హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్ పురస్కారం
జాతీయం
హోమీబాబా నివాసం వేలం
భారత అణు ఇంధన కార్యక్రమ పితామహుడు హోమీ జే బాబాకు చెందిన మూడంతస్తుల భవనం మెహ్రాన్ గిర్‌ను జూన్ 18న వేలం వేశారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ బంగళా రూ. 372 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే కొన్నవారి వివరాలను గోప్యంగా ఉంచారు. దీనికి ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) ఈ వేలాన్ని నిర్వహించింది. అయితే ఈ బార్క్ శాస్త్రవేత్తలు ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బాంబే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించాలని కోరుతున్నారు.
ప్రపంచ చారిత్రక స్థలంగా రాణీ కీ వావ్
గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఇటీవల బయటపడ్డ రాణీ కీ వావ్ బావిని ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేరుస్తూ దోహాలో జూన్ 22న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదించింది. ఏడు భూగర్భ అంతస్తులున్న ఈ బావికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో చోటు కల్పించింది. సిద్దార్థ జైసింగ్ అనే రాజు 11వ శతాబ్దంలో ఈ బావిని నిర్మించాడు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో కులూ జిల్లాలో గల గ్రేట్హిమాలయన్ నేషనల్పార్క్కు కూడా చోటు లభించింది. ప్రస్తుతం ఆమోదించిన ప్రదేశాలతో కలిసి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా 1001కు చేరింది.
చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ల రాజీనామా
చత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ శేఖర్‌దత్ జూన్ 18న తన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందజేశారు. ఆయన పదవీకాలం జనవరి 2015లో ముగియాల్సి ఉంది. శేఖర్‌దత్ జనవరి 23, 2010లో చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. జూన్ 17న ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి కూడా రాజీనామా చేశారు.
పీఎస్‌యూల్లో 25 శాతం వాటా ప్రజలకే: సెబీ
ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లు (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్-ఎంపీఎస్) ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్దేశించింది. ఈ మేరకు ఆ వాటాలను మూడు సంవత్సరాలలో విక్రయించాలని జూన్ 19న న్యూఢిల్లీలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్న 36 ప్రభుత్వ రంగ సంస్థలలో షేర్ల విక్రయానికి వీలు కలిగింది. తద్వారా సుమారు రూ. 60 వేల కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించడానికి వీలవుతుందని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా వివరించారు.
రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా కోడెల
ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా డాక్టర్ కోడెల ప్రసాదరావు (టీడీపీ), డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధ ప్రసాద్ (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ధర్మవరం పట్టుచీరకు జాతీయ గుర్తింపు
అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది. ధర్మవరంలో తయారైన పట్టుచీరలను ఇతర ప్రాంతాల వారు కొనుగోలు చేసి తమ లోగోలను అతికించి విక్రయించేవారు. వాటికి తావివ్వకుండా ప్రభుత్వం ఇక్కడి పట్టుచీరల నాణ్యత, కళలను గుర్తించి జాతీయ పత్రం ఇవ్వడం శుభపరిణామం.
తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా రామకృష్ణారెడ్డి
తెలంగాణ తొలి అడ్వొకేట్ జనరల్‌గా కె. రామకృష్ణారెడ్డి జూన్ 23న బాధ్యతలు స్వీకరించారు. అదే
విధంగా తెలంగాణ తొలి అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జె. రామచంద్రరావు కూడా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టాటా
తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి టాటాగ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జూన్ 23న ప్రకటించారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.
అంతర్జాతీయం ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌గా జీద్ అల్ -హుస్సేన్
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కొత్త హైకమిషనర్‌గా జోర్డాన్ యువరాజు జీద్ అల్ - హుస్సేన్ నియామకానికి సమితి సర్వ ప్రతినిధిసభ జూన్ 16న ఆమోదం తెలిపింది. ఈయన ఈ పదవిని చేపట్టిన తొలి ముస్లిం, అరబ్. హుస్సేన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ రాయబారిగా ఉన్నారు. సెప్టెంబర్ 1న హుస్సేన్ మానవహక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిల్లే ఈ పదవిలో కొనసాగుతున్నారు. జీద్ అల్ -హుస్సేన్‌కు శాంతి స్థాపన, అంతర్జాతీయ న్యాయ రంగాల్లో అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.
51 మిలియన్లకు చేరిన ప్రపంచ కాందిశీకులు
2013 చివరినాటికి పోరాటాలు, సంక్షోభాల వల్ల నిరాశ్రయులైన కాందిశీకులు అత్యధికంగా 51.2 మిలియన్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి కాందిశీకుల సంస్థ జూన్ 20న పేర్కొంది. ఈ సంఖ్య గతేడాది కంటే ఆరు మిలియన్లు ఎక్కువ. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వీరి సంఖ్య అత్యధిక స్థాయికి చేరింది. సిరియా సంక్షోభం వల్ల ఈ సంఖ్య పెరిగిపోయిందని నివేదికలో పేర్కొంది.
స్విస్ బ్యాంకుల్లో అక్రమసంపదగల దేశాల
జాబితాలో భారత్‌కు 58 వ స్థానం
స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ 2013 సంవత్సరపు అధికారిక గణాంకాలను జూన్ 22న విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా నిల్వ ఉన్న సంపద గల దేశాల జాబితాలో భారత్ 58వ స్థానంలో ఉంది. గతేడాది భారత్ 70వ స్థానంలో ఉండేది. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ప్రపంచ సంపద 1.6 ట్రిలియన్ డాలర్లలో భారత్ వాటా కేవలం 0.15 శాతం. ఈ మొత్తం సంపద రూ. 14వేల కోట్లు. కాగా అగ్రస్థానంలో 20 శాతం వాటాతో యునెటైడ్ కింగ్డమ్, తరువాత స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ ఉన్నాయి.
క్రీడలు
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహమ్మద్ ఆష్రాఫుల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. ఆష్రాఫుల్తోపాటు ఢాకా గ్లాడియేటర్స్ జట్టు యజమాని పిహబ్ చౌదరి పదేళ్ల నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరాన్నిఅంగీకరించినందుకు ఆష్రాఫుల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జూన్ 18న క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలను తీసుకుంది.
షూటర్ జీతూకు స్వర్ణం
స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత ఆటగాడు జీతూరాయ్ స్వర్ణం సాధించాడు. ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్లో 200.8 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకు ముందే ప్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పిన
స్టువర్ట్ బిన్నీ
వన్డే క్రికెట్లో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్లో జూన్ 17న భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ఉన్న అనిల్‌కుంబ్లే రికార్డును అధిగమించాడు. కుంబ్లే 1993లో వెస్టిండీస్‌పై కోల్‌కతాలో 12 పరుగులకు 6 వికెట్లు తీసిన రికార్డు ఇప్పటివరకు ఉంది.
ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ విజేత మాగ్నస్ కార్లస్
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్లస్ ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. చెస్ క్లబ్ ఆఫ్ దుబాయ్‌లో జూన్ 18న జరిగిన పోటీల్లో మాగ్నస్ 15 పాయింట్లకు గాను 11 పాయింట్లు గెలిచి విజేతగా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచ చెస్ ఫెడరేషన్ నిర్వహించడం ఇది మూడోసారి.
ఆస్ట్రియా గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్
ఆస్ట్రియా గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. జూన్ 22న 71 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ 27 నిమిషాల 54.976 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో రోస్బర్గ్కు ఇది మూడో విజయం. కాగా ఇదే జట్టుకు చెందిన లూయీస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆకాశ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఆకాశ్ క్షిపణి శక్తి, సామర్థ్యాల నిర్ధారణకు సైన్యం నిర్వహించిన ఆఖరు పరీక్ష విజయవంతమైంది. దీంతో సైన్యం అమ్ముల పొదిలో చేరేందుకు ఈ క్షిపణి సిద్ధమైంది. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన ఆకాశ్‌ను జూన్ 18న సరిహద్దు దగ్గర పరీక్షించారు. గగనతలంలో 30 మీటర్ల ఎత్తులో ఎగురు తున్న బన్షీ అనే చిన్న మానవరహిత వాహనాన్ని తక్కువ ఎత్తులోనే ఎగిరివెళ్లి ఆకాశ్ ధ్వంసం చేసింది. దీంతో సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం ఆకాశ్ ధ్వంసం చేయగలదని రుజువైంది. ఆకాశ్ 30 కి.మీ దూరంలో, 18 కి.మీ ఎత్తులో ఉన్న లక్ష్యాలను చేదించగలదు.
సుఖోయ్ నుంచి అస్త్ర పరీక్ష
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. జూన్ 20న గోవా సమీపంలోని నావికాదళ స్థావరంపై క్షిపణి నియంత్రణ, మార్గదర్శకత్వంపై ఆకాశంలో 6 కి.మీల ఎత్తులో ఈ పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నిర్వహించింది.
అవార్డులు
నార్వే మాజీ ప్రధానికి ఆసియా నోబెల్
నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్ ల్యాండ్‌కు ఆసి యా నోబెల్‌గా పేర్కొనే తాంగ్ ప్రైజ్ లభించింది. సుస్థిర అభివృద్ధి-అమలు, నాయకత్వం, నవకల్పనలకు గాను అవార్డుల కమిటీ ఆమెను ఎంపిక చేసింది. బ్రంట్‌లాండ్ గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి ప్రపంచ కమిషన్ అధిపతిగా పనిచేశారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్ ల్యాండ్‌కు ప్రకటించారు. ఈ బహుమతి మొత్తం విలువ రూ. 10 కోట్లు. తాంగ్ ప్రైజ్ వ్యవస్థాపకుడు తైవాన్ దేశానికి చెందిన డాక్టర్ శామ్యూల్ ఇన్. రెండేళ్లకు ఓసారి ఈ అవార్డును ప్రకటిస్తారు.
మురళీమనోహర్‌జోషికి రష్యా పురస్కారం
భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి రష్యా అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచే ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని రష్యా విదేశీయులకు అందిస్తోంది. భారత్‌లో జూన్ 18,19 తేదీల్లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్ అవార్డును జోషీకి అందజేశారు.
భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార పురస్కారం
భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడిన సంజయ రాజారామ్ అనే వృక్షశాస్త్రవేత్త ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం -2014కు ఎంపికయ్యారు. రాజారామ్ గోధుమ రకాలను సంకరీకరణం చేసి, విశిష్ట జన్యు లక్షణాలు గల అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు. ఆయన అభివృద్ధి చేసిన 480 గోధుమ రకాలను 51 దే శాల్లో విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో పుట్టిన రాజారామ్ మెక్సికోలో స్థిరపడ్డారు. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్‌తో కలిసి ఆయన పనిచేశారు. ప్రపంచ ఆహార పురస్కారాన్ని 1986లో నార్మన్‌బోర్లాగ్ నెలకొల్పారు. ఈ అవార్డును రాజారామ్ అక్టోబర్‌లో అందుకోనున్నారు.
హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్
2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం (49వది) ప్రముఖ హిందీకవి కేదార్నాథ్ సింగ్‌కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన 80 ఏళ్ల కేదార్నాథ్ కవిత లతోపాటు పలు వ్యాసాలు, కథలు రాశారు. అభీ బిల్కుల్ అభీ, యహ సే దేఖో రచనలు ఆయనకు పేరు తెచ్చిపెట్టారు. ఈ అవార్డుకు ఎంపికైన హిందీ రచయితల్లో కేదార్నాథ్ పదో వ్యక్తి. అవార్డు కింద రూ. 11 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. 1965 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 2012 సంవత్సరానికి రావూరి భరద్వాజకు ఈ పురస్కారం లభించింది.
సల్మాన్ రష్దీకి పెన్‌పింటర్ ప్రైజ్
భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన పెన్ పింటర్ ప్రైజ్ కు ఎంపికయ్యారు. సాహిత్యసేవ, భావ ప్రకటనకు ఇచ్చిన మద్దతుకుగాను ఈ బహుమతి లభించింది. ఈ మేరకు అవార్డులను ప్రదానం చేసే రైటర్ చారిటీ ఇంగ్లిష్ పెన్ అనే సంస్థ జూన్ 20న లండన్‌లో ప్రకటించింది. ఈ బహుమతిని 2009లో నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం నెలకొల్పారు.