జాక్.. ఒక జెమ్..!
స్కూల్, కాలేజీ స్థాయి సైన్స్ ఫెయిర్‌లలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూనే ఉంటారు. మాస్టార్ల పర్యవేక్షణల్లో చదువుకొచ్చిన సిద్ధాంతాల ఆధారంగా ప్రయోగపూర్వకంగా ప్రతిభను చాటుతూ ఉంటారు.. ఇలాంటి నేపథ్యమే ఉన్న హైస్కూల్ స్టూడెంట్ జాక్ పాల్గొన్నది కూడా సైన్స్‌ఫెయిరే!
అయితే దానికి పర్యవేక్షకుడు అమెరికన్ అధ్యక్షుడు.
జాక్ ప్రయోగం చేస్తున్నది వైట్‌హౌస్ లాన్‌లో...
కొన్ని వందల మంది తలపండిన ప్రొఫెసర్ల మధ్య... మరి అంత చిన్నోడి కి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది! అంత పెద్ద పరీక్ష ఎందుకు? అంటే.. అది కష్టమూ కాదు, అతడికి పరీక్ష కాదు. అతడు ఆవిష్కరించిన అద్భుతానికి రుజువు ఆ కార్యక్రమం!
అప్పటికే కొన్ని వందల ప్రయోగశాలల చుట్టూ తిరిగాడతను. అలాగే, తన ఆలోచన గురించి అనేకమంది ప్రొఫెసర్లకు చెప్పి చూశాడు. అయితే అందరూ అతడి వయసు, చదువు గురించి ఆలోచించారు కానీ.. అతడి థియరీలోని సత్తా గురించి ఎవ్వరూ ఆలోచించినట్టు లేదు. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన జాక్ ఆండ్రకాకు ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. అతడి థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా ఆ మహానుభావులెవరూ అడగలేదంటే... వారికి ఇతడు చెబుతున్న విషయం ఎంత అసంబద్ధంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికీ నిరాశ చెందక అతడు కొనసాగించిన ప్రయత్నమే క్లోమానికి సంబంధించిన క్యాన్సర్‌ల గుర్తింపులో కీలకావిష్కరణకు దారి తీసింది. అతడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, అనేక అవార్డులను తెచ్చిపెట్టింది.
మనిషిని చాలా తొందరగా మృత్యుముఖానికి తీసుకెళ్లే క్యాన్సర్లలో ఒకటి క్లోమగ్రంథికి వచ్చే క్యాన్సర్. తొలిదశలోనే దీన్ని గుర్తించకపోతే మరణానికి సిద్ధపడిపోవడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి క్యాన్సర్‌తోనే మరణించాడు జాక్ వాళ్ల అంకుల్. తను అమితంగా అభిమానించే ఆయన మరణానికి కారణం గురించి తెలుసుకొన్న అతడికి నిద్రపట్టలేదు. అప్పుడతనికి నిండా పదిహేనేళ్లు కూడా లేవు. అయితేనేం ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ గురించి పరిశోధించాడు. ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తికాకపోయినా.. వైద్యరంగ పరిశోధకుడిగా మారిపోయాడు. రక్తంలో ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ కారకాలను గుర్తించే సెన్సర్‌ను రూపొందించాడు.
మరి మహా వైద్య పరిశోధకులకే సవాలుగా మారిన ఆ వ్యాధి గురించి ఈ హైస్కూల్ విద్యార్థి వివరిస్తే ఎవరు వింటారు? ఆ వ్యాధిని తాను ప్రాథమిక దశలోనే గుర్తించగలనని అంటే ఎవరు నమ్ముతారు?! ఇలాంటి అహం చాలామంది పరిశోధకులను ఆ కుర్రాడి థియరీ ని జోక్‌గా తీసుకొనేలా చేసింది. అతడు చెబుతున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా అడగకుండా అనేక మంది పొమ్మన్నారు. అయినప్పటికీ జాక్ నిరాశపడలేదు.
దాదాపు వందమంది ప్రొఫెసర్ల చుట్టూ తిరిగినా.. ఏ ఒక్కరూ ప్రయోగానికి కూడా ఆతడికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికీ జాక్ వెనుదిరగలేదు, వెనక్కు తగ్గలేదు. వయసుతో ఉన్న ఉత్సాహమో, తన ఆలోచనపై ఆత్మవిశ్వాసంతోనో కానీ అనేక పరిశోధనాలయాల అడ్రస్‌లు వెదికిపట్టుకొని తన థియరీని వివరించాడు. చివరకు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వాళ్లు జాక్ ఐడియాను గుర్తించారు.
ప్రయోగపూర్వకంగా థియరీని నిరూపించడానికి అవకాశం ఇచ్చారు! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటివరకూ ఉన్న సెన్సర్‌లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! ఆ ఆశ్చర్యానికి రెండు కారణాలు.. వైద్యవిధానంలో నవ్యమైన ఆవిష్కరణ చూడటం ఒకటైతే.. ఒక హైస్కూల్ స్టూడెంట్ దాన్ని రూపొందించడం మరోటి. హాప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధనశాల మొదలు... వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ఒబామా ముందు జాక్ ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగశాల వరకూ.. అనేకసార్లు ఈ టీనేజర్ సెన్సర్‌కు సంబంధించిన థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.
మొదట్లో ఇతడి థియరీని ఏమాత్రం పట్టించుకోని పరిశోధకులు కూడా తర్వాత జాక్‌ను వేనోళ్ల ప్రశంసించారు. ఇతడు రూపొందించిన సెన్సర్ అత్యంత వేగవంతంగా పనిచేయడమే కాక, అతి చౌకగా అందుబాటులో ఉంటుందని ధ్రువీకరించారు. ఇంటెల్ ఇంజనీరింగ్ ఫెయిర్-2012లో జాక్ ప్రతిభను మెచ్చి 75 వేల డాలర్ల గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు నిర్వాహకులు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు వాడైన జాక్ ఐడియాకు ఇంతకుమించిన పురస్కారం ఏమిటంటే... అతడు రూపొందించిన సెన్సర్‌ను ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు. మరి టీనేజ్‌లో ఇంతకుమించిన సాఫల్యం ఏముంటుంది!
తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటి వరకూ ఉన్న సెన్సార్‌లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు!