వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు | Atmospheric Pollution Is Also A Major Cause Of Allergy | Sakshi
Sakshi News home page

వాతావరణంలో మార్పులతో... వెంటనే తుమ్ములు, జలుబు

Published Thu, Sep 26 2019 2:12 AM | Last Updated on Thu, Sep 26 2019 2:13 AM

 Atmospheric Pollution Is Also A Major Cause Of Allergy - Sakshi

మా పాప వయసు 12 ఏళ్లు. వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు... అదేపనిగా తుమ్ములు, జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతూ ఉంటుంది. స్కూల్‌కు కూడా పోవడం లేదు. మా పాప సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?

అలర్జీ గురించి మనం సాధారణంగా రోజూ వింటూ ఉంటాం. అలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఒక రుగ్మత. వర్షాకాలం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే అది పలు రకాల వ్యాధులతో బాధపెట్టవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్షాకాలంలో అలర్జీ సమస్య చాలామందిని వేధిస్తూనే ఉంటుంది. తుమ్ములూ, దగ్గులు మాత్రమే కాదు... ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ జలుబు, దగ్గు రావడం సహజంగా వైరల్‌ జ్వరాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులను ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మన ఆధునిక జీవితం, పారిశ్రామిక ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరాలూ, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం కూడా ఈ అలర్జీకి ఒక పెద్ద కారణం.

అలర్జీతో ఇబ్బందులు పడేవారి బాధ వర్ణనాతీతం. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ అలర్జీతో బాధపడుతుంటారు. అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్‌’ అంటారు. అలర్జీతో బాధపడేవారిలో వారు ఏదో ఒక ప్రత్యేకమైన పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దాన్ని తీసుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఒక రకమైన యాంటీబాడీస్‌తో ఈ అలర్జెన్స్‌ కలవడం వల్ల హిస్టమిన్‌ అనే రసాయనం విడుదల అవుతుంది. దీని కారణంగానే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి తాలూకు తత్వం, వాతావరణం, వంశపారంపర్య చరిత్రతో పాటు గాలి, నీరు, ఆహారంలో మార్పులు, కాలుష్యాల వల్ల రక్తంలో జరిగే మార్పులతో ఈ లక్షణాలు బయటపడతాయి. అం్ట కొన్ని రకాల పదార్థాలు, వస్తువులు ఈ అలర్జీకి కారణమవుతాయన్నమాట.

కారణాలు :
►దుమ్ము,
►పుప్పొడి రేణువులు
►పెంపుడు జంతువుల వెంట్రుకలు
►ఘాటైన వాసనలు
►చల్లటిగాలి
►శీతలపానియాలు ఐస్‌క్రీమ్‌లు
►మస్కిటో రిపల్లెంట్స్‌

వాతావరణంలో మార్పులు లక్షణాలు :
►తుమ్ములు
►ఆయాసం
►శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు / ఉబ్బసం
►వాంతులు
►ముక్కుకారడం
►ఒంటిపై దద్దుర్లు
►కళ్లు దురదలు పెట్టడం.

వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్‌ఆర్, ఇజినోఫిల్‌ కౌంట్, ఐజీ–ఈ యాంటీబాడీస్, ఎక్స్‌రే, పల్మునరీ ఫంక్షన్‌ టెస్ట్, సీటీ స్కాన్, అలర్జిక్‌ ప్రొఫైల్‌... మొదలైనవి.

చికిత్స : హోమియోలో అలర్జీ నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గేదెలా?

నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి.  

శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్‌ కూడా ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు.  చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో  మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది.

►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు.  డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్‌ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. 

►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. 

►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. 

దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు :

►ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. 

►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్‌ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

►కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్స్‌ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. 

►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది.

లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement