జలుబుకు కారణం తెలుసా ?
వాషింగ్టన్: వేసవిలో కూడా జలుబు చేస్తోంది. నీళ్లల్లో తడిసినప్పుడు జలుబు చేసినట్లుగానే అదేపనిగా ముక్కు కారుతోంది. సైనస్ సమస్య ఉన్నవారు కూడా చల్లటి వాతావరణంతో సంబంధం లేకుండానే ఇబ్బందులు పడుతున్నారు. కారణమేంటి? అని అడిగితే కాలుష్యమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగానే రోగనిరోధక శక్తి తగ్గుతోందని, రోగాల తీవ్రత పెరుగుతోందంటున్నారు.
న్యూఢిల్లీ, బీజింగ్ వంటి మహానగరాల్లో నివసిస్తున్న ప్రజలు తరచూ జలుబు బారిన పడడం, సైనస్ వంటి సమస్యలు ఎదుర్కోవడం ఎక్కువగా కనిపిస్తోందని, అందుకు కారణం కాలుష్యమేనని ఎలుకల మీద చేసిన పరిశోధనల్లో తేలిందని భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇందుకోసం 38 ఎలుకలపై పరిశోధనలు చేశామని, అందులో 19 ఎలుకలను స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా, మరో 19 ఎలుకలు కాలుష్యపూరిత గాలిని పీల్చుకునేలా ఏర్పాట్లు చేయగా.. కలుషితమైన గాలిని పీల్చుకున్న ఎలుకల్లో జలుబు, సైనస్ వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని తెలిపారు. చల్లగా ఉండే ప్రాంతాల్లో వెచ్చదనం కోసం పెట్టే మంటల కారణంగా కూడా కాలుష్యం పెరిగి, ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త రామనాథన్ తెలిపారు.