మన వంటిళ్ళల్లో కాయగూరలూ, ఆకుకూరలు మాయమయ్యేరోజులు అతి త్వరలోనే రాబోతున్నాయా? సరైన పరిష్కారం ఆలోచించకపోతే ఇకపై మన భోజనంలో కూరగాయలు తరిగిపోవడం ఖాయమట. నలభై సంవత్సరాల పరిశోధన(1975–2016) అనంతరం అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తేల్చి చెప్పింది. గత నలభై యేళ్ళలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కాయగూరలూ, ఆకు కూరల దిగుబడి విపరీతంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు నేషనల్ అకాడమీ స్పష్టం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కాయగూరల పంటలు 35 శాతానికీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడి 9 శాతానికి పడిపోయే ప్రమాదముందని తేల్చి చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు కూరగాయల దిగుబడిని 35 శాతానికి తగ్గించేస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. వాతావరణ కాలుష్యం, అధిక వేడిమి, గ్రీన్ గ్యాసెస్, నీటిలో ఉప్పు శాతం పెరగడం, అలాగే నీటి కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆకుకూరలు, కూరగాయల దిగుబడీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడీ అనూహ్యంగా తగ్గిపోనున్నట్టు అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారిక జర్నల్ ప్రచురించింది. గత నాలుగు దశాబ్దాలుగా (1975–2016)వెలువడిన పలు పరిశోధనలను శాస్త్రీయంగా పరిశీలించిన మీదట అమెరికాలోని నేషనల్ అకాడమీ ఈ నిర్ధారణకు వచ్చింది.
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ పెరగటం వల్ల పంట దిగుబడి కొంత మేరకు పెరగవచ్చునని గతంలో జరిగిన పరిశోధనలు సూచించాయి. అయితే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి పెరిగే శాతం కంటే తగ్గే శాతమే ఎక్కువని ఈ అకాడమీ తేల్చి చెప్పింది. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో 174 పరిశోధన లు, 1,540 ప్రయోగాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు వివరించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చి చెప్పినప్పటికీ, కాయగూరలూ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్రప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
గత నాలుగు దశాబ్దాలుగా వెలువడిన పరిశోధనలను పునఃసమీక్షించిన అనంతరం లండన్ యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న అలన్ డాన్‌గౌర్ ఈ విషయాలను వెల్లడించారు. పర్యావరణ మార్పులను తట్టుకోలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి పరుచుకోవల్సిన తక్షణావశ్యకతను ప్రొఫెసర్ నొక్కి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారంలో ప్రధాన పాత్ర పోషించే ఆకుకూరలూ, కూరగాయలూ, చిక్కుడుజాతి గింజల కొరతతో మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లడమే కాకుండా ఆహారభద్రతకు సైతం పెనుముప్పు పొంచి వున్నట్టే.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment