చెరువులో దూకి చనిపోయిన ప్రధాన నిందితుడు
సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా తప్పించుకున్నాడు: పోలీసులు
బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరి కోసం గాలింపు
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్‌లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment