మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కోరల నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు సేవలు అందిస్తున్నారు. తాము కన్నవారిని, తమను కన్నవారిని నేరుగా కలుసుకోలేక తీవ్ర వేదనను అనుభవిస్తున్నప్పటికీ.. బాధను పంటి బిగువన అదిమిపెట్టి వెలకట్టలేని త్యాగానికి పూనుకున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి కొందరు చప్పట్లు కొట్టి కృతజ్ఙతా భావం చాటుకుంటే.. మరికొందరు పాటలు, సంగీతం, దీపకాంతులతో వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. తాజాగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్‌తో కరోనా యుద్ధ హీరోలకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ కృతజ్ఙతలు’’అంటూ హార్ట్ ఎమోజీతో హృదయపూర్వకంగా వారి సేవలను కొనియాడింది.(కరోనాపై పోరు: ‘మీ మద్దతు కావాలి’)
ఇక కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచం స్తంభించిపోయిన వేళ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి గూగుల్ ప్రతి రోజూ ప్రత్యేక డూడుల్‌తో నీరాజనం పలుకుతోంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూ తన ప్రభావం చూపుతోంది. మనుపటితో పోలిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకరికొకరు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరులో ముందుండి సేవలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికి డూడుల్ సిరీస్‌తో గౌరవిస్తున్నాం’’అని గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది. ఈ క్రమంలో రైతులు, రైతు కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల విభాగం సిబ్బంది అందరి సేవలను ప్రశంసిస్తూ యానిమేటెడ్ చిత్రాలు ప్రదర్శించింది. కాగా చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరులో పురుడు పోసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. దీని ధాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా మరణించగా.. లక్షలాది మంది దీని బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్ అమల్లోకి తీసుకువచ్చాయి.(అమ్మా వచ్చేయమ్మా : నర్సు కూతురి కంటతడి)
Comments
Please login to add a commentAdd a comment