ సెక్యూరిటీకి ఏకంగా 115 కోట్ల ఖర్చు!) -
గూగుల్‌కు భారీ షాక్.. రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ: పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని నిర్ణీత గడువులోపు చెల్లించనందుకు గూగుల్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది. పెనాల్టీ చెల్లించేందుకు గూగుల్‌కు ఇచ్చిన 60 రోజుల గడువు ఈ నెల 25నే ముగిసింది. దీంతో గూగుల్‌కు సీసీఐ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సీసీఐ నిబంధనల కింద జరిమానా చెల్లించేందుకు 30 రోజుల గడువే ఉంటుంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లామని, స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనుచిత వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సీసీఐ అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానాను విధించడం గమనార్హం. ప్లేస్టోర్ విధానాలపరంగా తనకున్న అధిక మార్కెట్ వాటాతో అనైతిక విధానాలు అనుసరిస్తున్నందుకు రూ.936 కోట్ల జరిమానా విధించాలంటూ అక్టోబర్ 25న మరో కేసు విషయంలో సీసీఐ ఆదేశించింది. చదవండి: న్యూ ఇయర్లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు! -
గూగుల్‌పై మరో కేసు..విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్ కంటెంట్ ఆదాయ పంపకంలో సహేతుకంగా వ్యవహరించడం లేదంటూ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై మరో కేసు దాఖలైంది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) చేసిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గూగుల్‌పై కొనసాగుతున్న దాదాపు ఇదే తరహా రెండు కేసులతో కలిపి దీన్ని కూడా దర్యాప్తు చేయాలని పేర్కొంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ వేర్వేరుగా చేసిన రెండు ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. సీసీఐలో భాగమైన డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ కేసులను దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తారు. సెర్చి ఇంజిన్‌లో తమ వెబ్‌లింకులు ప్రముఖంగా కనిపించాలంటే గూగుల్ కు తప్పనిసరిగా కంటెంట్ సమకూర్చాల్సి వస్తోందని, కానీ గూగుల్ మాత్రం దీనికి ప్రతిగా అరకొర ప్రతిఫలమే ఇస్తోందని ఎన్బీడీఏ ఆరోపిస్తోంది. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి
Google India Tribute To Sirivennela Sitaramasastry: జగమంత కుటుంబాన్ని వదిలి సినీ అభిమానుల్ని ఒంటరి చేసి లోకాన్ని విడిచిపెట్టారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. 'సిరివెన్నెల' సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని, సాహిత్యంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. మెలోడీలు, జాగృతం, జానపదం , శృంగారం, విప్లవాత్మక గీతాలను అందించారు. ఆయన పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత సిరివెన్నెల. సిరివెన్నెల సీతరామ శాస్త్రి కలం సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అలాంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం సాహిత్యాభిమానులు, ప్రేక్షకులు, సినీ పెద్దలు, రాజకీయనాయకులు ఒకరేంటీ యావత్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఆ దిగ్గజ కవితో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. 'సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. 'ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్' అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్లో రాసుకొచ్చింది. Ok Google, play Sirivennela songs 😞💔 "సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌 — Google India (@GoogleIndia) November 30, 2021 ఇది చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత -
గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్‌లో యూట్యూబ్ షార్ట్స్ టైమ్ డ్యూరేషన్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో టైమ్ డ్యూరేషన్ తక్కువే 2020 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ షార్ట్స్ లో ఇన్సిడెంట్ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా 60 సెకన్ల వ్యవధి వీడియోను చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షార్ట్స్ వీడియోస్‌లో 15 సెకన్లు, అంతకంటే తక్కువ టైమ్ డ్యూరేషన్ ఉన్న వీడియోల్ని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో గూగుల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌తో లాభాలు యూట్యూబ్ షార్ట్స్ వల్ల నిర్వహకులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాట్ ఫాం సువర్ణ అవకాశమనే చెప్పుకోవాలి. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియో చేయడం చాలా ఈజీ. అదే సమయంలో వ్యూస్, ఛానల్ బ్రాండింగ్ వేగం పెరిగిపోతుంది. ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో సహాయపడుతుంది. క్రియేటర్లకు వంద మిలియన్ డాలర్లు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా డబ్బులు సంపాదించుకోవచ్చు. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు మనదేశంలో టిక్... టాక్ లేకపోవడంతో చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు గూగుల్ భారీ ఎత్తున ఫండ్‌ను కేటాయించింది. చదవండి: హాయ్ గైస్...నేను మీ షెర్రీని..!! -
‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!
విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్‌తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. అరెస్టైన మొదటి సత్యాగ్రహి 1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్‌రాజ్ నిహల్పూర్ గ్రామంలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్పూర్కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్‌పూర్‌లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్‌పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా. పిల్లలకు సైతం అర్థం అయ్యేలా.. హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్ వెళ్లి జబల్పూర్కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గూగుల్ డూడుల్స్ గౌరవం సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్‌కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్‌ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు. -
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్‌పిట్‌లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్‌తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్‌పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
వర్క్‌ఫ్రమ్ ‘ఆఫీస్’ నుంచి స్వల్ప ఊరట!
Google Employees Returning To Office: కరోనా నేపథ్యంలో సుమారు ఏడాదిన్నరగా వర్క్‌ఫ్రమ్ హోంలోనే ఉండిపోయారు కోట్ల మంది ఉద్యోగులు. అయితే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని చాలా కంపెనీలు మెయిల్స్ ద్వారా కరాకండిగా చెప్పేశాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ నడిపించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేశాయి. సిలికాన్ వ్యాలీ: సెప్టెంబర్ మొదటి వారం నుంచి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్ మీద ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి కంపెనీలు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోంను మరో నెలకు పైనే కొనసాగించాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు గూగుల్, ఫేస్బుక్, యాపిల్‌తో పాటు కొన్ని ఎమ్ఎన్సీలు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. అక్టోబర్ 18 వరకు ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోంలోనే కొనసాగొచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇక గూగుల్ నుంచి ప్రకటన వెలువడిన కాసేపటికే యాపిల్, ఆ వెంటనే ఫేస్బుక్ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే విడుదల చేశాయి. వ్యాక్సిన్లు వేయించుకున్నాకే ఆఫీసులకు రావాలని, కనీసం ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు తప్పనిసరి ఆదేశాల్లో పేర్కొన్నాయి కంపెనీలు. సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని పిలుపు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత-ప్రశాంతతమే తమకు ముఖ్యమని, ఈ పాలసీని యూఎస్ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని, కరోనా డెల్టా వేరియెంట్ విజృంభణ-ఎంప్లాయిస్‌లో భయాందోళనలు.. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంటుండడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీలైనంత త్వరగా ఆఫీసులకు ఉద్యోగులకు రప్పించే ప్రయత్నం చేస్తామని ఫేస్బుక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక తాజా ఆదేశాలతో మరికొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోంని మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగాలకు ఆకర్షణీయ సంస్థల్లో గూగుల్ టాప్
న్యూఢిల్లీ: ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా తర్వాత స్థానాల్లో నిల్చాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన గూగుల్ ఇండియా అత్యధికంగా మార్కులు దక్కించుకున్నట్లు రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. టాప్ 10 ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్స్ జాబితాలో ఇన్ఫోసిస్(4వ స్థానం), టాటా స్టీల్(5), డెల్(6), ఐబీఎం(7), టీసీఎస్(8), విప్రో(9), సోని(10) ఉన్నాయి. 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొన్నారు. ఉద్యోగం, కుటుంబానికి సమ ప్రాధాన్యం.. ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచి్చనట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. వారు అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. వేతన ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఈ అంశానికీ అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62%).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65%) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైంది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం(61%), ఉద్యోగ భద్రత(61%) అంశాలు తర్వాత స్థానా ల్లో ఉన్నాయి. కంపెనీల ఎంపికలో ఉద్యోగార్థుల కొలమానాలు మారుతున్నాయని విశ్వనాథ్ తెలిపారు. తమకు విలువనిచి్చ, అండగా నిలవడంతో పాటు తమ అభిప్రాయాలు, లక్ష్యాలకు అనుగుణమైన సంస్థలనే ఉద్యోగార్థులు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ : సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించింది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో భారత్‌లో 75,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని గూగుల్ సోమవారం ప్రకటించింది. గూగుల్ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ ఫర్ ఇండియా వర్చువల్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని స్పష్టం చేశారు. భారత్ భవితవ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తమకున్న నిదర్శనానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టిసారిస్తాయని చెప్పారు. ప్రతి భారతీయుడకి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడం, భారత్ అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలు డిజిటల్ బాట పట్టేలా సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్ ఇంటెలిజెన్స్ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను వెచ్చిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్‌ను సుందర్ పిచాయ్ ప్రశంసిస్తూ ఆన్లైన్ వేదికలో భారత్ గొప్ప పురోగతి సాధించిందని ప్రస్తుతించారు. డిజిటల్ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం, డేటా ధరల తగ్గింపు, అంతర్జాతీయ స్ధాయి మౌలిక వసతులతో నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు. 2004లో గూగుల్ హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంలో భారతీయ యూజర్లకు మెరుగైన సెర్చ్ సేవలను అందించడంపైనే ఫోకస్ చేశామని చెప్పారు. చదవండి : గూగుల్, అమెజాన్‌లకు చెక్ -
కేరళకు గూగుల్ భారీ సాయం..!
సాక్షి, న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు గూగుల్ భారీ సాయం ప్రకటించింది. రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్ ఇండియా ట్విటర్లో వెల్లడించింది. సంస్థ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. కాగా, గత శతాబ్ద కాలంలో కేరళ ఇంతటి భారీ ప్రకృతి విలయాన్ని చూడలేదు. 1924లో ముంచుకొచ్చిన వరద ముప్పు నుంచి తేరుకున్న దేవభూమి కేరళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాగా, ఈ నెల (ఆగస్టు) మెదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ నిండిపోవడంతో ఒకేసారి 34 ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో రాష్ట్రం వరద ముంపునకు గురైంది. కేరళ వ్యాప్తంగా 400 పైగా జనం వరదల్లో చిక్కుకుని మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు, ఈ విపత్తు పక్కకున్న కర్ణాటకను కూడా తాకింది. వరదల కారణంగా కొడగు జిల్లా నీట మునిగి 17 మంది చనిపోయారు. కేరళను ఆదుకోవడానికి దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రపంచంలోని కేరళీయులు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చి కేరళను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని పలు విశ్లేషణలు చెప్తున్నాయి. .@Googleorg and Google employees are contributing $1M, to support flood relief efforts in Kerala and Karnataka. #GoogleForIndia@RajanAnandan — Google India (@GoogleIndia) August 28, 2018 -
ఇంటర్నెట్లో... ‘లోకల్ కంటెంట్’ హవా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఇంటర్నెట్లో స్థానిక భాషల హవా నడుస్తోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ వంటి దేశీయ భాషల్లో కంటెంట్‌ను వాడుతున్న వినియోగదార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో భారత్‌లో నెటిజన్ల సంఖ్య అంచనాలను మించి దూసుకెళుతోందని గూగుల్ వెల్లడించింది. దేశీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్న యూజర్లు ప్రస్తుతం 23.4 కోట్లకుపైమాటే. ఏటా వీరి వృద్ధి రేటు 18 శాతముంది. 2021 నాటికి వీరి సంఖ్య 53.6 కోట్లను దాటనుందని గూగుల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ షాలినీ గిరీష్ బుధవారమిక్కడ తెలిపారు. అదే ఇంగ్లిషు కంటెంట్‌ను వాడుతున్న యూజర్ల సంఖ్య 17.5 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సంఖ్య మూడేళ్లలో 19.9 కోట్లకు చేరనుంది. ఏడాదిన్నరలో పెను మార్పు.. దేశీయ ఇంటర్నెట్ రంగంలో గత 18–20 నెలల్లో కనీవినీ ఎరుగనంత మార్పు చూస్తున్నామని గూగుల్ ఆగ్నేయాసియా, భారత్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అన్నారు. ‘టెలికం కంపెనీలు డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 40 కోట్లను దాటింది. ఇప్పుడు నెలకు 80 లక్షల నుంచి ఒక కోటి మంది కొత్త యూజర్లు చేరుతున్నారు. ఈ స్థాయి వృద్ధి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. కొత్త యూజర్లలో 10 మందిలో తొమ్మిది మంది స్థానిక భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. 28 శాతం మంది వాయిస్ సెర్చ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో 10 లక్షల సబ్‌స్క్రైబర్లున్న తెలుగు క్రియేటర్ ఒకటి మాత్రమే. ఇప్పుడు ఈ స్థాయి తెలుగు క్రియేటర్ల సంఖ్య 25కు చేరుకుంది. ఇంటర్నెట్ను అందరికీ చేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. గూగుల్ ఉత్పాదనలను స్థానిక భాషల్లో అందుబాటులోకి తెస్తున్నాం’ అని చెప్పారు. రెండో స్థానంలో తెలుగు.. ఇంటర్నెట్ సెర్చెస్ మూడింట రెండు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని షాలినీ గిరీష్ వెల్లడించారు. ‘తెలుగు సెర్చెస్ రెండు రెట్ల వేగంతో పెరుగుతున్నాయి. స్థానిక భాషల్లో వినియోగదార్ల పరంగా తెలుగు రెండో స్థానంలో ఉంది. లోకల్ లాంగ్వేజ్‌లో ఉన్న కంటెంట్‌ను 68 శాతం మంది యూజర్లు విశ్వసిస్తున్నారు. డిజిటల్ ప్రకటనల రంగం భారత్‌లో 2021 నాటికి సుమారు రూ.29,500 కోట్లకు చేరనుంది. ప్రస్తుతం ఇది రూ.13,400 కోట్లు ఉంది. స్థానిక భాషల ప్రకటనల వ్యాపారం వాటా ప్రస్తుతమున్న 5 శాతం నుంచి మూడేళ్లలో 35 శాతానికి చేరడం ఖాయం’ అని వివరించారు. తెలుగు ప్రకటనలకు మద్దతు.. దేశీయ భాషల్లో కంటెంట్‌కు డిమాండ్ అధికం అవుతున్న నేపథ్యంలో గూగుల్ ప్రకటనల ఉత్పాదనలైన యాడ్వర్డ్స్, యాడ్సెన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని తెలుగు భాషలోని ప్రకటనలకూ విస్తరించింది. దీంతో మరిన్ని తెలుగు ప్రకటనలు ఇక నుంచి దర్శనమీయనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రకటనకర్తలు మరింత మంది తెలుగు యూజర్లకు చేరువ అవుతారు. కంటెంట్ డెవలపర్లు, పబ్లిషర్లకు డిజిటల్ యాడ్స్ రంగంలో మెరుగైన వ్యాపార అవకాశాలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు హిందీ, బెంగాళీ, తమిళం భాషలకు మాత్రమే ఈ సాంకేతిక సౌలభ్యం ఉండేది. -
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రైల్‌టెల్‌తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు. 2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో శ్రీకారం చుట్టారు. రైల్‌టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్లెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. -
ప్రకటనల ఆదాయంపై పన్ను కట్టాల్సిందే
న్యూఢిల్లీ: గూగుల్ ఇండియా వాదన ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ (ఐటీఏటీ) గెలవలేదు. గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌కు జమచేసిన ప్రకటనల ఆదాయంపై గూగుల్ ఇండియా పన్ను చెల్లించాలన్న ఆదాయపన్ను శాఖ డిమాండ్‌ను ఐటీఏటీ సమర్థించింది. ఈ మేరకు ఐటీఏటీ బెంగళూరు బెంచ్ 331 పేజీలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. గూగుల్ ఇండియా పంపించే ఆదాయం రాయల్టీ కనుక, అది పన్ను పరిధిలోకి వస్తుందని ఆదాయపన్ను శాఖ చేసిన వాదనను ట్రిబ్యునల్ సమర్థించింది. అయితే, ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేస్తామని గూగుల్ తెలిపింది. ప్రకటనల స్పేస్‌ను కొనుగోలు చేసి దాన్ని తిరిగి భారత్‌లో ప్రకటనదారులకు గూగుల్ యాడ్వర్డ్స్ కార్యక్రమం కింద విక్రయిస్తున్నామని... అలా ఆర్జించిన ఆదాయాన్నే గూగుల్ ఐర్లాండ్‌కు పంపిస్తున్నామని... కాబట్టి ఇది పన్ను పరిధిలోకి రాదని గూగుల్ తన పిటిషన్లో పేర్కొంది. 2012–13 ఆర్థిక సంవత్సరానికిగాను మూలం వద్ద పన్ను కోయకుండా గూగుల్ ఇండియా రూ.1,114.91 కోట్లను గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌కు చెల్లించినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. దీంతో రూ.258.84 కోట్లు చెల్లించాలని కోరుతూ ట్యాక్స్ డిమాండ్‌ను జారీ చేసింది. అయితే, గూగుల్ యాడ్వర్డ్స్ కార్యక్రమానికి తాను ఏకైక డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నానని, గూగుల్ ఐర్లాండ్‌కు చెల్లించే డిస్ట్రిబ్యూషన్ ఫీజును ‘హక్కు బదిలీ’ లేదా పేటెంట్‌ను వినియోగించుకునే హక్కుగా చూడరాదని, దీన్ని రాయల్టీగా భావించి పన్ను వేయరాదని గూగుల్ ఇండియా వాదిస్తోంది. ఈ వాదనతో ఐటీఏటీ ఏకీభవించలేదు. -
ఇదేందయ్యా ఇది?
సాక్షి, న్యూఢిల్లీ ; గూగుల్‌లో చోటు చేసుకున్న ఓ తప్పిదంపై సెటైర్లు పేలుతున్నాయి. భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫోటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. అయితే అది వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటున గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రతినిధి దివ్య స్పందన స్పందించారు. గూగుల్ ఇండియా.. ఏ ప్రతిపాదికన ఇలా చేశారు? అంటూ ఆమె ట్వీట్లో మండిపడ్డారు. మరోవైపు ప్రముఖ జాతీయ ఛానెళ్లలో కూడా ఈ తప్పిదంపై కథనాలు ప్రసారం అయ్యాయి. మరికొందరు సోషల్ మీడియాలో దీనిని ట్రోల్ చేస్తూ గూగుల్‌పై సెటైర్లు వేస్తున్నారు. .@Google @GoogleIndia what algorithm of yours allows this?! You’re so full of junk- pic.twitter.com/GHyxh3fEWm — Divya Spandana/Ramya (@divyaspandana) 25 April 2018 When we search "India first PM" on Google, Narendra Modi image appears. Why? — I_am (@thenagawalrus) 25 April 2018 Surprised seeing the result of Ist PM pic in google search as "India first PM" @narendramodi @akashbanerjee @atanubhuyan @tulika_devi @pranaybordoloi #IndiafirstPM #google pic.twitter.com/5uhnLlTlJc — Afrida Hussain (@afrida786) 25 April 2018 -
చార్జీల భారం లేకుండా చెల్లింపులు
న్యూఢిల్లీ: తేజ్ యాప్ వినియోగదారులకు శుభవార్త. ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బుల్ని పంపడం, పొందటం వంటి డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఒక మొబైల్ వాలెట్ యాప్ ‘తేజ్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. సంస్థ ఇప్పుడు ఈ యాప్‌ను సరికొత్త ఫీచర్‌తో అప్డేట్ చేసింది. యుటిలిటీ బిల్ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు తేజ్ యాప్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జీలు లేకుండా. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే తేజ్ యాప్ ద్వారా దాదాపు 90 యుటిలిటీ సంస్థల కస్టమర్లు వారి బిల్లులను ఆన్లైన్లో చెల్లించొచ్చని సంస్థ పేర్కొంది. ‘మా డిజిటల్ పేమెంట్స్ యాప్‌కి కొత్తగా బిల్ పే ఫీచర్‌ను జోడించాం. దీంతో ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, డీటీహెచ్, ఇన్సూరెన్స్ ప్రీమియం సహా వివిధ రకాల బిల్లులను చెల్లించొచ్చు’ అని గూగుల్ నెక్స్ బిలియన్ యూజర్స్ (కామర్స్ అండ్ పేమెంట్స్ విభాగం) వైస్ ప్రెసిడెంట్ డయానా లేఫీల్డ్ వివరించారు. బిల్లు గడువు దగ్గరకు వచ్చినప్పుడు తేజ్ యాప్ నోటిఫికేషన్ ద్వారా ఆ విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుందని తెలిపారు. -
దేశంలో మోస్ట్ అట్రాక్టివ్ సంస్థ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్‌గా నిలిచింది. హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ రాండ్‌స్టడ్ సర్వే ప్రకారం గూగుల్ ఇండియా ఎట్రాక్టివ్ ఎంప్లాయిర్గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. అలాగే మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండవ స్తానంలో నిలిచింది. మానవ వనరుల సేవల సంస్థ రాండ్‌స్టడ్ 2017 నివేదిక సర్వే ప్రకారం గూగుల్ ఈ ఘనతను సాధించింది. ఈ సర్వే లో ఈ కామర్స్ లో అమెజాన్ ఇండియా, ఎఫ్ఎంసీజీ ఐటీసీ, కన్యూమర్ అండ్ హెల్త్ కేర్ ఫిలిప్స్ ఇండియాలాంటి దిగ్గజాలు ఈ పోటీల్లో రంగాలవారీగా టాప్‌లో నిలిచాయి. మరోవైపు స్టార్ట్ అప్ కంపెనీల్లో పనిచేయడానికి ఐటీ నిపుణులు మొగ్గు చూపుతున్నారట. నిపుణులు, ప్రతిభావంతులలైన ఉద్యోగులకోసం కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కొనసాగిస్తున్నాయని రాండ్ స్టడ్ ఇండియా ఎండీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తీ కే ఉప్పాపురి చెప్పారు. క్రొత్త బ్రాండ్లను ఆకర్షించడం, నిలబెట్టుకోవడంతోపాటు పెట్టుబడిదారుల బ్రాండింగ్ వాల్యూను పెంచుకోవడంపై సంస్థలు దృష్టిపెట్టాయని తెలిపారు. సర్వే ఫలితాలు ప్రకారం, పెద్ద, బహుళజాతి సంస్థలు ఉద్యోగులు ఇష్టపడే ఎక్కువ కార్యాలయంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీ, ఐటి, రిటైల్, ఎఫ్ఎంసిజి రంగాల కంపెనీల కోసం భారతీయలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారుని సర్వేలో తేలింది. దేశంలో ఉత్తమ 'యజమాని బ్రాండ్'ను గుర్తించేందుకు రాండ్ స్టడ్ అవార్డు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. -
ట్రా'ఫికర్'కు డ్యాష్‌బోర్డుతో చెక్
♦ గూగుల్ ఇండియా సంస్థ సహకారం ♦ 15 నిమిషాల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం బెంగళూరు: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన బెంగళూరులో రోడ్లపైకి వాహనాలు పోటెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రతీరోజు నగరంలోని అన్ని ప్రాంతాల్లో విపరీతంగా చోటుచేసుకుంటున్న ట్రాఫిక్‌జామ్‌లు పద్మవ్యూహాన్ని తలపిస్తూ ప్రజలకు నరకప్రాయమవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు చోటుచేసుకుంటుండడంతో ట్రాఫిక్ పోలీసులకు కూడా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి తలకు మించిన భారమవుతోంది. సమస్యను పరిష్కరించడంలో భాగంగా నగర పోలీసులు డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకు గూగుల్‌ఇండియా సంస్థ సహకారం అందిస్తోంది. ఈ డ్యాష్ బోర్డు ద్వారా నగరంలోని 45 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సరిహద్దులు, రోడ్లు, సిగ్నల్స్, ముఖ్యమైన జంక్షన్ల పేర్లతో పాటు ఆ ప్రాంతాల్లోని వాహనరద్దీని కూడా తెలుసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లపై ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్‌లతో పాటు ఖాళీగా ఉన్న రోడ్ల వివరాల గురించి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల దీపాల ద్వారా ట్రాఫిక్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ట్రాఫిక్పోలీసులు తమ స్మార్ట్ఫోన్లలో డ్యాష్‌బోర్డ్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ రద్దీ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం (టీఎంసీ) లోని సిబ్బంది కూడా డ్యాష్‌బోర్డ్ ద్వారా ట్రాఫిక్ రద్దీ సమాచారాన్ని మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్‌జామ్ చోటు చేసుకున్న ప్రాంత వివరాలను ఆ ప్రాంతానికి చెందిన ట్రాఫిక్ విభాగపు కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకూ చేరుతుంది. దీంతో సమస్యను త్వరగా పరిష్కరించడానికి వీలువుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రతను అనుసరించి ఏఏ అధికారి సదరు ప్రాంతానికి వెళ్లాలన్న విషయంపై కూడా నిబంధనలను పోలీసు శాఖ ఇప్పటికే రూపొందించింది. దీనిపై ఇక ట్రాఫిక్‌జామ్‌కు సంబంధించిన సమాచారం రాగానే ఆ ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్ 15నిమిషాల్లో అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌జామ్ సమస్య 30నిమిషాలకు పైగా చోటుచేసుకుంటే ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. 45నిమిషాలు లేదా గంట పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకుంటే ట్రాఫిక్ డీసీపీతో పాటు ట్రాఫిక్ అదనపు పోలీస్కమీషనర్ స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు ‘డ్యాష్‌బోర్డ్’ ద్వారా ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. ట్రాఫిక్‌జామ్‌కు సంబంధించిన వివరాలు తెలియగానే ఆ ప్రాంతానికి చేరుకొని సిగ్నలింగ్‌తో పాటు వాహనదారులకు ఖాళీగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను సూచించడం ద్వారా ట్రాఫిక్‌జామ్‌ను క్లియర్ చేయడానికి సులభతరమవుతుంది’. –ఆర్.హితేంద్ర, నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమీషనర్ -
'మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ అథ్లెట్' గా సింధు..!
ఇండియా బాడ్మింటన్ సెన్సేషన్... రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ లో రజత పతకాన్ని సాధించిన సింధు... 'మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ అథ్లెట్' గా గూగుల్ సెర్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. 58 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ రెండో స్థానంలో ఉన్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నోజోమీ ఒకుహారాను ఓడించి ఫైనల్స్ కు చేరుకున్న పీవీ సింధును భారత్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. సింధు తర్వాతి స్థానంలో సాక్షి మాలిక్ ఉండగా... అగ్రశోధనల్లో కిదాంబి శ్రీకాంత్, వినేష్ పోగట్ కూడా ఉన్నట్లు తెలిపింది. అలాగే ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో పోటీచేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ కూడా టాప్ సెర్చ్ జాబితాలో ఒకరిగా నిలిచింది. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, లలితా బాబర్, వికాస్ కృష్ణన్ లు గూగుల్ టాప్ సెర్స్ లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాల్యాండ్ లతోపాటు గోవా, పుదుచ్ఛేరి, హర్యానా, ఉత్తరాఖండ్ లు టాప్ 10 సెర్స్ ప్రాంతాలుగా గుర్తించిన గూగుల్.. ఒలింపిక్స్ పై సెర్స్ చేసిన దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిలిచినట్లు గూగుల్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. రియో ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంలో భారతీయులు ఎక్కువగా బాడ్మింటన్ గురించి, రెజ్లింగ్ గురించి వెతికారని కూడా గూగుల్ తెలిపింది. అయితే వీరితోపాటు.. ఇటీవల రియోలో గోల్డ్ మెడల్ సాధించిన, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసైన్ బోల్ట్ గురించి కూడా ఇండియాలో అత్యధిక జనాభా వెతికినట్లు వెల్లడించింది. విదేశీ క్రీడాకారుల్లో బోల్ట్ తర్వాత చైనా షట్లర్ లిన్ డాన్, ఒకుహారా, స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ ల గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తన ప్రకటనలో తెలిపింది. -
చెన్నై చిచ్చరపిడుగుకు గూగుల్ ఇండియా అవార్డు
చెన్నై: ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.. నిర్వహించే ‘కోడ్ టు లెర్న్ కాంటెస్ట్’లో చెన్నైకి చెందిన శ్రీకృష్ణ మధుసూదనన్ విజేతగా నిలిచాడు. భారత్‌లో కంప్యూటర్ సైన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గూగుల్ సంస్థ ‘కోడ్ టు లెర్న్ కాంటెస్ట్’ పేరుతో ప్రతి సంవత్సరం ఈ పోటీని నిర్వహిస్తోంది. భారత దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గూగుల్ ఈ అవార్డును ప్రారంభించింది. గత ఏడాది నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో పెరంగుడిలోని బీవీఎం గ్లోబల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న శ్రీకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అవార్డును దక్కించుకున్నాడు. తన బిడ్డకు అవార్డు రావడం గురించి శ్రీకృష్ణ తల్లి శాంతి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే కంప్యూటర్ అంటే ఆసక్తి కనబర్చేవాడని, బీవీఎం పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్ సైన్స్ తరగతులు ఉపయోగపడ్డాయన్నారు. -
గ్రామీణ ప్రాంతాలకు ‘ఇంటర్నెట్ సైకిల్ బళ్లు’
ముంబై: గ్రామీణ ప్రాంతాల మహిళల్లో ఇంటర్నెట్పై అవగాహన పెంచే దిశగా టాటా ట్రస్ట్స్, గూగుల్ ఇండియా నడుం బిగించాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 1,000 ‘ఇంటర్నెట్ సైకిల్ తోపుడు బళ్లను’ మారుమూల గ్రామాలకు పంపనున్నాయి. శుక్రవారం వీటి ఆవిష్కరణ కార్యక్రమంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా, గూగుల్ ఇండియా ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ పాల్గొన్నారు. ఐస్‌క్రీములు, ఇతర ఉత్పత్తులు విక్రయించే సంప్రదాయ తోపుడు బళ్ల తరహాలోనే.. ఇంటర్నెట్పై అవగాహన పెంచేందుకు సైకిల్ బళ్లను ఉపయోగించనున్నట్లు ఆనందన్ పేర్కొన్నారు. తోపుడు బండిని తీసుకొచ్చే ఆపరేటరు (ఇంటర్నెట్ సాథి).. ఆయా గ్రామా ల్లో మహిళలకు ఇంటర్నెట్ వినియోగంపై శిక్షణనిస్తారని వివరించారు. ముందుగా గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్‌లలో ఇంటర్నెట్ సైకిళ్లు సర్వీసులు మొదలవుతాయని, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని టాటా ట్రస్ట్స్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్ వెంకటరమణన్ తెలిపారు. సుమారు 4-6 నెలల పాటు ఒకో గ్రామం/క్లస్టర్లో వారానికి 2రోజుల పాటు ఈ సైకిల్ కార్ట్ అందుబాటులో ఉంటుందని వివరించారు. -
రెండేళ్లలో ఆన్‌లైన్‌లోకి 2 కోట్ల చిన్న సంస్థలు
గూగుల్ ఇండియా లక్ష్యం న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌లో 2 కోట్ల పైగా చిన్న, మధ్య త రహా (ఎస్ఎంబీ) సంస్థలను ఆన్లైన్ మాధ్యమంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఇందుకోసం గూగుల్ మై బిజినెస్ (జీఎంబీ) మొబైల్ యాప్‌ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. దీన్ని ఉపయోగించుకుని ఎస్ఎంబీలు .. ఇంగ్లీషు, హిందీ భాషల్లో తమ వ్యాపారాల వివరాలను ఆన్లైన్లో ఉచితంగా పొందుపర్చవచ్చని చెప్పారు. -
మార్కెట్లోకి గూగుల్ క్రోమ్‌బుక్స్
న్యూఢిల్లీ: విద్యార్థులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా గూగుల్ ఇండియా వివిధ కంపెనీలకు చెందిన క్రోమ్‌బుక్స్, క్రోమ్బాక్స్లను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. క్రోమ్‌బుక్స్ గతేడాదే మార్కెట్ లోకి వచ్చాయని, ప్రస్తుతం తాము మూడు కొత్త క్రోమ్‌బుక్స్‌ను మార్కెట్లోకి విడుదలచేస్తున్నామని క్రోమ్ ఓఎస్ గ్లోబల్ ప్రాడక్స్ మేనేజర్ స్మిత హష్మిమ్ అన్నారు. జోలో, నిషియన్ క్రోమ్‌బుక్స్ రూ.12,999ల ధరతో అమెజాన్, స్నాప్‌డీల్‌లలో లభిస్తున్నాయని తెలిపారు. వీటి ప్రి-బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఆసూస్ క్రోమ్‌బుక్స్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వ్యాపారవేత్తలకు క్రోమ్‌బుక్స్, క్రోమ్బాక్స్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయన్నారు.