Hopkins University
-
గూగుల్ డూడుల్‌లో కనిపిస్తున్న ఈ వైద్యురాలు ఎవరంటే..
Google Doodle Dr Kamal Ranadive : మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆమెకు సంబంధించి ప్రత్యేక డూడుల్‌ని క్రియేట్ చేసింది. ఈ డూడుల్‌లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్. నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ రణదీవ్ సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. రణదీవ్ డూడుల్‌ని భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించారు. (చదవండి: ‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!) డాక్టర్ రణదీవ్ గురించి.. కమలా సమరాథ్ అలియాస్ కమలా రణదీవ్ 1917, నవంబర్ 8న పుణెలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన కమలా రణదీవ్.. వైద్య విద్యను అభ్యసించారు. కాకపోతే తనుకు బయాలజీ అంటే చాలా ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో పని చేస్తూ కణ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఆమెకు డాక్టరేట్ వచ్చింది. అనంతరం అమెరికా మేరిల్యాండ్, బాల్టిమోరిలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఫెలోషిప్ పొందారు. ఆ తర్వాత ముంబై తిరిగి వచ్చి.. ఐసీఆర్సీలో చేరారు. అక్కడ డాక్టర్ రణదీవ్ దేశంలోని తొలి టిష్యూ కల్చర్ లాబరేటరీని ఏర్పాటు చేశారు. ఐసీఆర్సీ డైరెక్టర్‌గా పని చేస్తూనే క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌కి, వంశపారంపర్యానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడమే కాక కొన్ని వైరస్‌లకు, క్యాన్సర్‌కు మధ్య లింక్‌ను గుర్తించిన మొదటి పరిశోధకురాలిగా రణదీవ్ గుర్తింపు పొందారు. (చదవండి: వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు) ఓ వైపు ఈ పరిశోధన చేస్తూనే.. మరోవైపు రణదీవ్ కుష్టు వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం లెప్రేపై పరిశోధనలు చేయడమే కాక వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రణదవ్, మరో 11 మంది సహోద్యోగులతో కలసి 1973లో సి ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్‌ని ప్రారంభించినట్లు గూగుల్ డూడుల్ పేజ్‌లో పేర్కొంది. రణదీవ్ 1989లో రిటైర్ అయ్యారు. పదవీవిరమణ అనంతరం ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పని చేశారు. అక్కడి మహిళలను ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, పోషకాహార విద్యను నేర్పించారు. అంతేకాక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, ఇండియన్ స్కాలర్స్‌ని భారతదేశం తిరిగి వచ్చి.. వారి చదువు, జ్ఞానాన్ని తమ దేశ పౌరుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిందిగా కోరేవారు. చదవండి: చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే! -
అమెరికాలో రికార్డుస్థాయి మరణాలు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,936 మంది కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 2,54,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు మొత్తం మరణాలు 3,66,662కు, పాజిటివ్ కేసులు 2.16కోట్లకుపైగా చేరుకున్నాయి. ప్రస్తుతం 1,31,000 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో నవంబర్ నెలాఖరు తర్వాత కోవిడ్–10 ఉధృతి భారీగా పెరిగింది. వరుసగా సెలవులు రావడం, జనం పెద్ద యెత్తున గుంపులుగా చేరుతుండడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీలో 31 దాకా లాక్డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జర్మనీలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించేందుకు చాన్స్‌లర్ యాంజెలా మెర్కెల్ అంగీకరించారు. అలాగే జన సంచారంపై మరికొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు ఆమె తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జర్మనీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు 37,744 కరోనా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 8.3 కోట్ల జనాభా ఉండగా, సోమవారం నాటికి 2.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో గత ఏడాది నవంబర్ 2 నుంచి పాక్షిక లాక్డౌన్, డిసెంబర్ 16 నుంచి కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరి 10న లాక్డౌన్ ముగించాల్సి ఉండగా పొడిగించారు. బ్రిటన్‌లో 62 వేల కేసులు లండన్: గత ఏప్రిల్ తర్వాత తొలిసారి బుధవారం బ్రిటన్‌లో కోవిడ్ కారక రోజూవారీ మరణాల సంఖ్య 1000దాటింది. బుధవారం కరోనాతో 1041 మరణాలు సంభవించాయని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇలా రోజూ వేయి దాటడం పదోసారి. బుధవారం 62322 కేసులు నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి. ఒకపక్క దేశవ్యాప్త లాక్డౌన్ విధించి, మరోపక్క వ్యాక్సినేషన్ ఆరంభించినా కరోనా కలకలం ఆగకపోవడం ఆందోళన సృష్టిస్తోంది. అయితే యూరప్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌లో ఎక్కువమందికి టీకా అందిందని ప్రధాని జాన్సన్ చెప్పారు. ప్రతిపక్షాలు లాక్డౌన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని జాన్సన్ చెప్పారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తామన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగితే లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యమవుతుందన్నారు. -
కేసులు 70 లక్షలు..మృతులు 4 లక్షలు...
వాషింగ్టన్/లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాటిన్ అమెరికా, రష్యా భారత్‌లో కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో లాటిన్ అమెరికాలో 16 శాతం కేసుల వరకు నమోదయ్యాయి. 24 గంటల్లోనే 2,680 మంది ప్రాణాలు కోల్పోవడంతో కోవిడ్ మృతుల సంఖ్య 4 లక్షలు దాటినట్టు హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మృతుల్లో చాలా మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల అధికారిక లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నది వారి అభిప్రాయం. మొత్తం మృతుల్లో నాలుగో వంతు అమెరికాలోనే సంభవించాయి. మరోవైపు దక్షిణ అమెరికాలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 23 రోజుల్లో లక్ష మరణాలు ప్రపంచవ్యాప్తంగా మలేరియాతో మరణించే వారి సంఖ్యతో సమానంగా కోవిడ్ మృతులు అయిదు నెలల్లోనే సంభవించాయి. చైనాలోని వూహాన్లో జనవరి 10న తొలి మరణం సంభవించింది. లక్ష మరణాలు నమోదు కావడానికి మూడు నెలలు పట్టింది. ఏప్రిల్ మొదటి వారంలో మృతులు లక్ష దాటేశాయి. అదే నెల చివరి వారంలో 2 లక్షలు దాటేశాయి. ఇక 23 రోజుల్లో మరణాలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ఏడు లక్షలకు చేరువలో బ్రెజిల్.. లాటిన్ అమెరికాలో అతి పెద్ద దేశమైన బ్రెజిల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 7 లక్షలకి చేరువవుతున్న కేసులతో ఆ దేశం ప్రపంచ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 36 వేలకు పైగా మరణాలతో మూడో స్థానంలో ఉంది. అయితే శనివారం నుంచి అక్కడ ప్రభుత్వం కరోనా కేసులు, మరణాల వివరాలను అధికారికంగా వెల్లడించడం నిలిపివేసింది. దేశంలో పరిస్థితిని ఆ గణాంకాలు సరిగా తెలియజేయడం లేదంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో ట్వీట్ చేశారు. అమెరికాలో 20 లక్షలు కేసులు అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్–19 కేసుల పెరుగుదల ఆగడం లేదు. ప్రతీ రోజూ సగటున 20 వేల వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాల్లో నమోదైన కేసుల్లో 30శాతం అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. మృతుల్లో కూడా అగ్రరాజ్యమే మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో మృతుల సంఖ్య లక్షా 12 వేలు దాటేసింది. -
ముగ్గురికి వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్)లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు. శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు. ఈ అవార్డ్ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్ కెలీన్ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’ అని డాక్టర్ రాట్క్లిఫ్ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. -
జలుబుకు కారణం తెలుసా ?
వాషింగ్టన్: వేసవిలో కూడా జలుబు చేస్తోంది. నీళ్లల్లో తడిసినప్పుడు జలుబు చేసినట్లుగానే అదేపనిగా ముక్కు కారుతోంది. సైనస్ సమస్య ఉన్నవారు కూడా చల్లటి వాతావరణంతో సంబంధం లేకుండానే ఇబ్బందులు పడుతున్నారు. కారణమేంటి? అని అడిగితే కాలుష్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగానే రోగనిరోధక శక్తి తగ్గుతోందని, రోగాల తీవ్రత పెరుగుతోందంటున్నారు. న్యూఢిల్లీ, బీజింగ్ వంటి మహానగరాల్లో నివసిస్తున్న ప్రజలు తరచూ జలుబు బారిన పడడం, సైనస్ వంటి సమస్యలు ఎదుర్కోవడం ఎక్కువగా కనిపిస్తోందని, అందుకు కారణం కాలుష్యమేనని ఎలుకల మీద చేసిన పరిశోధనల్లో తేలిందని భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇందుకోసం 38 ఎలుకలపై పరిశోధనలు చేశామని, అందులో 19 ఎలుకలను స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా, మరో 19 ఎలుకలు కాలుష్యపూరిత గాలిని పీల్చుకునేలా ఏర్పాట్లు చేయగా.. కలుషితమైన గాలిని పీల్చుకున్న ఎలుకల్లో జలుబు, సైనస్ వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపారు. చల్లగా ఉండే ప్రాంతాల్లో వెచ్చదనం కోసం పెట్టే మంటల కారణంగా కూడా కాలుష్యం పెరిగి, ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రామనాథన్ తెలిపారు. -
జాక్.. ఒక జెమ్..!
స్కూల్, కాలేజీ స్థాయి సైన్స్ ఫెయిర్లలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూనే ఉంటారు. మాస్టార్ల పర్యవేక్షణల్లో చదువుకొచ్చిన సిద్ధాంతాల ఆధారంగా ప్రయోగపూర్వకంగా ప్రతిభను చాటుతూ ఉంటారు.. ఇలాంటి నేపథ్యమే ఉన్న హైస్కూల్ స్టూడెంట్ జాక్ పాల్గొన్నది కూడా సైన్స్ఫెయిరే! అయితే దానికి పర్యవేక్షకుడు అమెరికన్ అధ్యక్షుడు. జాక్ ప్రయోగం చేస్తున్నది వైట్‌హౌస్ లాన్లో... కొన్ని వందల మంది తలపండిన ప్రొఫెసర్ల మధ్య... మరి అంత చిన్నోడి కి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది! అంత పెద్ద పరీక్ష ఎందుకు? అంటే.. అది కష్టమూ కాదు, అతడికి పరీక్ష కాదు. అతడు ఆవిష్కరించిన అద్భుతానికి రుజువు ఆ కార్యక్రమం! అప్పటికే కొన్ని వందల ప్రయోగశాలల చుట్టూ తిరిగాడతను. అలాగే, తన ఆలోచన గురించి అనేకమంది ప్రొఫెసర్లకు చెప్పి చూశాడు. అయితే అందరూ అతడి వయసు, చదువు గురించి ఆలోచించారు కానీ.. అతడి థియరీలోని సత్తా గురించి ఎవ్వరూ ఆలోచించినట్టు లేదు. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన జాక్ ఆండ్రకాకు ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. అతడి థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా ఆ మహానుభావులెవరూ అడగలేదంటే... వారికి ఇతడు చెబుతున్న విషయం ఎంత అసంబద్ధంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికీ నిరాశ చెందక అతడు కొనసాగించిన ప్రయత్నమే క్లోమానికి సంబంధించిన క్యాన్సర్ల గుర్తింపులో కీలకావిష్కరణకు దారి తీసింది. అతడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. మనిషిని చాలా తొందరగా మృత్యుముఖానికి తీసుకెళ్లే క్యాన్సర్లలో ఒకటి క్లోమగ్రంథికి వచ్చే క్యాన్సర్. తొలిదశలోనే దీన్ని గుర్తించకపోతే మరణానికి సిద్ధపడిపోవడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి క్యాన్సర్‌తోనే మరణించాడు జాక్ వాళ్ల అంకుల్. తను అమితంగా అభిమానించే ఆయన మరణానికి కారణం గురించి తెలుసుకొన్న అతడికి నిద్రపట్టలేదు. అప్పుడతనికి నిండా పదిహేనేళ్లు కూడా లేవు. అయితేనేం ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ గురించి పరిశోధించాడు. ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తికాకపోయినా.. వైద్యరంగ పరిశోధకుడిగా మారిపోయాడు. రక్తంలో ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ కారకాలను గుర్తించే సెన్సర్‌ను రూపొందించాడు. మరి మహా వైద్య పరిశోధకులకే సవాలుగా మారిన ఆ వ్యాధి గురించి ఈ హైస్కూల్ విద్యార్థి వివరిస్తే ఎవరు వింటారు? ఆ వ్యాధిని తాను ప్రాథమిక దశలోనే గుర్తించగలనని అంటే ఎవరు నమ్ముతారు?! ఇలాంటి అహం చాలామంది పరిశోధకులను ఆ కుర్రాడి థియరీ ని జోక్‌గా తీసుకొనేలా చేసింది. అతడు చెబుతున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా అడగకుండా అనేక మంది పొమ్మన్నారు. అయినప్పటికీ జాక్ నిరాశపడలేదు. దాదాపు వందమంది ప్రొఫెసర్ల చుట్టూ తిరిగినా.. ఏ ఒక్కరూ ప్రయోగానికి కూడా ఆతడికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికీ జాక్ వెనుదిరగలేదు, వెనక్కు తగ్గలేదు. వయసుతో ఉన్న ఉత్సాహమో, తన ఆలోచనపై ఆత్మవిశ్వాసంతోనో కానీ అనేక పరిశోధనాలయాల అడ్రస్‌లు వెదికిపట్టుకొని తన థియరీని వివరించాడు. చివరకు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్లు జాక్ ఐడియాను గుర్తించారు. ప్రయోగపూర్వకంగా థియరీని నిరూపించడానికి అవకాశం ఇచ్చారు! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటివరకూ ఉన్న సెన్సర్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! ఆ ఆశ్చర్యానికి రెండు కారణాలు.. వైద్యవిధానంలో నవ్యమైన ఆవిష్కరణ చూడటం ఒకటైతే.. ఒక హైస్కూల్ స్టూడెంట్ దాన్ని రూపొందించడం మరోటి. హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనశాల మొదలు... వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ఒబామా ముందు జాక్ ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగశాల వరకూ.. అనేకసార్లు ఈ టీనేజర్ సెన్సర్‌కు సంబంధించిన థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. మొదట్లో ఇతడి థియరీని ఏమాత్రం పట్టించుకోని పరిశోధకులు కూడా తర్వాత జాక్‌ను వేనోళ్ల ప్రశంసించారు. ఇతడు రూపొందించిన సెన్సర్ అత్యంత వేగవంతంగా పనిచేయడమే కాక, అతి చౌకగా అందుబాటులో ఉంటుందని ధ్రువీకరించారు. ఇంటెల్ ఇంజనీరింగ్ ఫెయిర్-2012లో జాక్ ప్రతిభను మెచ్చి 75 వేల డాలర్ల గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు నిర్వాహకులు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు వాడైన జాక్ ఐడియాకు ఇంతకుమించిన పురస్కారం ఏమిటంటే... అతడు రూపొందించిన సెన్సర్‌ను ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు. మరి టీనేజ్‌లో ఇంతకుమించిన సాఫల్యం ఏముంటుంది! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటి వరకూ ఉన్న సెన్సార్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు!