Research centers
-
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం! దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని.. దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!! ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా? ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!! అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ! కోవిడ్–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్‌పై, ఫంగస్‌లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్మింత్స్ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది... ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు! తెలిసినవి అతిస్వల్పం... మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్–19 కారక వైరస్ సంగతి చూద్దాం... కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్ ల్యాబ్‌లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్‌లలో. కోవిడ్–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్‌ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట! అన్నింటా ప్రమాదమే...? సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్లలోకి ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు.. దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్ టీకాను బయోసేఫ్టీ లెవెల్–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు. ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి. విస్మరిస్తే.. ఏమవుతుంది? వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్–కోవ్–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్–కోవ్–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్‌లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు. -
కూరగాయలు తగ్గిపోతాయ్!
మన వంటిళ్ళల్లో కాయగూరలూ, ఆకుకూరలు మాయమయ్యేరోజులు అతి త్వరలోనే రాబోతున్నాయా? సరైన పరిష్కారం ఆలోచించకపోతే ఇకపై మన భోజనంలో కూరగాయలు తరిగిపోవడం ఖాయమట. నలభై సంవత్సరాల పరిశోధన(1975–2016) అనంతరం అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తేల్చి చెప్పింది. గత నలభై యేళ్ళలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కాయగూరలూ, ఆకు కూరల దిగుబడి విపరీతంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు నేషనల్ అకాడమీ స్పష్టం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కాయగూరల పంటలు 35 శాతానికీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడి 9 శాతానికి పడిపోయే ప్రమాదముందని తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు కూరగాయల దిగుబడిని 35 శాతానికి తగ్గించేస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. వాతావరణ కాలుష్యం, అధిక వేడిమి, గ్రీన్ గ్యాసెస్, నీటిలో ఉప్పు శాతం పెరగడం, అలాగే నీటి కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆకుకూరలు, కూరగాయల దిగుబడీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడీ అనూహ్యంగా తగ్గిపోనున్నట్టు అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారిక జర్నల్ ప్రచురించింది. గత నాలుగు దశాబ్దాలుగా (1975–2016)వెలువడిన పలు పరిశోధనలను శాస్త్రీయంగా పరిశీలించిన మీదట అమెరికాలోని నేషనల్ అకాడమీ ఈ నిర్ధారణకు వచ్చింది. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ పెరగటం వల్ల పంట దిగుబడి కొంత మేరకు పెరగవచ్చునని గతంలో జరిగిన పరిశోధనలు సూచించాయి. అయితే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి పెరిగే శాతం కంటే తగ్గే శాతమే ఎక్కువని ఈ అకాడమీ తేల్చి చెప్పింది. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో 174 పరిశోధన లు, 1,540 ప్రయోగాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు వివరించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చి చెప్పినప్పటికీ, కాయగూరలూ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్రప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. గత నాలుగు దశాబ్దాలుగా వెలువడిన పరిశోధనలను పునఃసమీక్షించిన అనంతరం లండన్ యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న అలన్ డాన్‌గౌర్ ఈ విషయాలను వెల్లడించారు. పర్యావరణ మార్పులను తట్టుకోలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి పరుచుకోవల్సిన తక్షణావశ్యకతను ప్రొఫెసర్ నొక్కి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారంలో ప్రధాన పాత్ర పోషించే ఆకుకూరలూ, కూరగాయలూ, చిక్కుడుజాతి గింజల కొరతతో మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లడమే కాకుండా ఆహారభద్రతకు సైతం పెనుముప్పు పొంచి వున్నట్టే. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డ్రైవింగ్ & పరిశోధన
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్ : డ్రైవింగ్‌లో శిక్షణ, పరిశోధన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటవుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. శిక్షణ కేంద్రం కోసం 20 ఎకరాలను జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద కేటాయించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంకాగా, దక్షిణ భారత దేశంలో రెండో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం అవుతుంది. తొలి శిక్షణ కేంద్రం తమిళనాడులో ఉండగా.. రెండోది సిరిసిల్లలోనే ఏర్పాటవుతోంది. ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్ లారీలు, ట్రక్కులు నడిపేవారికీ నైపుణ్యమైన శిక్షణ ఇస్తారు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులకు సైతం డ్రైవింగ్ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ఎక్కడైనా బస్సులు, లారీలతో ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు పనిష్మెంట్లో భాగంగా సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఏటా ఇక్కడ వెయ్యి మందికి శిక్షణ ఇస్తారు. పరిశోధన సంస్థగా.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ ట్రాక్, టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్, శిక్షణ పొందేవారికి హాస్టల్ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.16.48 కోట్లు కేటాయించారు. ఆధునిక రీతిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోపాటు అశోకా లేలాండ్ సంస్థ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు ముందుకొచ్చింది. దీనితో తెలంగాణలోని 31 జిల్లాల యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ పొందే వీలుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తారు. సిరిసిల్ల జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవింగ్ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. చురుగ్గా పనులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంజూరు చేయించారు. ప్రస్తుతం డ్రైవింVŠ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రహరీ నిర్మాణం, మెయిన్ బ్లాక్, భవనాలు నిర్మిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణాశాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రం, పరిశోధనలతో స్థానిక యువతకు మెరుగైన డ్రైవింగ్ విధానాలు దరిచేరనున్నాయి. డ్రైవింగ్ శిక్షణ కేంద్రం స్వరూపం ♦ స్థలం : రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లి ♦ నిర్మాణ వ్యయం : రూ.16.48 కోట్లు ♦ విస్తీర్ణం : 20 ఎకరాల్లో.. ♦ నిర్మాణ గడువు : ఏడాదిన్నర కాలం ♦ ప్రయోజనం : డ్రైవింగ్‌లో ఆధునిక శిక్షణ, నైపుణ్యం పెంపు ♦ ఎంత మందికి : ఏటా వెయ్యి మందికి ♦ నిర్వహణ : రవాణాశాఖ, అశోకా లేలాండ్ సంస్థ ♦ లక్ష్యం : ప్రమాద రహిత సమాజం -
ప్రైవేటు దోపిడీకి చెక్
స్వైన్ ఫ్లూ పరీక్షకు రూ.3,750 * ధర నిర్ణయించిన సర్కారు సాక్షి, చెన్నై : స్వైన్ ఫ్లూ పరీక్షల పేరిట కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు సాగిస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకునే వారి కోసం ధరను ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3750 మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్ని వెంటాడుతున్నది. ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో డెంగీ జ్వరం తాండ వం చేస్తుంటే, మరికొన్ని చోట్ల స్వైన్ ఫ్లూ లక్షణాలు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు వందలకు పైగా స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందారు. పదుల సంఖ్య లో ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. అయితే, రిపోర్ట్ రావడానికి ఆలస్యం అవుతోన్నది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పరిశోధనా కేంద్రాలను ఆశ్రయించే వాళ్లు అధికంగా ఉన్నారు. జ్వరం , జలుబు, దగ్గుతో వచ్చే వాళ్లకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు స్వైన్ ఫ్లూ పరీక్షలకు సిఫారసు చేస్తున్నాయి. దీంతో ఆ ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లతో పాటుగా కొన్ని నర్సింగ్ హోంల నుంచి వచ్చే సిఫారసులతో ప్రైవేటు ల్యాబ్ యాజమాన్యాలు దోపిడీ బాట పట్టాయి. రూ.8 వేల వరకు వీరు పరీక్షల ఫీజును గుంజుతున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు చేరాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆ పరీక్షలకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని దోపిడీకి కళ్లెం వేసే పనిలో పడింది. రూ.3750గా ప్రైవేటు ల్యాబ్, ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ పరీక్షకు ధరను నిర్ణయిస్తూ ప్రకటనను ఆరోగ్య శాఖ వెలువరించింది. డాక్టర్ల సిఫారసు మేరకు ఈ పరీక్షలు నిర్వహించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా ఎవరైనా వసూలు చేసిన పక్షంలో ల్యాబ్ లెసైన్సులు రద్దు అవుతాయన్న హెచ్చరికను ఆరోగ్య శాఖ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలతో పాటుగా ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి ఉన్నామని గుర్తు చేస్తూ, జ్వరం బారిన పడ్డ వారు తప్పని సరిగా వైద్యుల్ని సంపద్రించాలని సూచించారు. ఆదివారం మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తంజావూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, నాగర్ కోవిల్లో ఇద్దరు, కోయంబత్తూరు పెరియనాయగన్ పాళయంలో ఒకరు స్వైన్ ప్లూతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు. వీరికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. -
ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు
- సంస్థ ఏర్పాటుపై ఉమా, ప్రత్తిపాటి పట్టు - సీఎం వద్ద ఉమా మంత్రాంగం సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలో ముఖ్య శాఖలకు సంబంధించిన ఇద్దరు మంత్రుల మధ్య ‘ఎయిమ్స్’ చిచ్చు రగులుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను మా జిల్లాకు కావాలంటే.. మా జిల్లాకు కావాలంటూ.. ఇద్దరు మంత్రులూ పట్టుపడుతున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎయిమ్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం పలు విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లను ప్రధాన నగరాలైన కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కొక్కటి కేటాయించింది. అలాగే, విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్టుబడుతున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి ఉన్నందున రెండు ప్రాంతాలకూ అనుకూలంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో కేంద్ర బృందం కూడా త్వరలోనే స్థల పరిశీలన చేయనుంది. మరోవైపు ఎయిమ్స్‌ను ఎలాగైనా విజయవాడలోనే పెట్టించాలనే ఆలోచనతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపాదనకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో దానిని ఏర్పాటుచేస్తే విజయవాడ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది ఉమా అభిప్రాయం. జనాభా ఎక్కువగా ఉండడం, రాజధానికి అనువైన ప్రదేశం అయినందున విజయవాడలోనే నెలకొల్పాలని ఆయన సీఎం వద్ద పట్టుబడుతున్నారు. దీంతో రాజకీయంగా మంత్రులిద్దరి మధ్య దూరం బాగా పెరుగుతున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. మంత్రులు ఇలాంటి పట్టుదలలకు పోతే రేపు రాబోయే ప్రాజెక్టులపై ఎలాంటి వివాదాలు నెలకొంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అద్భుత అవకాశాల లైబ్రరీ సైన్స్
అప్ కమింగ్ కెరీర్: భారత్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. దేశం క్రమంగా విజ్ఞాన ఆధారిత సమాజంగా రూపుదిద్దుకుంటోంది. దీంతో లైబ్రరీ సైన్స్‌కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు నానాటికీ విసృ్తతమవుతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం రంగ ప్రవేశం చేయడంతో అన్ని రంగాల్లో మాదిరిగానే లైబ్రరీ సైన్స్‌లో కూడా సంప్రదాయ విధానాలకు భిన్నంగా ఆధునిక పోకడలు ప్రవేశించాయి. లైబ్రేరియన్లు ఇప్పుడు సీడీలు, ఇంటర్నెట్, ఈ-లైబ్రరీల ద్వారా సమాచారం అందిస్తున్నారు. వేధిస్తున్న నిపుణుల కొరత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా, అభివృద్ధి సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కార్పొరేట్ సెక్టార్, మీడియా సంస్థల్లో ప్రస్తుతం లైబ్రరీ ప్రొఫెషనల్స్‌కు భారీ డిమాండ్ ఉందని, కన్సల్టెంట్‌గా కూడా స్వయం ఉపాధి పొందొచ్చని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ, పారిశ్రామిక ప్రగతి, బహుళజాతి కంపెనీల ఏర్పాటుతో లైబ్రేరియన్లకు అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. దాంతో నిపుణులైన లైబ్రేరియన్ల కొరత నెలకొంది. పేరున్న గ్రంథాలయాల్లో ఉన్నత స్థానాల్లో ఖాళీలు అనేకం. భారీ వేతనాలు భారత్‌లో లైబ్రేరియన్ ఉద్యోగంపై ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేదు. లైబ్రేరియన్ అంటే గ్రంథాలయాల్లో పుస్తకాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే అని భావిస్తున్నారు. దీనివల్ల ఈ రంగంలో ప్రవేశించేందుకు ఎక్కువమంది ఇష్టపడడం లేదు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఇందులోకి రావడం లేదు. కానీ, దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అనుభవం కలిగిన లైబ్రేరియన్ వేతనం యూనివర్సిటీ ప్రొఫెషర్తో సమానంగా ఉంటుంది. ఏడాదికి రూ.5 లక్షల వరకు వేతనం తీసుకుంటున్న లైబ్రేరియన్లు ఉన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో లైబ్రేరియన్ హోదా అదనపు కార్యదర్శి హోదాతో సమానం. లైబ్రేరియన్‌గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు 70 శాతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిగతా 30 శాతం సంప్రదాయ లైబ్రేరియన్షిప్ ద్వారా సమాచారం పొందుతున్నారు. కాబట్టి లైబ్రేరియన్‌కు తప్పనిసరిగా ఐటీ స్కిల్స్ కూడా అవసరమే. పాఠకులకు సేవలందించాలంటే ఆశయం, ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు. లైబ్రేరియన్‌కు ఉండాల్సిన లక్షణాలు 1. పాఠకుల అవసరాలకు గుర్తించగల నైపుణ్యం 2. ముఖ్యమైన అంశాలపై కనీస పరిజ్ఞానం 3. పాఠకులు చెప్పేది ఓపిగ్గా వినగలిగే నేర్పు లైబరీ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ వెబ్సైట్: www.niscair.res.in ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: http://www.uohyd.ac.in/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://www.ignou.ac.in/ డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: http://www.braou.ac.in/