google doodle
-
గూగుల్‌కు ఓటింగ్ శోభ!
లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్‌తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్‌కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్‌ను గూగుల్ సెర్చ్ పేజీపై ప్రదర్శిస్తోంది.దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్‌పై నేటి గూగుల్ డూడుల్ భారత్‌లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.ఈరోజు పోలింగ్ జరుగుతన్న మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 ఉన్నాయి. -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్‌లో భాగంగా.. పంజాబ్‌లో ఒకరిని, కోల్‌కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్‌తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్‌తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్‌కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్‌లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
శ్రీదేవికి అరుదైన గౌరవం.. 60వ బర్త్‌డే స్పెషల్!
అతిలోక సుందరి శ్రీదేవి.. సినీ ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఈమె చరిష్మా అలాంటిది. హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని గుర్తుచేసుకుంటున్నారు. అలా శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) తమిళనాడులో పుట్టిన శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుని శ్రీదేవి అయ్యింది. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు. ఇకపోతే తన నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్‌గా శ్రీదేవి ఫొటోని డిస్ప్లే చేసింది. మంచి కలర్‌ఫుల్ లుక్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే.. 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటనే గుర్తొస్తోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) -
గూగుల్ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్ ఏంటి? ఆమె ఎవరూ..?
గూగుల్ డూడుల్ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్ ఏకంగా ఐ ఫ్రేమ్‌తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్‌ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్? ఆ మహిళెవరూ? గూగుల్ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్‌ని రూపొందించింది. ఐ ఫ్రేమ్ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్‌తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్ ఐ ఫ్రేమ్ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ఆమె యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్ మహిళలకి సరికొత్త స్టయిల్ గ్లాస్‌లతో.. తమ గ్లామర్‌ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది. కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్‌లు మహిళ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్ డిజైన్ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్ డిజైన్ గురించి వివరించింది. వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్‌లని 'హర్లెక్విన్ గ్లాసెస్' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్ జార్జ్ గ్రోజ్తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. (చదవండి: ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్..ఏ మహిళదో తెలుసా!) -
మలయాళ మొదటి హీరోయిన్ ఆమెనే.. గుర్తు చేసిన గూగుల్
ఇప్పుడు సినిమా అంటే రంగుల ప్రపంచం. స్క్రీన్‌పై మాయ చేసే ఓ కలర్‌పుల్ ప్రపంచం. మరీ అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవో తెలుసా. అప్పటి నటీనటులు బ్లాక్ అండ్ వైట్ తెరపై ఎలా కనిపించారో మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఆ కాలంలోనూ అత్యంత అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన నటి పీకే రోజీ. దళితులపై కఠినమైన ఆంక్షలున్న ఆ రోజుల్లో తెరపై కనిపించిన మొట్ట మొదటి మలయాళ నటి ఆమెనే. ఇవాళ ఆమె 120 బర్త్‌డే సందర్భంగా గూగుల్ ఆమెను గౌరవించింది. గూగుల్ డూడుల్ మొదటి మలయాళ నటిని బర్త్ డే సందర్భంగా ప్రదర్శించింది. ఆ సమయంలో అనేక అడ్డంకులను అధిగమించి సినిమాల్లో నటించింది. పీకే రోజీ 1903లో కేరళలోని త్రివేండ్రంలో(తిరువనంతపురం) రాజమ్మగా జన్మించింది. ఆమెది పేద కుటుంబం. చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించారు. ఆమె సంగీతం, నటనను గుర్తించిన రోజీ మేనమామ ప్రోత్సాహం అందించారు. నాటకాలు వేస్తూ తనలోని ప్రతిభను చాటుకుంది. ఆ విధంగా కక్కరిసీ అనే నాటకంపై గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నాటకం ఎక్కడ ప్రదర్శించినా అపూర్వ స్పందన వచ్చేది. ఈ క్రమంలోనే అప్పటి ఫిల్మ్ మేకర్ జేసీ డేనియల్ దృష్టిని ఆకర్శించారామె. ఆ తర్వాత తాను తీయబోయే విగతుకుమారన్ అనే చిత్రానికి రోజీని తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. దీంతో మొట్టమొదటి దళిత హీరోయిన్గా రోజీ నిలిచింది. అయితే ఈ సినిమాలో పీకే రోజీ అగ్ర వర్ణ కులానికి చెందిన మహిళగా నటించారు. దీన్ని ఆ వర్గం వారు కొందరు వ్యతిరేకించారు. అంతేకాదు కాకుండా సినిమా ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించొద్దని కూడా నిరసన చేశారు. సినిమా ప్రదర్శన సమయంలో తెరపై కొందరు రాళ్లు విసిరేశారట. అప్పటికీ కోపం తగ్గని వారంతా కలిసి రోజీ ఏదో నేరం చేసిందన్నట్టుగా ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత రోజీ ఓ లారీలో తమిళనాడుకు పారిపోయారని.. అక్కడ లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైని పెళ్లి చేసుకొని రాజమ్మాళ్ పేరుతో అక్కడే స్థిరపడిపోయారని సమాచారం. ఆమె ఒక నటి అన్న సంగతి కూడా ఆమె పిల్లలకు తెలియదని చెబుతారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఆమె జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో గుర్తుకు తెచ్చింది. -
గూగుల్‌ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్
దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్‌ను మెప్పించి విజేతగా నిలిచాడు ఓ కుర్రాడు. ఆ డూడుల్ ఇప్పుడు బాలల దినోత్సవం సందర్భంగా.. గూగుల్ హోం పేజీలో దర్శనమిస్తోంది. గూగుల్ సోమవారం ఉదయం డూడుల్ ఫర్ గూగుల్ 2022 పోటీల ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే డూడుల్‌ను రూపొందించాడు శ్లోక్. అది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రకటించింది గూగుల్. సోమవారం ఆ డూడుల్ Google.co.inలో ప్రదర్శితమవుతోంది. న్యూటౌన్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు శ్లోక్. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్‌ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంటుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్ సందేశంలో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి ఈ పోటీకి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఈ పోటీకి అర్హులు. మొత్తం ఎంట్రీల నుంచి చివరగా 20 మందిని ఎంపిక చేశారు. చివరికి శ్లోక్‌ను విజేతగా ప్రకటించారు. గూగుల్ డూడుల్ టీంతో పాటు న్యాయనిర్ణేతల ప్యానెల్లో ప్రముఖ నటి, ఫిల్మ్ మేకర్ నీనా గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. డూడుల్ ఫర్ గూగుల్ పోటీలు.. యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
62 ఏళ్లపాటు అలరించిన అమృత గానం ఆయనది
ట్రెండింగ్.. ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్ హజారికా. ఇవాళ ఆయన జయంతి. అందుకే గూగుల్ అలా డూడుల్‌తో గౌరవించింది. భూపేన్ హజారికా.. సుధాకాంత(కోకిల)గా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాలపాటు తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించారాయన. వందల కొద్దీ పాటలు పాడి గాయకుడిగానే కాకుండా ఫిల్మ్‌మేకర్‌గా, రచయితగా కూడా సాహిత్య లోకానికి సేవలందించారు. మరోవైపు ఎమ్మెల్యేగానూ ఆయన రాజకీయ రంగంలో రాణించారు. అంతేనా.. నటుడిగా కూడా వందల చిత్రాల్లో అస్సామీ ఆడియెన్స్‌ను అలరించారు ఆయన. ఇద్దరూ గానకోకిలలే.. లతా మంగేష్కర్తో హజారికా (పాత చిత్రం) ► హజారికా.. సెప్టెంబర్ 8, 1926లో అస్సాంలో జన్మించారు. బ్రహ్మపుత్ర తీరం వెంట ఆయన బాల్యం గడిచింది. ఆ తీరం వెంటే జానపద కథలు, గేయాలు వినుకుంటూ పెరిగారాయన. విశేషం ఏంటంటే.. హజారికా తన పదేళ్ల వయసులోనే తొలి పాటను రికార్డ్ చేశారు. ► అస్సాంకు చెందిన ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్ అగర్వాల ప్రోత్సాహంతో హజారికా రాటుదేలారు. ► 1946లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో కొంతకాలం జీవించిన ఆయన.. 1952 కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీహెచ్డీ అందుకున్నారు. ► హజారికా గాన ప్రస్థానం గువాహతి ఆల్ఇండియా రేడియో నుంచి మొదలైంది. బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి.. గాత్రం అందించారు. ► ఆయన అందించిన సాహిత్యం.. గాత్రంలో నవరసాలు పండేవి. ► రుడాలి, మిల్ గయి మాంజిల్ ముఝే, సాజ్, దార్మియారీ, గజగామిని, దామన్, క్యూన్ తదితర చిత్రాల్లో ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ కల్ట్ క్లాసిక్‌గా మిగిలాయి. ► ఈశాన్య భారతం నుంచి.. అస్సాం జానపద సాహిత్యాన్ని యావత్ దేశానికి పరిచయం చేసింది ఈయనే. ► రాజకీయాల మీద ఆసక్తితో ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు 1967లో పోటీ చేశారు. నౌబోయిచా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే.. తిరిగి 2004లోనూ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తరపు నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ► సంగీతానికి, సంప్రదాయానికి ఆయన అందించిన సేవలకుగానూ.. సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ► 1998 నుంచి ఐదేళ్లపాటు సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా ఆయన పని చేశారు. ► 2011లో అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఐదు నెలలపాటు చికిత్స పొందుతూ.. చివరికి అవయవాల పని ఆగిపోవడంతో నవంబర్ 5వ తేదీన కన్నుమూశారు. అస్సాంకు గౌరవం తీసుకొచ్చిన ఆయన అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారు. ► మరణాంతరం.. 2012లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ► 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న గౌరవం ఆయనకు దక్కింది. ► అస్సామీ భాషలో మానవత్వం, సోదరభావం పెంపొందించేలా ఆయన పాటలు రాసి.. పాడారు. ► తన జీవితంలో తొలినాళ్లలో.. కోయిబర్టా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని సంగీత విద్వాంసుడిగా అంగీకరించని అగ్రవర్ణ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయన. అయితే ఈ చర్యకు బదులుగా.. ఆయన ప్రేమించిన బ్రహ్మణ యువతిని ఆయనకు దూరం చేశారు. చివరికి.. కుల-వ్యతిరేక సమాజంపై ఆయన ప్రతీకారం తీరింది. అదెలాగంటే.. ఓ బ్రహ్మణ యువతిని వివాహం చేసుకోవడం ద్వారానే!. ► ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ రుతుజా మాలి, హజారికా 96వ జయంతి సందర్భంగా ఈ డూడుల్‌ను క్రియేట్ చేశారు. -
Anna Mani: నాన్నా.. నేనెందుకు చదువుకోకూడదు?!
ఒకప్పటి పరిస్థితులు వేరే!. పురుషాధిక్య సమాజంలో పలు రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే అలాంటి తారతమ్యాలను నిలదీసి.. తాను ఎందులోనూ ఎవరికీ తీసిపోనని నిరూపించుకున్నారు అన్నా మణి. విచిత్రమేంటంటే.. ఆమె పోరాటం మొదలైంది ఇంటి నుంచే!. అన్నా మణి.. భారత వాతావరణ సూచన తల్లి mother of Indian weather forecast గా పేర్కొంటారు. 1918 కేరళ పీర్మేడ్లో సిరియన్-క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారామె. చాలా ఉన్నత కుటుంబం, విద్యావంతుల కుటుంబం ఆమెది. కానీ, ఆడబిడ్డలు వివాహానికే పరిమితం కావాలనే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పే పోరాటం చేసింది అన్నా మణి. తాను చదువుకోవాలని.. చదువు తన హక్కుగా పేర్కొంటూ తండ్రిని ఒప్పించి.. స్కూల్లో చేరింది. బాల మేధావిగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఉపన్యాసకురాలిగా, వాతావరణ నిపుణురాలిగా.. అన్నింటికి మించి భారత వాతావరణ శాఖకు ఆమె అందించిన సేవలు.. ఈనాటికీ చిరస్మరణీయం. అన్నా మణి జయంతి నేడు(ఆగస్టు 23). ఈ 104వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్ డూడుల్ రిలీజ్ చేసింది గూగుల్. ► తన ఎనిమిదవ పుట్టినరోజుకు ఇంట్లో వాళ్లు డైమండ్ ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారు. కానీ, అన్నా మణి మాత్రం వాటిని తీసుకోలేదు. వాటికి బదులు.. Encyclopædia Britannica కావాలని ఆమె పెద్ద గొడవే చేసిందట. ► పబ్లిక్ లైబ్రరీలో పుస్తకాలను పన్నెండేళ్ల వయసులోనే తిరగేసింది. బాల మేధావిగా గుర్తింపు. ► మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. నారీ శక్తికి ఉదాహరణగా.. దేశభక్తిని ప్రదర్శించింది. ► చెన్నైలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారామె. ► ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో.. రీసెర్చ్ స్కాలర్షిప్ గెల్చుకుంది. ► లండన్ ఇంపీరియల్ కళాశాలలో ఫిజిక్స్ అభ్యసించింది. కానీ, ఆ తర్వాత వాతావరణ శాస్త్రం పట్ల ఆసక్తికనబర్చింది. ► పీహెచ్డీ కల మాత్రం కలగానే మిగిలిపోయింది అన్నా మణికి. ► డబ్యూసీసీలో ఉపన్యాసకురాలిగా పని చేయడంతో పాటు.. సీవీ రామన్ దగ్గర ఐఐఎస్‌లో స్పెక్ట్రోస్కోపీ అభ్యసించారామె. ► 1948లో భారత్‌ను తిరిగొచ్చిన ఆమె.. ఆమె భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. ► వాయు వేగం, సోలార్ ఎనర్జీ కొలమానం కోసం పరికరాలను తయారు చేసి.. వాటితో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ► పురుషాధిక్య సమాజం.. రంగంలోనూ ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ► భారత వాతావరణ శాఖ ఐఎండీకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఆమె విధులు నిర్వహించారు. ► 1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్‌తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ► గుండె సంబంధిత సమస్యలతో.. 2001, ఆగస్టు 16న ఆమె కన్నుమూశారు. ► సోలార్ రేడియేషన్, ఓజోన్, విండ్ ఎనర్జీ కొలమానం కోసం ఎన్నో పరిశోధనలు చేసి.. వ్యాసాలు రాశారు. ► కేవలం తన విద్యా-విజ్ఞాన సుముపార్జన, ఆసక్తి ఉన్న రంగంపైనే దృష్టి పెట్టిన ఆమె వివాహానికి దూరంగా ఉన్నారు. ► ప్రపంచ వాతావరణ సంస్థ 100వ జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది మరియు అన్నా ఇంటర్వ్యూతో పాటు ఆమె జీవిత ప్రొఫైల్‌ను ప్రచురించింది. -
ప్చ్.. ఆస్కార్‌కు ఆస్కార్ మాత్రం రాలేదు!
సినీ ప్రపంచంలో ఆయనొక సంచలనం. ఒకరకంగా ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడు. అయినా ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ మాత్రం రాలేదు. ఆయనే ఆస్కార్ సాలా. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్‌తో నివాళి ఇచ్చింది. బెర్లిన్: భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్ సంగీత స్వరకర్త ఆస్కార్ సాలా 112వ జయంతి వేడుకలను గూగుల్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్ ద్వారా ఆస్కార్ సాలాకు నివాళులర్పించింది. జర్మనీలోని గ్రీజ్‌లో 1910లో జన్మించిన ఆస్కార్‌ను ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడిగా పిలుస్తారు. ఆయన 1930లో ఎలక్ట్రానిక్ సింథసైజర్‌తో చేసిన 'ట్రాటోనియం' అనే పరికరాన్ని వాయించేవారు. ఆస్కార్ సాలా తల్లి గాయని కాగా.. తండ్రి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.. కంటి డాక్టర్ కూడా. సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్ సాలా. చిన్న వయసులోనే పియానో వాయిస్తూ కన్సెర్ట్‌లు ఇచ్చేవారు. బెర్లిన్‌కు చెందిన వయోలిస్ట్ పాల్ హిందెమిత్ వద్ద పియోనో వాయించటం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్రెడరిక్ ట్రాట్వీన్ కనిపెట్టిన ఎలక్ట్రానిక్ సింథసైజర్ ట్రాటోనియంపై ఆసక్తి పెంచుకున్నారు. దాంతో పాటు భౌతికశాస్త్రం, స్వరకల్పనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిక్సర్ ట్రాటోనియంను అభివృద్ధి చేశారు. ప్రత్యేక డిజైన్‌లో ఒకేసారి పలు రకాల శబ్దాలు, మాటలను వినిపించేలా ఉండటం దాని ప్రత్యేకత. ఒక స్వరక్తరగా, ఎలక్ట్రో ఇంజినీర్‌గా ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో విశేష సేవలందించారు. సినిమాలకు సంగీతం.. 1940-50 మధ్య చాలా సినిమాలకు పని చేశారు ఆస్కార్ సాలా. ఆ తర్వాత తన సొంత స్టూడియోలో చాలా సినిమాలకు ఎలక్ట్రానిక్ సౌండ్ట్రాక్స్ను అందించారు. అలాగే.. రేడియో, టీవీ కార్యక్రమాలతో పాటు రోస్మ్యారీ(1959), ద బర్డ్స్(1962) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత.. క్వార్టెట్ ట్రాటోనియం, కన్సెర్ట్ ట్రాటోనియం, వోల్క్స్ట్రాటోనియంలను అభివృద్ధి చేశారు. 1995లో జర్మనీ మ్యూజియంకు తన మిక్సర్ ట్రాటోనియంను విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.. ఒక్క ఆస్కార్ తప్ప.! ఇదీ చదవండి: గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది. ఇంతవరకు మనం ఎన్నో పుస్తకాల గురించి విన్నాం. ఎందరో రచయితలు ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు.. వాటిల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలూ ఉన్నాయి. కానీ ఈరోజు గూగుల్ స్లైడ్ షో ఒక యువతి రాసిన డైరీని దాని సారాంశం గురించి తెలియజేసింది. ఏంటా డైరీ? ఏమిటీ దాని ప్రత్యేకత? ఎందుకు గూగుల్ సైతం ఆ డైరీకి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకుందాం! వివరాల్లోకెళ్తే...హోలో కాస్ట్ బాధితురాలు (జాతి ప్రక్షాళన లేదా సాముహిక విధ్వంసం) అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాలకు సంబంధించిన డైరీ. ఈ డైరీ ప్రచురణకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా గూగుల్ ఈ అందమైన డూడుల్ షోతో తెలియపరిచింది. ఈ డూడుల్‌ని ఆర్ట్ డైరెక్టర్ థోకా మేర్ రూపొందించారు. అన్నే ఫ్రాంక్ కేవలం15 ఏళ్ల వయసులో ఈ డైరీని రాసింది. ఆమె యూదు డచ్ జర్మన్. అన్నే ఫ్రాంక్ జూన్ 12, 1929న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒట్టో, ఎడిత్ ఫ్రాంక్‌లకు జన్మించారు. ఐతే ఆమె కుటుంబం నాజీ పార్టీ చేస్తున్న హింస, వివక్షత నుంచి తప్పించుకోవడానికి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు తరలివెళ్లింది. ఆమెకు 10 ఏళ్ల వయసులో ఉండగా రెండోవ ప్రపంచ యుద్ధం రాజుకుంది. దీంతో అన్నే కుటుంబం ఆమె తండ్రి కార్యాలయంలోని రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఐతే నాజీ సీక్రెట్ సర్వీస్ వారిని గుర్తించి నిర్బంధానికి తరలించింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ పరిస్థితులును, సంఘటనలను తన డైరీలో పొందుపరిచింది. ఆ తర్వాత ఆ డైరీని పుస్తకంగా ప్రచురించారు. కాలక్రమేణ నాన్ ఫిక్షన్ రచనలలో ఒకటిగా మారింది. అంతేకాదు 80 కంటే ఎక్కువ భాషల్లో అనువదింపబడిన అన్నే ఫ్రాంక్ జ్ఞాపకాల దొంతర. నాటి వివక్ష, దౌర్జన్యం, భయంకరమైన ప్రమాదాల గురించి రానున్న తరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించడానికి ఒక ముఖ్య సాధనంగా ఉపకరిస్తుంది. Dear Kitty, Today, we are revisiting the day #AnneFrank’s greatest wish came true. Our #GoogleDoodle marks the day ‘The Diary of a Young Girl’ was published, which held a first-hand account of Anne about the years she spent in hiding: https://t.co/kNmBipFoUb. pic.twitter.com/je8SkNuqpF — Google India (@GoogleIndia) June 25, 2022 -
డియర్ ఐన్‌స్టీన్ సార్.. నేనెవరో మీకు తెలీదు
అల్బర్ట్ ఐన్‌స్టీన్.. ఓ ప్రపంచం మేధావి. అలాంటిది అపరిచితుడిగా పరిచయం చేసుకుంటూనే ఆయన నుంచి ‘శెభాష్’ అనిపించుకున్నాడు భారత్‌కు చెందిన యువ శాస్త్రవేత్త. ఆయనే సత్యేంద్ర నాథ్ బోస్. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో వీళ్లిద్దరి కృషికి బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలుగా గుర్తింపు దక్కించుకుంది. ఆ గుర్తింపు దక్కి నేటికి 98 ఏళ్లు అవుతుంది. 1924, జూన్ 4వ తేదీన జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్.. భారత్‌కు చెందిన సత్యేంద్రనాథ్ బోస్ కృషిని గుర్తించారు. క్వాంటమ్ మెకానిక్స్‌లో బోస్ కనిపెట్టిన థియరీతో ఏకీభవించారు ఐన్‌స్టీన్. అంతేకాదు స్వయంగా ఆయనే జర్మన్లోకి అనువదించి మరీ.. బోస్ పేరిట వ్యాసం ప్రచురించారు. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టానికి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. గూగుల్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం డూడుల్‌ను రిలీజ్ చేసింది. ‘‘డియర్ సర్, మీ పరిశీలన, అభిప్రాయం కోసం నేను మీకు ఈ కథనాన్ని పంపించాను. క్లాసికల్ ఎలెక్ట్రోడైనమిక్స్ నుండి స్వతంత్రంగా ప్లాంక్ నియమం లోని గుణకం 8π ν2/c3ను తగ్గించడానికి నేను ప్రయత్నించాను. దశ-అంతరాళంలో అంతిమ ప్రాథమిక ప్రాంతంలో కంటెంట్ h3 ఉందని మాత్రమే ఊహిస్తారు. ఈ పరిశోధనా పత్రాన్ని అనువదించడానికి నాకు తగినంత జర్మన్ భాష తెలియదు. ఈ పత్రం ప్రచురణ విలువైనదని మీరు అనుకుంటే, మీరు దాని ప్రచురణను "జైట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్" లో వచ్చేటట్లు చేస్తే నేను కృతజ్ఞుడను. నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి అభ్యర్థన చేయడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మీ రచనల ద్వారా మీ బోధనల ద్వారా లాభం పొందిన మేమంతా మీ విద్యార్థులం. సాపేక్షతపై మీ పత్రాలను ఆంగ్లంలో అనువదించడానికి కలకత్తాకు చెందిన ఎవరైనా మీ అనుమతి కోరినట్లు మీకు ఇంకా గుర్తుందో,లేదో నాకు తెలియదు. మీరు ఆ అభ్యర్థనను అంగీకరించారు. అప్పటి నుండి ఆ పుస్తకం ప్రచురించబడింది. సాధారణీకరించిన సాపేక్షతపై మీ పరిశోధనా పత్రాలను నేనే అనువదించాను. మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి నేను ఆత్రుతగా ఉన్నాను’’ అంటూ లేఖ పంపారు సత్యేంద్రనాథ్ బోస్. ► ఇండియన్ ఫిజిక్స్ త్రిమూర్తులుగా.. సర్ సీవీరామన్, మేఘనాథ్ సాహా, సత్యేంధ్రనాథ్ బోస్‌లకు పేరుంది. ► ఫిజిక్స్ కణ భౌతికశాస్త్రంలో వినిపించే హిల్స్ బోసన్(దైవకణాలు) అనే పదంలో.. బోసాన్ అంటే ఏంటో కాదు.. బోస్ పేరు మీదే బ్రిటిష్ సైంటిస్ట్ పాల్ డిరాక్ అలా నామకరణం చేశారు. ► బోస్-ఐన్‌స్టీన్ స్టాటిక్స్కుగానూ.. 1956లో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఫిజిక్స్‌పై ఆయన పరిశోధలను, రచనలను నోబెల్ కమిటీ పట్టించుకోలేదు. ► కానీ, బోస్ ప్రతిపాదించిన బోసన్, బోస్-ఐన్‌స్టీన్ థియరీల ఆధారంగా చేపట్టిన పరిశోధనలకు ఏడు నోబెల్ బహుమతులు వచ్చాయంటే ఆయన కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ► 1954లో భారత ప్రభుత్వం సత్యేంద్రనాథ్ బోస్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ► పలు యూనివర్సిటీలలో బోధకుడిగా, పరిశోధనా కమిటిలలోనూ ఆయన పని చేశారు. ► సత్యేంద్రనాథ్బోస్.. పశ్చిమ బెంగాల్ కోల్‌కతా(కలకత్తా)లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ► ప్రఫుల్ల చంద్రరాయ్, జగదీశ్చంద్రబోస్లు ఈయనకు గురువులు. ► లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ , ఐన్‌స్టీన్‌లతో కలిసి పని చేసే అవకాశం దక్కింది ఈయనకు. ► అనువర్తిత గణితశాస్త్రంలో ఎమ్మెస్సీ కలకత్తా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడాయన. ► 1974 ఫిబ్రవరి 4వ తేదీన 80 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ఆయన కన్నుమూశారు. ► కేవలం ఫిజిక్స్ మాత్రమేకాదు.. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ట్స్‌లోనూ ఆయన ఎంతో కృషి చేశారు. ► నోబెల్ దక్కకపోతేనేం.. ఈ మేధావి మేధస్సును గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కొనియాడారు. మాతృదేశం గుర్తించింది. నేడు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. తమ పరిశోధనలతో ఆయన కృషిని నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు. -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్‌లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్‌కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్‌కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్‌లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్‌లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్‌గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్‌ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్‌కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్‌ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్‌షిప్‌లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
గూగుల్.. ఆడవాళ్లు మీకు జోహార్లు
వివక్ష.. ఇది కనిపించని రంగమంటూ లేదు. అయితే ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలు మాత్రం జరుగు... తూనే ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ గతకొంతకాలంగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ పోటీలు మొదలుకాగా.. ఈ టోర్నీకి మద్ధతుగా గూగుల్ డూడుల్‌తో ప్లేయర్లకు జోహార్లు చెప్పింది. 12వ ఎడిషన్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు మార్చి 4న ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ దాకా జరగబోయే ఈ టోర్నీ కోసం గూగుల్ డూడుల్‌ను రిలీజ్ చేసింది. ఆరుగురు ప్లేయర్లు ప్రేక్షకుల మధ్య గేమ్‌లో మునిగిపోయినట్లు ఉండే డూడుల్ ఇది. గూగుల్ హోం పేజీలో ఈ డూడుల్‌ను మీరూ గమనించొచ్చు. క్లిక్ చేయగానే స్కోర్ బోర్డుకు వెళ్లడంతో పాటు బాల్స్ ఎడమ నుంచి కుడికి దూసుకెళ్లడం చూడొచ్చు. New Google Doodle has been released: "Women's Cricket World Cup 2022 Begins!" :)#google #doodle #designhttps://t.co/oM7i79OJ1E pic.twitter.com/UeRDYk14qt — Google Doodles EN (@Doodle123_EN) March 3, 2022 ప్రపంచంలో తొలి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1844లో కెనడా, అమెరికా మధ్య జరిగింది. అయితే మహిళల ప్రపంచ కప్ మాత్రం 1973 నుంచి మొదలైంది. కొవిడ్ కారణంగా కిందటి ఏడాది జరగాల్సిన టోర్నీ.. ఈ ఏడాదికి వాయిదా పడింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మొదలైంది. విండీస్ 259 పరుగులు సాధించగా.. 260 పరుగుల లక్క్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది. మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ దాయాది పాక్‌తో మార్చ్ 6వ తేదీన(ఆదివారం) తలపడనుంది. ఉదయం 6.30ని. మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఆసీస్, ఇంగ్లండ్‌లు ఫేవరెట్‌గా ఉన్నాయి ఈసారి టోర్నీలో. -
గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?
Google Doodle Celebrating Pizza: ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా? చేస్తే.. డూడుల్‌లో ఉన్న పిజ్జా మార్క్‌ను చూశారా?.. కనీసం క్లిక్ చేసి చూశారా?.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డిష్ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్ డూడుల్ ద్వారా మినీ గేమ్‌ను నిర్వహిస్తోంది. ఈ మినీ పజిల్ గేమ్ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్ చేస్తుంటారు. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లు అక్కడ చూపించే పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్‌కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్‌గా కట్ చేస్తేనే పాయింట్లు(స్టార్స్) దక్కుతాయి. అలా లెవెల్స్‌ను దాటుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ►పిజ్జా.. ఇటాలియన్ డిష్ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్ అనే ప్రచారం కూడా ఉంది). ►నెపోలిటన్ పిజ్జాయ్‌యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్ ద్వారా తయారు చేయడం. ►నేపుల్స్(కాంపానియా రీజియన్ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. ►పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్‌యువొలొ’ అంటారు. ►పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుంటుంది. ►2020 పిజ్జా గ్లోబల్ బిజినెస్‌లో.. వెస్ట్రన్ యూరప్ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ►ఉత్తర అమెరికా 48.6 బిలియన్ డాలర్లు. ►ఆసియా దేశాల్లో 11.7 బిలియన్ డాలర్లు ►ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ►ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్) వెళ్తుంటాయి. ►2019 నుంచి పిజ్జా మార్కెటింగ్ గ్లోబల్ వైడ్‌గా విపరీతంగా జరుగుతోంది. ►2023 నాటికి పిజ్జా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. ►సోషల్‌మీడియా అడ్వర్టైజింగ్ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్ నిపుణుల అంచనా. ►నార్వే, స్వీడన్లలో ఫ్రొజెన్, గ్లూటెన్ పిజ్జాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇప్పుడు. ►యూరప్, నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్, లాటిన్ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్, బ్రెజిల్.. పిజ్జా మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి. ►భారత్‌లో కరోనా సీజన్లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్ మార్కెట్ వాల్యూ 1.52 బిలియన్ డాలర్లు దాటేసింది. ► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. ►మొత్తం భారత్ పిజ్జా మార్కెట్లో డొమినోస్ వాటా 55 శాతంగా ఉంటోంది. పైగా డొమినోస్ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. ►ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి భారత్‌లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారు. ►అయితే భారత్‌లో బ్రాండెడ్ పిజ్జా బిజినెస్‌తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్ బిజినెస్ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే బ్రాండెడ్ పిజ్జా మార్కెట్‌కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా. ►ఎదురయ్యే ఛాలెంజ్.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్ ఆపరేటర్లతో పాటు ఔట్లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. -సాక్షి వెబ్‌స్పెషల్ -
గూగుల్ డూడుల్‌లో కనిపిస్తున్న ఈ వైద్యురాలు ఎవరంటే..
Google Doodle Dr Kamal Ranadive : మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆమెకు సంబంధించి ప్రత్యేక డూడుల్‌ని క్రియేట్ చేసింది. ఈ డూడుల్‌లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్. నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ రణదీవ్ సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. రణదీవ్ డూడుల్‌ని భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించారు. (చదవండి: ‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!) డాక్టర్ రణదీవ్ గురించి.. కమలా సమరాథ్ అలియాస్ కమలా రణదీవ్ 1917, నవంబర్ 8న పుణెలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన కమలా రణదీవ్.. వైద్య విద్యను అభ్యసించారు. కాకపోతే తనుకు బయాలజీ అంటే చాలా ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో పని చేస్తూ కణ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఆమెకు డాక్టరేట్ వచ్చింది. అనంతరం అమెరికా మేరిల్యాండ్, బాల్టిమోరిలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఫెలోషిప్ పొందారు. ఆ తర్వాత ముంబై తిరిగి వచ్చి.. ఐసీఆర్సీలో చేరారు. అక్కడ డాక్టర్ రణదీవ్ దేశంలోని తొలి టిష్యూ కల్చర్ లాబరేటరీని ఏర్పాటు చేశారు. ఐసీఆర్సీ డైరెక్టర్‌గా పని చేస్తూనే క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌కి, వంశపారంపర్యానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడమే కాక కొన్ని వైరస్‌లకు, క్యాన్సర్‌కు మధ్య లింక్‌ను గుర్తించిన మొదటి పరిశోధకురాలిగా రణదీవ్ గుర్తింపు పొందారు. (చదవండి: వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు) ఓ వైపు ఈ పరిశోధన చేస్తూనే.. మరోవైపు రణదీవ్ కుష్టు వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం లెప్రేపై పరిశోధనలు చేయడమే కాక వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రణదవ్, మరో 11 మంది సహోద్యోగులతో కలసి 1973లో సి ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్‌ని ప్రారంభించినట్లు గూగుల్ డూడుల్ పేజ్‌లో పేర్కొంది. రణదీవ్ 1989లో రిటైర్ అయ్యారు. పదవీవిరమణ అనంతరం ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పని చేశారు. అక్కడి మహిళలను ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, పోషకాహార విద్యను నేర్పించారు. అంతేకాక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, ఇండియన్ స్కాలర్స్‌ని భారతదేశం తిరిగి వచ్చి.. వారి చదువు, జ్ఞానాన్ని తమ దేశ పౌరుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిందిగా కోరేవారు. చదవండి: చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే! -
గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్లు, హై టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియన్ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్‌డమ్‌ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్ 1, 2021). ► మెథడ్ యాక్టర్‌గా పేరున్న శివాజీ గణేషన్.. తన నటన ద్వారా కమల్ హాసన్, రజినీకాంత్‌లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. ► అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్ 1, 1928న. ► ఏడేళ్ల వయసుకే థియేటర్ ఆర్టిస్ట్ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు ► 1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్ అయ్యింది. ► 1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. ► భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు ► విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. ► 1960 ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్(వీరపాండియ కట్టబొమ్మన్కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి. ► అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం శివాజీ గణేషన్ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్‌గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్. ► 1961లో ‘పాశమలర్’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడు ► దైవ మగన్, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ► తేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్‌కి నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ► 1995లో ఫ్రాన్స్ గౌరవం, 1997లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్. ► తమిళ సీనియర్ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్‌లో యంగ్ హీరోగా ఉన్నాడు. ► ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ శివాజీ గణేషన్‌ను ‘మార్లోన్ బ్రాండో ఆఫ్ సౌత్ఇండియన్’గా అభివర్ణించింది. ► ఓ స్టార్ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్’లో ఒక్క పాట కూడా ఉండదు. ► పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు. ► ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. ► 1999 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్ తెర మీద కనిపించిన చివరి సినిమా. ► శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. ► కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్(ఫ్రాన్స్), దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్. ► శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. ► బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్‌ను క్రియేట్ చేశాడు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
హాయ్ గూగుల్.. హ్యాపీ బర్త్‌డే టు యూ
Google Birthday 2021: వరల్డ్ నంబర్ వన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన 23వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. అందకే ఈ రోజు డూడుల్‌లో 23 ప్రత్యేకంగా కనిపింపించేలా డిజరైన్ చేసింది. ఐస్‌క్రీమ్స్, కేక్స్, క్యాండిల్స్‌తో ఈ రోజు డూడుల్ కొత్తగా కనిపిస్తోంది. 23 ఏళ్లు పూర్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు సెర్జే బ్రిన్, లారీపేజ్లో ఓ చిన్న స్టార్టప్‌గా 1998లో ప్రారంభించారు. వాస్తవానికి 1998 సెప్టెంబరు 4న గూగుల్ సెర్చ్ ఇంజన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడేళ్ల పాటు సెప్టెంబరు 4నే గూగుల్ వార్షిక వేడుకుల నిర్వహించే వారు. ఏడేళ్ల తర్వాత 1998లో గూగుల్ ప్రారంభించినా తొలి ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో పేజ్ వ్యూస్ రావడంతో 2005లో గూగుల్ యానివర్సరీ డేట్‌ని సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 27కి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తేదిని గూగుల్ పుట్టినరోజుగా జరుపుతున్నారు. చదవండి: గూగుల్‌లో వెతికిన తొలి పదం ఇదే! 23 స్పెషల్ డూడుల్ గూగుల్ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ జింజర్‌బ్రెడ్, ఐస్‌క్రీం శాండ్విచ్, కిట్‌కాట్, లాలిపాప్, మార్ష్‌మాలో, ఓరియో, పై ఇలా ఐస్క్రీంల పేర్లతోనే ఉంటాయి. తన థీమ్‌కి తగ్గట్టే ఈ రోజు డూడుల్‌లో కూడా ఐస్క్రీంలకు పెద్ద పీట వేస్తూనే కేక్‌ను డూడుల్‌లో పెట్టింది, ఎల్ అక్షరం స్థానంలో క్యాండిల్ని ఉంచి వేడుకల ఫ్లేవర్‌ని తెచ్చింది గూగుల్. బర్నింగ్ మ్యాన్ నెవడాలోని బ్లాక్ రాక్ సిటీలో జరిగిన బర్నింగ్‌మ్యాన్ ఈవెంట్ థీమ్‌తో తొలిసారి 1998లో గూగుల్ డూడుల్‌ని రూపొందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల డూడుల్స్‌ని ఈ సెర్చ్ ఇంజన్ రూపొందించింది. చదవండి : మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. -
గ్రీన్ టీ తాగుతున్నారా? ఇది మీ కోసమే..
Michiyo Tsujimura Google Doodle: గ్రీన్ టీ.. కరోనాకి కొంతమందికి.. కరోనా తర్వాత చాలామందికి లైఫ్‌లో ఇదొక పార్ట్‌గా మారింది. ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు లావు ఉన్న వాళ్లు సన్నబడేందుకు ఇదొక ప్రత్యామ్నాయంగా ఫీలైపోతుంటారు. అయితే గ్రీన్ టీ గొప్పదనం గురించి ప్రపంచానికి చెప్పిన ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. ఆమె పేరే మిచియో సుజిమురా. మిచియో సుజిమురా.. జపనీస్ ఎడ్యుకేషననిస్ట్, బయోకెమిస్ట్. గ్రీన్ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలియజేసింది ఈమేనే. ఆ పరిశోధనలకుగానూ మిచియోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇవాళ ఆమె 133వ జయంతి. అందుకే గూగుల్ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్‌ను రిలీజ్ చేసింది. ► మిచియో సుజిమురా.. జపాన్‌లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కారు. ► గ్రీన్ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించింది. వాటిని ప్రపంచానికి తెలియజేసింది ఆమెనే. ► సుజిమురా 1888 సెప్టెంబర్ 17న సైతామా రీజియన్‌లోని ఓకేగావాలో పుట్టారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ► స్కూల్ చదువులు పూర్తయ్యాక టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో మిచియో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ► గ్రీన్ టీపై పరిశోధనల్లో డాక్టర్ ఉమెటారో సుజుకీ ఆమెకు సహకరించారు. ► గ్రీన్ టీలో విటమిన్ బి-1 ఉంటుందని గుర్తించింది ఆయనే(సుజుకీ). వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు ముప్పును నివారించవచ్చు. ► సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్ పరిశోధనల్లో విటమిన్ సీని గ్రీన్ టీలో గుర్తించారు ► 1929లో తన ఒంటరి పరిశోధనల్లో గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్లు ఉన్నట్లు సుజిమురా గుర్తించారు. ► ఈ పరిశోధనలన్నింటిని మేళవించి ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ రూపొందించారు. ► 1932లో వ్యవసాయంలో డాక్టరేట్ గౌరవపట్టా పొందిన తొలి జపాన్ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు. ► గ్రీన్ పరిశోధనలతో పాటు విద్యావేత్తగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ► టోక్యో హోం ఎకనమిక్స్ యూనివర్సిటీకి ఆమె మొట్టమొదటి డీన్ కూడా. గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేస్తుంది. ► ప్రొఫెసర్‌గా పని చేసిన మిచియో సుజిమురా .. 1955లో రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా పార్ట్ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు. ► 1969, జూన్ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మిచియో కన్నుమూశారు. ► ఓకేగావా సిటీలో ఆమె స్మరణానర్థం పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపాన్ని నిర్మించారు. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని జపాన్ రీసెర్చర్లు చెప్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది ఈ టైంలో వద్దు.. రాత్రి పడుకునే ముందు గ్రీన్‌టీతో మందులు వేసుకోకూడదు మధ్యాహ్న భోజనం తరువాత గ్రీన్‌టీ సేవిస్తే భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లు కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది -సాక్షి, వెబ్‌స్పెషల్ ఈ గ్రీన్ టీ రుచుల గురించి మీకు తెలుసా? -
వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు
Google Doodle Rudolf Weigl: వ్యాక్సిన్లు.. రకరకాల జబ్బుల నుంచి మనిషికి రక్షణ అందించే కవచాలు. కరోనా తర్వాత వీటి గురించి దాదాపు పూర్తి సమాచారం అందరికీ తెలుస్తోంది. గతంలో ఎలాంటి ఎలాంటి వ్యాక్సిన్లు ఉండేవి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్, వాక్సిన్లతో రక్షణ ఎలా అందుతుంది.. ఇలాంటి వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. అయితే వైరస్, బ్యాక్టీరియాల నుంచే వాటిని అభివృద్ధి చెందిస్తారని.. అందుకు ఓ పోలాండ్ సైంటిస్ట్ చేసిన ప్రయోగాలే మూలమని మీలో ఎంతమందికి తెలుసు? .. ఇవాళ గూగుల్‌లో డూడుల్‌గా కనిపిస్తోంది కూడా ఆయనే. పోలాండ్‌కు చెందిన రుడాల్ఫ్ వెయిగ్ల్.. అతిపురాతనమైన, ప్రమాదకరమైన టైఫస్ అంటువ్యాధికి సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొదటి సైంటిస్ట్. ఈయన వ్యాక్సిన్‌ను ఎలా తయారుచేశారో తెలుసా? పేన్లను దంచి.. ఆ పేస్ట్‌తో. అవును.. వెగటుగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఈ ప్రయోగమే ఆ తర్వాతి కాలంలో చాలా వ్యాక్సిన్ల తయారీకి ఒక మార్గదర్శకంగా మారిందంటే అతిశయోక్తికాదు. ►రుడాల్ఫ్ స్టెఫాన్ జన్ వెయిగ్ల్.. 1883, సెప్టెంబర్ 2న ఆస్స్ర్టో హంగేరియన్ టౌన్ ప్రెరవు(మోరావియా రీజియన్)లో పుట్టాడు. తండడ్రి టీచర్.. తల్లి గృహిణి. పుట్టింది జర్మనీలోనే అయినప్పటికీ పోలాండ్‌లో స్థిరపడింది ఆ కుటుంబం. ►పోలాండ్ ఎల్‌వీవ్‌లోని యూనివర్సిటీలో బయోలాజికల్ సైన్స్ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అస్ట్రో-హంగేరియన్ ఆర్మీ కోసం 1914 నుంచి పారాసిటాలజిస్ట్‌గా పని చేశాడు. ►పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. లెంబర్గ్ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా కొంతకాలం పని చేశాడు. ఆ టైంలో తూర్పు యూరప్‌లో లక్షల మంది టైఫస్ బారిన పడగా, దానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలోకి దిగాడు. ఆపై ఎల్‌వీవ్‌లో తన పేరు మీద ఒక ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పి.. ఆపై అక్కడే టైఫస్ మీద, వైరల్ ఫీవర్ మీద ఆయన పరిశోధనలు మొదలయ్యాయి. ►తొలి దశ ప్రయోగాల్లో జబ్బును తగ్గించే ఫలితం రానప్పటికీ.. లక్షణాల్ని తగ్గించి ఉపశమనం ఇచ్చింది ఆయన తయారు చేసిన వ్యాక్సిన్. ఆ తర్వాత రాకీ మౌంటెన్ స్పాటెడ్ ఫీవర్‌కు సైతం వ్యాక్సిన్ తయారు చేశాడాయన. ►1909లో ఛార్లెస్ నికోలె.. లైస్(పేను)వల్ల టైఫస్ అంటువ్యాధి ప్రబలుతుందని గుర్తించాడు. అందుకు రికెట్ట్‌సియాప్రోవాజెకి బ్యాక్టీరియా కారణమని కనిపెట్టాడు. ఆ తర్వాత టైఫస్ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ►టైఫస్ వ్యాక్సిన్ కోసం అప్పటిదాకా ఎవరూ చేయని ప్రయోగం చేపట్టాడు వెయిగ్ల్. జబ్బు కారణమైన పేను కడుపులోనే రికెట్ట్సియా ప్రోవాజెకి ని ప్రవేశపెట్టి వాటిని పెంచి.. ఆ పేన్లను చిత్తు చేసి వ్యాక్సిన్ పేస్ట్ తయారు చేశాడు. ముందు ఆరోగ్యవంతమైన పేన్లను పన్నెండు రోజులపాటు పెంచాడు. వాటికి టైఫస్ బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేశాడు. ఆపై మరో ఐదు రోజులపాటు వాటిని పెంచాడు. చివరికి వాటిని చిత్తు(గ్రైండ్ చేసి).. ఆ పేస్ట్‌ను వ్యాక్సిన్‌గా ఉపయోగించాడు. ►పేన్లను పెంచడానికి మనుషుల రక్తం కావాలి. కాబట్టి.. ఒక ప్రత్యేకమైన తెర ద్వారా వాటిని మనుషుల రక్తం పీల్చుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వందల మంది జబ్బు పడగా.. వాళ్లను చికిత్స ద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చాడు. 1918లో గినియా పందుల మీద, మనుషుల మీద వాటిని ట్రయల్స్ నిర్వహించాడు. ►1930లో వ్యాక్సిన్ అధికారికంగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. ►అయితే దేశ విద్రోహ కార్యాకలాపాలకు నెలవైందన్న ఆరోపణలతో 1944లో సోవియట్‌యూనియన్ ఆయన ఇనిస్టిట్యూట్‌ను మూసేసింది. ►1936-43 మధ్య చైనాలో ఈ తరహా వ్యాక్సిన్లను ప్రయోగించి సక్సెస్ అయ్యారు. కష్టం-ప్రమాదకరమైనదైనప్పటికీ.. ఆ వ్యాక్సిన్ ప్రయోగాలు విజవంతం అయ్యాయి. ►1957 ఆగష్టు 11న 73 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశాడు ►1942, 1978(మరణానంతరం)లో నోబెల్ బహుమతికి వెయిగ్ల్ పేరు నామినేటఅయ్యింది. కానీ, అవార్డు దక్కలేదు. అయితే ఇతర దేశస్తులతో పని చేశాడన్న ఆరోపణలు ఆయనకు అవార్డు దక్కనివ్వలేదు. ►2003లో ప్రపంచం ఆయన పరిశోధనల్ని ‘రైటస్ ఎమాంగ్ ది నేషన్స్ ఆఫ్ ది వరల్డ్’ గౌరవంతో స్మరించుకుంది. రుడాల్ఫ్ వెయిగ్ల్ 138వ పుట్టినరోజు సందర్భంగా.. గూగుల్ డూడుల్ ద్వారా ఆయన్ని గుర్తు చేస్తోంది గూగుల్. రెండో ప్రపంచ యుద్ద సమయంలో పోలాండ్‌ను జర్మనీ ఆక్రమించుకున్నాక.. వెయిగ్ల్‌ను బలవంతంగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్‌లోకి దించారు. అక్కడ ఆయన తెలివిగా పనివాళ్లను తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నాడు. అంతేకాదు తనకు తాను లైస్ ద్వారా టైఫస్‌ను అంటిచుకుని రిస్క్ చేసి మరీ పరిశోధనలు చేశాడు. తన పరిశోధనలు, ప్రయోగాలతో వ్యాక్సిన్‌ను రూపొందించి.. వేల మంది ప్రాణాలు కాపాడాడిన వెయిగ్ల్‌ను ఒక సైంటిస్ట్‌గా మాత్రమే కాదు.. హీరోగా ప్రపంచం ఆయన్ని కొనియాడుకుంటోంది. - సాక్షి, వెబ్ స్పెషల్ -
‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!
విషయం ఎంతటి సంక్లిష్టమైనది అయినా సరే.. వివరణ సరళంగా ఉంటేనే ఎక్కువ మందికి అర్థం అయ్యేది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టి తన కవితలతో ఎందరిలోనో బ్రిటిష్ వ్యతిరేక పోరాట స్ఫూర్తిని నింపింది సుభద్ర కుమారి చౌహాన్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుభద్ర.. స్వాతంత్ర సంగ్రామంలో అరెస్ట్ కాబడ్డ మొదటి మహిళా సత్యాగ్రహి!. ఈరోజు(ఆగష్టు 16న) ఆమె జయంతి. అందుకే గూగుల్ డూడుల్‌తో ఆమెను గుర్తు చేస్తోంది గూగుల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల స్కూల్ సిలబస్ పుస్తకాల్లో కనిపించే పాఠం.. ‘ఝాన్సీ కీ రాణి’. వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయ్(మణికర్ణిక) పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కవిత్వం అది. ఆ హిందీ కవితను రాసింది ఎవరో కాదు.. సుభద్ర కుమారి చౌహాన్. ప్రముఖ హిందీ కవయిత్రిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా ఆమె పేరు భారత చరిత్రలో సుస్థిరంగా నిలిచింది. అరెస్టైన మొదటి సత్యాగ్రహి 1904, ఆగష్టు 16న యూపీ ప్రయాగ్‌రాజ్ నిహల్పూర్ గ్రామంలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టింది సుభద్ర కుమారి చౌహాన్. స్కూల్ విద్య కొనసాగించిన సుభద్ర.. తొమ్మిదేళ్లకే ‘నీమ్’ కవితతో సాహిత్య ప్రపంచంతో ‘చిచ్చురపిడుగు’ బిరుదు అందుకుంది. పదిహేనేళ్ల వయసులో థాకూర్ లక్క్ష్మణ్ సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకుని.. జబల్పూర్కు కాపురం వెళ్లింది. ఆపై భర్త ప్రోత్సాహంతో కవిత్వాలు రాస్తూ.. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. నాగ్‌పూర్‌లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిపిన నిరసన ప్రదర్శనకు గానూ ఆమెను అరెస్ట్ చేయమని నాగ్‌పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ టైంలో ఆమె గర్భవతి కావడంతో కొన్నాళ్లపాటు జైళ్లో నుంచి వదిలేశారు. ఆపై 1941లో సుభద్ర కుమారి భర్త థాకూర్, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకున్నాడు. ఆ సమయంలో ఐదుగురు పిల్లలున్నా.. భర్తతో పాటు ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలో 1942లో ఆమె రెండోసారి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు అంటరానీతనం, కుల వ్యవస్థ, పర్దా పద్ధతులకు వ్యతిరేకంగా ఆమె పోరాడింది కూడా. పిల్లలకు సైతం అర్థం అయ్యేలా.. హిందీ కవిత్వంలో ఆమెది ఎంతో సరళమైన శైలి. మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలను, ముఖ్యంగా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రచనలు చేసేది. వీరనారి ఝాన్సీ రాణి పోరాటాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం ‘ఝాన్సీ కీ రాణి’.. హిందీ సాహిత్యంలో సుస్థిరంగా నిలిచింది. ‘జలియన్ వాలా బాగ్ మే వసంత్’, ‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ తదితర కవిత్వాలు స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె రాసిన చిన్నకథలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. ఆపై సెంట్రల్ ప్రావిన్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. 1948, ఫిబ్రవరి 15న అసెంబ్లీ సమావేశాలకు నాగ్‌పూర్ వెళ్లి జబల్పూర్కు తిరిగి వస్తుండగా సియోని(మధ్యప్రదేశ్) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గూగుల్ డూడుల్స్ గౌరవం సుభద్ర కుమారి చౌహాన్ మరణాంతరం ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్‌కు ‘ఐసీజీఎస్ సుభద్ర కుమారి చౌహాన్’ పేరు పెట్టారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1976లో భారత పోస్టల్ శాఖ.. ఓ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 117వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఇండియా.. గూగుల్ డూడుల్‌తో గౌరవించింది. ఆమె కూతురు సుధా చౌహాన్‌ను భర్త ఎవరో కాదు.. లెజెండరీ రైటర్ ప్రేమ్ చంద్ కొడుకు అమృత్ రాయ్. తల్లిదండ్రుల జీవిత చరిత్ర ఆధారంగా సుధా ‘మిలా తేజ్ సే తేజ్’ అనే పుస్తకం రాసింది. సుధా-అమృత్‌ల కొడుకు అలోక్ రాయ్ ఇంగ్లీఫ్ ప్రొఫెసర్.. ప్రస్తుతం ఆయన భారత రాజకీయాలు, కల్చర్ మీద కాలమ్స్ రాస్తున్నారు. -
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్‌పిట్‌లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్‌తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్‌పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్‌కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్‌మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్‌డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్‌జెక్ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్‌కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్‌మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
కరోనా: ‘మీ అందరికీ కృతజ్ఞతలు’
మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కోరల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు సేవలు అందిస్తున్నారు. తాము కన్నవారిని, తమను కన్నవారిని నేరుగా కలుసుకోలేక తీవ్ర వేదనను అనుభవిస్తున్నప్పటికీ.. బాధను పంటి బిగువన అదిమిపెట్టి వెలకట్టలేని త్యాగానికి పూనుకున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి కొందరు చప్పట్లు కొట్టి కృతజ్ఙతా భావం చాటుకుంటే.. మరికొందరు పాటలు, సంగీతం, దీపకాంతులతో వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. తాజాగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్‌తో కరోనా యుద్ధ హీరోలకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ కృతజ్ఙతలు’’అంటూ హార్ట్ ఎమోజీతో హృదయపూర్వకంగా వారి సేవలను కొనియాడింది.(కరోనాపై పోరు: ‘మీ మద్దతు కావాలి’) ఇక కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచం స్తంభించిపోయిన వేళ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి గూగుల్ ప్రతి రోజూ ప్రత్యేక డూడుల్‌తో నీరాజనం పలుకుతోంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూ తన ప్రభావం చూపుతోంది. మనుపటితో పోలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకరికొకరు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికి డూడుల్ సిరీస్‌తో గౌరవిస్తున్నాం’’అని గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది. ఈ క్రమంలో రైతులు, రైతు కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల విభాగం సిబ్బంది అందరి సేవలను ప్రశంసిస్తూ యానిమేటెడ్ చిత్రాలు ప్రదర్శించింది. కాగా చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. దీని ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా మరణించగా.. లక్షలాది మంది దీని బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ అమల్లోకి తీసుకువచ్చాయి.(అమ్మా వచ్చేయమ్మా : నర్సు కూతురి కంటతడి) -
రిపబ్లిక్ డేపై గూగుల్ స్పెషల్ డూడుల్
సాక్షి, న్యూఢిల్లీ : భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ తనదైనశైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. ఈ ప్రత్యేక డూడుల్‌ను సింగపూర్‌కు చెందిన మెరో సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దారు.అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, తాజ్‌మహల్,ఇండియా గేట్, కూడా ప్రతిబింబించేలా తయారు చేశారు. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. -
మీరు వేసిన డూడుల్..గూగుల్‌లో..!
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్.. ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్ పోటీ నిర్వహిస్తోంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి నేను ఆశిస్తుంది.. అనే థీమ్‌తో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఎంట్రీస్ పంపాలని గూగుల్ ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు ఎగరగలిగే షూస్? కాలుష్యరహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను విద్యార్థులు స్కెచ్ లేదా పెయింటింగ్‌లో అందంగా చిత్రీకరించాలి. అంతేకాకుండా ప్రతి గూగుల్ డూడుల్‌పై ఉన్నట్లే వారి పెయింటింగ్‌పై గూగుల్ అని ఉండాల్సిందిగా తెలిపింది. విద్యార్థులు వారి థీమ్‌ను డూడుల్ ఎంట్రీ ఫారమ్‌తో కొరియర్ లేదా ఆన్లైన్ doodles.google.co.in/d4g ద్వారా పంపించాలని పేర్కొంది. దరఖాస్తులు పంపడానికి చివరి గడువు సెప్టెంబర్ 30. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు రూ. 5 లక్షల ఉపకారవేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు రూ.2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులను గూగుల్ సంస్థ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ పోటీలో గెలుపొందిన విజేత ఆర్ట్‌ను గూగుల్ డాట్ కామ్‌లో డూడుల్‌గా ఉపయోగించనున్నారు.