విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్‌తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది.
అరెస్టైన మొదటి సత్యాగ్రహి
1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్‌రాజ్ నిహల్‌పూర్ గ్రామంలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్‌పూర్‌కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్‌పూర్‌లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్‌పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా.
పిల్లలకు సైతం అర్థం అయ్యేలా..
హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్ వెళ్లి జబల్‌పూర్‌కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
గూగుల్ డూడుల్స్ గౌరవం
సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్‌కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్‌ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment