Google Doodle Dr Kamal Ranadive : మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆమెకు సంబంధించి ప్రత్యేక డూడుల్‌ని క్రియేట్ చేసింది. ఈ డూడుల్‌లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్.
నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ రణదీవ్ సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. రణదీవ్ డూడుల్‌ని భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించారు.
(చదవండి: ‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!)
డాక్టర్ రణదీవ్ గురించి..
కమలా సమరాథ్ అలియాస్ కమలా రణదీవ్ 1917, నవంబర్ 8న పుణెలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన కమలా రణదీవ్.. వైద్య విద్యను అభ్యసించారు. కాకపోతే తనుకు బయాలజీ అంటే చాలా ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్‌లో పని చేస్తూ కణ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఆమెకు డాక్టరేట్ వచ్చింది. అనంతరం అమెరికా మేరిల్యాండ్, బాల్టిమోరిలోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీలో ఫెలోషిప్ పొందారు. ఆ తర్వాత ముంబై తిరిగి వచ్చి.. ఐసీఆర్‌సీలో చేరారు. అక్కడ డాక్టర్ రణదీవ్ దేశంలోని తొలి టిష్యూ కల్చర్ లాబరేటరీని ఏర్పాటు చేశారు.
ఐసీఆర్‌సీ డైరెక్టర్‌గా పని చేస్తూనే క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌కి, వంశపారంపర్యానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడమే కాక కొన్ని వైరస్‌లకు, క్యాన్సర్‌కు మధ్య లింక్‌ను గుర్తించిన మొదటి పరిశోధకురాలిగా రణదీవ్ గుర్తింపు పొందారు.
(చదవండి: వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు)
ఓ వైపు ఈ పరిశోధన చేస్తూనే.. మరోవైపు రణదీవ్ కుష్టు వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం లెప్రేపై పరిశోధనలు చేయడమే కాక వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రణదవ్, మరో 11 మంది సహోద్యోగులతో కలసి 1973లో సి ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్‌ని ప్రారంభించినట్లు గూగుల్ డూడుల్ పేజ్‌లో పేర్కొంది.
రణదీవ్ 1989లో రిటైర్ అయ్యారు. పదవీవిరమణ అనంతరం ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పని చేశారు. అక్కడి మహిళలను ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, పోషకాహార విద్యను నేర్పించారు. అంతేకాక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, ఇండియన్ స్కాలర్స్‌ని భారతదేశం తిరిగి వచ్చి.. వారి చదువు, జ్ఞానాన్ని తమ దేశ పౌరుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిందిగా కోరేవారు.
Comments
Please login to add a commentAdd a comment