జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్‌లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది.
పరిశోధన సంస్థల సందర్శన..
► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది.
► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్‌ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది.
► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు.
► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్‌లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు.
► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు.
ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష..
అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి.
జిల్లాస్థాయిలో ఇలా..
జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్‌లైన్‌లో అందిస్తారు.
రాష్ట్రస్థాయిలో..
పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు.
జాతీయ స్థాయిలో..
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు.
దరఖాస్తు ఇలా..
2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్‌సైట్‌లో రూ.200 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది.
విద్యార్థులకు మంచి అవకాశం..
విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment