Laboratory Biosafety Guidelines For COVID-19 - Sakshi
Sakshi News home page

లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?

Published Sun, Jun 13 2021 2:59 AM | Last Updated on Sun, Jun 13 2021 11:14 AM

Biosafety Guidelines for COVID-19 - Sakshi

ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం!  దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత?
సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని..   దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!!
ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా?
ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!!
అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా?
వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ!

 
కోవిడ్‌–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్‌పై, ఫంగస్‌లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్‌మింత్స్‌ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్‌–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది...  ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్‌ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్‌ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు!  

తెలిసినవి అతిస్వల్పం...
మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్‌–19 కారక వైరస్‌ సంగతి చూద్దాం...

కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే...
బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్‌ ల్యాబ్‌లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్‌లలో. కోవిడ్‌–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్‌ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్‌ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్‌ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట!
 

అన్నింటా ప్రమాదమే...?
సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు.  ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్‌లలోకి  ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్‌ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి.  

నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు..
దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్‌ టీకాను బయోసేఫ్టీ లెవెల్‌–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు.  ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్‌ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి.

విస్మరిస్తే.. ఏమవుతుంది?
వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్‌–కోవ్‌–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్‌–కోవ్‌–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్‌లు  కాకుండా పలు ఇతర వైరస్‌లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త  వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్‌ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement