భోగిరోజు ఏం చేయాలి?
సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగిమంటలు వేసుకోమని పెద్దలు సూచించారు. అందుకే భోగిపండుగ రోజు పొద్దున్నే ఇంట్లోనూ, చుట్టుపక్కలా ఉన్న పనికిరాని, విరిగిపోయిన కలప వస్తువులన్నిటినీ మంటల్లో వేసి, వెచ్చగా చలిమంట వేసుకుంటారు. వీటివల్ల వాతావరణంలో అధిక చలిమూలంగా ప్రబలి ఉండే పురుగూపుట్రా ఆ మంటల వేడికి నశించిపోతాయి. భోగిమంటలకు ఆవుపేడతో చేసిన పిడకలను, ఆ మంటలను బాగా రగిలించేందుకు ఆవునేతిని వాడటం ఉత్తమం. అలా చేయడం వల్ల వాతావరణంలోని కాలుష్యం తొలగి, గాలి శుభ్రపడుతుందని పెద్దల నమ్మకం.
అలా కాకుండా, రబ్బరుటైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు వేయడం మంచిది కాదు. ఇక సాయంత్రం అయ్యేసరికి పెద్దవాళ్లు పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. భోగిపళ్లు పోయడం అంటే, రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడు సార్లు తిప్పి తలమీద పోయడమన్నమాట.. ఇంట్లోని పెద్ద వాళ్ల తరవాత పేరంటాళ్లు కూడా పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూల రేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల పిల్లలపై దృష్టి దోషం పోతుందనేది విశ్వాసం. పిల్లలు కూర్చునే పీట కింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో కూడా ఆరోగ్యానికి ఉపకరించేవాటినే (మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క) ఇస్తారు. మన పండుగల వెనుక ఆరోగ్యం దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి. కొన్ని చోట్ల భోగి పళ్లు పోయడానికి ముందు కొబ్బరి ముక్కలు చిన్నచిన్నగా తరిగి వాటిని దండగా గుచ్చి పిల్లలకి మెడలో వేస్తారు. భోగిపళ్ల ప్రహసనం పూర్తయ్యాక ఆ ముక్కలు పిల్లలు తినేస్తారు.
ప్రతి పండగ వెనక పరమార్థం, లౌకికం ఉంటాయి. మనవలందరూ ఇంటికి చేరడంతో తాతయ్యలకు, అమ్మమ్మలకు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే వారికి రెట్టింపు ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ సందర్భంగా ఒకచోటికి చేరుకుని, సంబరాలు చేసుకోవటం, ఇంటిల్లిపాదీ ఒకరినొకరు ఆట పట్టించుకోవటం...ఇవన్నీ వారికి నూతన శక్తినిస్తాయి. మళ్లీ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. అసలు పండగల వెనక ఉన్న పరమార్థమే ఇది.