తొలి మహిళా గురువుపై నాడు రాళ్లేసారు
ఆమె భారత దేశంలోనే తొలి మహిళా గురువు. 1848లోనే విద్యాబుద్ధులు నేర్పేందుకు నడుంకట్టారు. ప్రత్యేక బాలికల పాఠశాలను స్థాపించి ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారు. ఆమె చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక రాళ్లు విసిరినవారు ఉన్నారు.. ఆమె వెళ్లే మార్గంలో పేడను వేసినవారు ఉన్నారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో భర్త ప్రముఖ సామాజిక వేత్త జ్యోతిరావ్ పూలే ఇచ్చిన అండదండలతో ముందుకు సాగి నేడు దేశంలోని తొలి మహిళా గురువుగా నిలిచారు.
దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఆమె జన్మదినం జరుపుకునే స్థాయిలో ఉన్నారు. ఆమె ఎవరో కాదు. సావిత్రీబాయి పులే. ఆమె 186వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక నెటిజన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమెకు డూడుల్ ద్వారా ఘన నివాళి అర్పించింది. కులమతాలకు అతీతంగా సావిత్రీబాయి విద్యాబోధన చేశారు. వితంతువులకు ఆశ్రయం కల్పించారు. సొంతంగా క్లినిక్ స్థాపించి వైద్య సేవలు కూడా అందించారు.