విష రసాయనాల ప్రవాహం ఇలా....
గ్రేటర్‌లో పలు చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మహానగరం పరిధిలో మొత్తం 185 చెరువులుండగా..ఇందులో 17 చెరువుల్లో కరిగిన ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోయినట్లు పీసీబీ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న ఘన, ద్రవ వ్యర్థాలతోపాటు, బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతోన్న విషరసాయనాలు ఆయా చెరువుల్లోకి నేరుగా చేరడంతో పలు చెరువులు విషం చిమ్ముతున్నాయి. ముఖ్యంగా 17 చెరువుల్లో కాలుష్యం మోతాదు భరించలేని స్థితికి చేరుకుంది. పీసీబీ ప్రమాణాల ప్రకారం ఆయా చెరువుల్లోని నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం ప్రతి లీటరు నీటిలో 4 మిల్లీగ్రాముల మేర ఉండాలి. కానీ పలు చెరువుల్లో 2 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా నమోదైంది. ఇక చెరువుల శుద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది.
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం విఫలంకావడం శాపంగా పరిణమిస్తోంది. పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్‌కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతోపాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం.
మురుగుతోనే అవస్థలు..
సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించడంలో జీహెచ్‌ఎంసీ విఫలంకావడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం..చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. పలు చెరువులు తమ ఎఫ్‌టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమై కనిపిస్తున్నాయి. చెరువుల ప్రక్షాళనకు జీహెచ్‌ఎంసీ పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తోంది. మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమౌతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ పథకం కింద 10 చోట్ల ఎస్టీపీలు, మరో రెండు చోట్ల రీసైక్లింగ్ యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.1200 కోట్లు నిధులు విడుదల చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం శాపంగా పరిణమిస్తోంది.
ఈ మూడు చెరువులు బెటర్...
♦ దాదాపు శతాబ్ద కాలంగా గ్రేటర్ దాహార్తినితీర్చిన గండిపేట్ (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్, శామీర్‌పేట్ పెద్ద చెరువుల్లో కరిగిన ఆక్సిజన్‌శాతం మోతాదు పీసీబీ ప్రమాణాల మేరకు నమోదైనట్లు పీసీబీ తాజా గణాంకాలు స్పష్టం చేయడం విశేషం.
చెరువుల ప్రక్షాళనకుతీసుకోవాల్సిన తక్షణ చర్యలివే..
♦ చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ సంస్థ నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలివే.
♦ గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి.
♦ జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి.
♦ చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి.
♦ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి.
♦ అన్యాక్రాంతం కాకుండా ఎఫ్‌టీఎల్ బౌండరీలు, రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి.
♦ జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి.
♦ వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.
♦ జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి.
♦ కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి.
Comments
Please login to add a commentAdd a comment