Black Fungus
-
Hyderabad: బ్లాక్ ఫంగస్‌తో కంటి చూపుకోల్పోయిన వ్యక్తి ఆత్మహత్య
రాజేంద్రనగర్ (హైదరాబాద్): కరోనా, బ్లాక్ ఫంగస్‌తో మంచానికే పరిమితమై మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్‌పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ ప్రేమావతిపేట ప్రాంతానికి చెందిన నవీన్‌కుమార్(35) యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. ఆయనకు 2017లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమారె సంతానం. 2020 సంవత్సరం మే నెలలో ఆయన కోవిడ్ బారినపడ్డాడు. జూన్ నెలలో బ్లాక్ ఫంగస్ గురయ్యాడు. దీంతో చికిత్స పొందుతూ కంటి చూపు కొల్పొయాడు. కోలుకున్న అనంతరం ఇంటి వద్దే ఉంటున్నాడు. మంచానికే పరిమితమైన నవీన్‌కుమార్ తరచుగా మనోవేదనకు గురయ్యేవాడు. ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నోట్లో నుంచి నురుగులు వస్తుండడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: నగరంలో ఇద్దరు మహిళల అదృశ్యం.. ఫోన్స్ స్విచ్ఛాఫ్) -
కోవిడ్‌ను మించి కంగారు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కంటే జనాన్ని బ్లాక్ ఫంగస్సే ఎక్కువగా భయపెట్టింది. సోకింది అతికొద్దిమందికే అయినా బాధిత కుటుంబ సభ్యులకు వణుకు పుట్టించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొదటి, సెకండ్ వేవ్ కలిపి 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో బ్లాక్ ఫంగస్ కేసులను అంచనా వేస్తే కేవలం 0.24 శాతం మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసులను బట్టి చూస్తే.. ప్రతి 10 వేల మందిలో ఇద్దరికే ఇది సోకింది. కానీ వెయ్యి మందికి చేసిన వ్యయం ఈ ఇద్దరికే అయినట్టు అంచనా వేశారు. ఖరీదైన మందులు, వైద్యుల సమూహంతో చికిత్స, దీర్ఘకాలం మందులు వాడాల్సి రావడం దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికీ 337 మందికి కొనసాగుతున్న చికిత్స ఈ బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) జబ్బుకు ఇప్పటికీ 337 మందికి చికిత్స కొనసాగుతూనే ఉంది. బ్లాక్ ఫంగస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలిక చికిత్స చేయాల్సి ఉన్నందున చికిత్సను కొనసాగించాల్సి వస్తోంది. రోగులు పూర్తిగా కోలుకునే వరకూ నెలల తరబడి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాంఫొటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్లతో పాటు పొసకొనజోల్ మాత్రలూ తరచూ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ 337 మందిలో అత్యధికంగా 132 మంది గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు 804 చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఇది సోకిన బాధితుల్లో అత్యల్పంగా ఒకే ఒక్కరు విజయనగరం జిల్లాలో మృతిచెందారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ నమోదైంది కూడా 26 కేసులే. కోవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్‌నూ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్‌ఫంగస్ మందుల కోసమే ప్రభుత్వం రూ.110 కోట్లు వ్యయం చేసింది. -
బ్లాక్ ఫంగస్ మందుల పేరుతో బురిడీ
సాక్షి, సిటీబ్యూరో: బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందుల కొరతను ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ ఔషధాలను విక్రయిస్తామంటూ ఆన్లైన్ కేంద్రంగా నగరవాసులకు టోకరా వేశారు. ఈ తరహా నేరానికి సంబంధించిన నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం యువకుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. దీంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఎంపోటెరిసిసిన్–బీ సంబంధిత ఇంజెక్షన్లు తమ వద్ద లేవని, బయట కొనుగోలు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబం ఇంజెక్షన్లు కావాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అది చూసి వారిని సంప్రదించిన సైబర్ నేరగాడు ఇంజెక్షన్ల సరఫరాకు అడ్వాన్స్ ఇవ్వాలంటూ రూ.40 వేలు కాజేశాడు. ఔషధం పంపని అతగాడు ఇంకా కొంత మొత్తం కోరుతుండటంతో అనుమానించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. అలా లభించిన ఆధారాలను బట్టి నిందితుడిని విశాఖపట్నానికి చెందిన హేమంత్గా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ఓ ప్రత్యేక బృందం బుధవారం అతడిని అరెస్టు చేసి నగరానికి తరలించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడైన హేమంత్ డిగ్రీ పూర్తి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. -
హీరో, హీరోయిన్లాంటి భార్యాభర్తలు పోలీసులకు వీడియో పంపి
బెంగళూరు: కరోనా సోకిన అనంతరం బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటారనే వార్తలు రావడంతో భయాందోళన చెందిన ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రాణాపాయం ఉందనే వార్తలు టీవీలు, పత్రికల్లో వచ్చిన వాటిని చూసి భయపడిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచి ఉంచిన విషయాన్ని చెప్పి మరీ వారు తమ ప్రాణాలను తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. రమేశ్ (40), గుణ సువర్ణ (35) భార్యాభర్తలు. వీరిద్దరూ మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురవడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని వార్తలు వచ్చాయి. ఆ ఫంగస్ ప్రభావం మధుమేహం ఉన్న వారికి తీవ్ర ప్రభావం ఉంటుందని వచ్చిన వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే గుణ సువర్ణకు మధుమేహం ఉంది. తమకు కూడా బ్లాక్ ఫంగస్ సోకితే చికిత్సకు భారీ మొత్తం ఖర్చయితే తాము భరించలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు వీరు వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను వివరించారు. ఆ వీడియోను మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్‌కు పంపించారు. పంపించిన వెంటనే ఇది చూసిన కమిషనర్ వారిని ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారు ఎక్కడుంటారో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక మీడియాలో కూడా ఇది వివరించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు వారి ఆచూకీ కనుగొనేలోపు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉన్నారు. చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచిన విషయం పోలీసులకు వీడియోలో చెప్పారు. అంతేకాదు తమ దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయించాలని, దీనికి పోలీస్ కమిషనర్ శశికుమార్, శరణ్ పంప్‌వెల్, సత్యజిత్ సురత్కల్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇంట్లోని వస్తువులు పేదలకు పంచాలని ఆ దంపతులు వీడియోలో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. సంతాన లేమితో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు -
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
కోవిడ్ నుంచి కోలుకున్నా..మళ్లీ ఇదేం బాధరా భగవంతుడా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం బాధితుల్లో ఎంతో కాలం నిలవడం లేదు. మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ వారిని (మ్యూకర్ మైకోసిస్) బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ మళ్లీ వెంటాడుతోంది. మే రెండో వారంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని ఇందుకు నోడల్ సెంటర్‌గా ఎంపిక చేసింది. పడకల సామర్థ్యానికి మించి కేసులు రావడంతో గాంధీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక బ్లాక్ ఫంగస్ విభాగాలు ఏర్పాటు చేసింది. 86 శాతం మంది టీకా తీసుకోని వారే ►ఈఎన్టీ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిటైన 300 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై ఇటీవల ఓ సర్వే చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ►వైరస్ బారిన పడిన బాధితుల్లో 86 శాతం మంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఫస్ట్ డోసు పూర్తి చేసుకున్నట్లు వెల్లడైంది. ►అంతేకాదు ఎంపిక చేసిన బాధితుల్లో 280 మంది మధుమేహ బాధితులే. వీరిలో 51 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత డయాబెటిక్, డినోవాలు వెలుగు చూడగా, 43 శాతం మందికి కరోనాకు ముందే మధు మేహం ఉన్నట్లు గుర్తించారు. ►కరోనా చికిత్సల్లో వైద్యులు రెమ్‌డెసివిర్, ఇతర స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగించడమే ఇందుకు కారణమని తెలిసింది. ప్రస్తుతం మరో 200 మంది బాధితులు గాంధీలో ప్రస్తుతం 150 కోవిడ్ పాజిటివ్/బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా, ఈఎన్టీలో 50 మంది వరకు చికిత్స పొందు™తున్నారు. వీరిలో కొంత మంది దవడ సర్జరీల కోసం ఎదురు చూస్తుండగా, మరికొంత మంది ముక్కు, కన్ను సర్జరీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సెంటర్లలో రోజుకు పది నుంచి పదిహేను సర్జరీలు జరుగుతున్నాయి. ►బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను, ముక్కు, దవడ భాగాలను కోల్పోయిన బాధితులు వాటి స్థానంలో కృత్రిమ అవయవాలను అమర్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ►పేదలకు ఈ ప్లాస్టిక్ సర్జరీలు భారంగా మారాయి. ఆర్థికస్తోమత ఉన్న వారు యుక్త వయస్కులు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. 150 మందికి దెబ్బతిన్న కంటిచూపు ► ఈఎన్టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 2,676 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ► వీరిలో 1896 మందికి వైద్యులు సర్జరీలు చేశారు. వీరిలో 150 మందికి కంటి సంబంధిత సర్జరీలు చేయగా...దాదాపు అందరూ చూపును కోల్పోయినట్లే. ► 650 మందికి దవడ, దంతాలను, 350 మందికి ముక్కు, మరో 746 మందికి ఇతర భాగాల తొలగింపు శస్త్రచికిత్సలు చేశారు. గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు : 2676 వీరిలో ఎంత మందికి సర్జరీలు చేశారు : 1896 కంటి సర్జరీలు : 150 పన్ను తొలగింపు సర్జరీలు : 650 ముక్కు తొలగింపు సర్జరీలు : 350 ఇతర భాగాల తొలగింపు : 746 -
కోవిడ్‌తో క్షయకు అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల ఒక వ్యక్తి క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది. ‘కోవిడ్ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్ నిర్ధారణ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది. -
Gandhi Hospital: 19 నుంచి నాన్‌కోవిడ్ సేవలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కోవిడ్, నాన్‌కోవిడ్ సేవలు అందించాలని ఆస్పత్రి అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి గాంధీలో కేవలం కోవిడ్ బాధితులకు మాత్రమే వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న క్రమంలో నాన్‌కోవిడ్ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 215 కరోనా, 179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న 44 మందిని సోమవారం డిశ్చార్జీ చేసినట్లు నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నాన్‌కోవిడ్ సేవలను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. ఆర్థో ఐసీయూ, సెకండ్ ఫ్లోర్‌తో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్, బ్లాక్‌ఫంగస్ వార్డులు ఏర్పాటు చేస్తామని, గతంలో మాదిరిగా క్యాజువాలిటీ, ఓపీ, ఐపీ భవనాల్లో నాన్‌కోవిడ్ సేవలు కొనసాగుతాయని వివరించారు. థర్డ్‌వేవ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తీవ్రత ఏమేర ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
కరోనా, బ్లాక్ ఫంగస్: 85 రోజులు మృత్యువుతో పోరాడి
ముంబై: కరోనా మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరినో బలి తీసుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది వేర్వేరు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందారు. కానీ, ముంబైకి చెందిన ఒక వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా మృత్యుంజయుడే అంటారు. ఎందుకంటే సదరు వ్యక్తి కరోనాతో మాత్రమే కాక, బ్లాక్ ఫంగస్, అవయవాల విఫలం వంటి పలు తీవ్ర సమస్యలతో పోరాడాడు. ఒకానొక సమయంలో వైద్యులు, కుటుంబ సభ్యులు కూడా సదరు వ్యక్తి మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆశ్చర్యంగా అతడు ఈ సమస్యలన్నింటి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ముంబైకి చెందిన 54 ఏళ్ల భరత్ పంచల్ అనే వ్యక్తి మార్చి మూడో వారంలో కోవిడ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 8న జ్వరం రావడంతో హిరానందాని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ భరత్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. సిటీ స్కాన్‌లో భరత్‌కు కరోనా మోతాదు 21 నుంచి 25 మధ్యలో ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్ఫెక్షన్ ఎక్కువయి.. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే భరత్ శరీరంలోని ఇతర అవయవాలలో కూడా సమస్యలు మొదలయ్యాయి. అతని ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. మూత్రపిండాలు దెబ్బతినడం, కాలేయం పనిచేయకపోవడం, సెప్సిస్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తుల చీలిక వంటి చాలా లక్షణాలతో పాటు కోవిడ్ రోగులలో కనిపించే బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ పరిస్థితుల మధ్య భరత్.. 70 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. కోవిడ్ రోగికి వచ్చే ప్రతి సమస్య.. భరత్‌కు వచ్చినట్లు హిరానందాని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గత 15 నెలల్లో తమ ఆస్సత్రిలో ఏ పేషంట్ ఎక్కువ కాలం ఇలా ఉండలేదని వారన్నారు. భరత్‌ను రక్షించేందుకు వైద్యశాస్త్రంలోని ప్రతి అవకాశాన్ని వైద్యులు ప్రయత్నించారు. రెమిడెసివర్, ప్లాస్మా థెరపితో పాటు మరికొన్ని చికిత్సలను కూడా చేశారు. కానీ, వీటి వల్ల భరత్ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా.. భరత్ ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం కావడం ప్రారంభం కావడంతో.. అతని కుటుంబం ఆశలు వదులుకుంది. అయితే తనను రక్షించుకోవడం కోసం తన కుటుంబం పడుతున్న ఆరాటం చూసిన భరత్.. ఎలాగైనా బతకాలని దృఢసంకల్పంతో బాధను భరించాడు. ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం ప్రారంభమైన 15 రోజుల తర్వాత చికిత్సకు స్పందించి.. అన్ని సమస్యలను అధిగమించాడు. దాంతో 85 రోజుల చికిత్స తర్వాత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. చనిపోతాడనుకున్న భరత్.. తిరిగి ఇంటికి రావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా పేషెంట్లకు బోన్ డెత్ ముప్పు?
ముంబై: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బోన్ డెత్ రూపంలో కొత్త ప్రమాదం తలెత్తడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాస్కులార్ నెక్రోసిస్(ఏవీఎన్)లేదా బోన్ టిష్యూ డెత్‌గా పిలిచే ఈ వ్యాధిని ఇప్పటివరకు ముగ్గురు కరోనా వచ్చి తగ్గినవారిలో కనుగొన్నట్లు హిందూజా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా రోగులకు బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ఎదురై అందరినీ ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే! తాజాగా కరోనా అనంతరం ఏవీఎన్ ముప్పు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్రోగులకు వాడే స్టిరాయిడ్లే ఈ ఏవీఎన్ వచ్చేందుకు ప్రాథమికంగా కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫీమర్ ఎముక వద్ద మొదలైన నొప్పితో ముగ్గురు ఆస్పత్రికి వచ్చారని, కోవిడ్ వచ్చిన తగ్గిన రెండు నెలలకు వీరిలో ఈ సమస్య బయటపడిందని డా. సంజయ్ అగర్వాల్ చెప్పారు. కోవిడ్ ట్రీట్మెంట్లో దీర్ఘకాలం పాటు కార్టికోస్టిరాయిడ్లు వాడడంతో ఏవీఎన్ కేసులు పెరుగుతున్నాయని బీఎంజే కేస్ స్టడీస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాటం చేసినవారిలో ఈ బోన్‌డెత్ లక్షణాలు గమనించామని మరికొందరు డాక్టర్లు సైతం చెబుతున్నారు. వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇలాంటి కేసులు పెరగవచ్చని, స్టిరాయిడ్ల వాడకమైన 5–6 నెలలకు ఈ వ్యాధి బయటపడుతుంటుందని డా. రాహుల్ పండిట్ చెప్పారు. సెకండ్ వేవ్ ఏప్రిల్‌లో గరిష్ఠాలకు చేరిందని, అప్పుడు వైద్యం చేయించుకున్నవారిలో బోన్‌డెత్ లక్షణాలు బయటపడేందుకు కొంత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. అయితే సంజయ్ అభిప్రాయం ప్రకారం త్వరలోనే ఏవీఎన్ కేసులు పెరుగుతాయి. సాధారణంగా ఏవీఎన్ లక్షణాలు బయటపడేందుకు చాలా నెలలు పడుతుందని, కానీ ఇప్పుడు ట్రెండ్‌లో స్వల్పకాలంలోనే ఈ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి సోకినవాళ్లను తొలినాళ్లలో గుర్తిస్తే మంచి వైద్యం అందించవచ్చన్నారు. తొలిదశలో ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉండదన్నారు. కోవిడ్ వచ్చి తగ్గినవాళ్లు తొడలు, హిప్ జాయింట్ వద్ద నొప్పి కొనసాగుతుంటే ఎంఆర్ఐ స్కానింగ్‌కు వెళ్లాలని, అనంతరం ఏవీఎన్ వ్యాధి సోకిందేమో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలిదశలో బిస్ఫాస్ఫోనేట్ థెరపీ ద్వారా దీన్ని తగ్గించవచ్చన్నారు. -
TS: బ్లాక్ ఫంగస్‌తో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
సాక్షి,ఖమ్మం: స్థానిక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎస్సైగా పనిచేస్తున్న ఎం.చిరంజీవి (55) బ్లాక్ ఫంగస్‌తో ఆదివారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. నేలకొండపల్లి ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవికి నెల రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అక్కడ కరోనా నెగటివ్ వచ్చాక బ్లాక్ ఫంగస్ సోకింది. అదే హస్పిటల్లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్న సందర్భంలో మళ్లీ అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్ సీఐ విజేందర్, ట్రైనింగ్ ఎస్సైలు శంకర్, సందీప్, నేలకొండపల్లి, కొత్తకొత్తూరు సర్పంచ్‌లు రాయపూడి నవీన్, వల్లాల రాధాకృష్ణ, రాచమంద్రాపురం సొసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం, దగ్గుల అంజిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు -
30 మంది కంటిచూపు మింగేసిన బ్లాక్‌ఫంగస్
కోయంబత్తూరు: బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సోకుతున్న సంగతి తెలిసిందే! ఇలా సోకి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు. -
కాకినాడ జీజీహెచ్‌లో 100కు చేరిన బ్లాక్ ఫంగస్ సర్జరీలు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్ ఫంగస్ రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. -
ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఈ పథకం కింద చికిత్స చేయడానికి ఆస్పత్రులు నిరాకరించేవి. ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదు. చంద్రబాబు సర్కారు నీరు కార్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊపిరి పోశారు. తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీ కార్డు లింక్‌ను ఉప సంహరించడమే కాకుండా, పేదలతో పాటు వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు గల సామాన్య ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. తద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తరచూ సమీక్షలతో ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స గత ఏడాది కోవిడ్–19ను కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్‌ను కూడా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం పేదలు, సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద 1.55 లక్షల మందికి పైగా కోవిడ్ రోగులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.435.87 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకాన్ని గతంలో వెయ్యి చికిత్సలకే పరిమితం చేస్తే, సీఎం జగన్ 2,434 వ్యాధులు, ఆపరేషన్లకు పెంచారు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా వీలు కల్పించారు. తద్వారా రాష్ట్రంలో పేదలు, సామాన్యులను వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. -
రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్‌్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్ వీవీ నగర్లో మెడిక్స్ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్‌కు చెందిన ఎన్.వెంకట దినేష్ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్విన్ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని శ్రీనివాస్‌తో కలిసి వారు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్ ఇంజెక్షన్‌ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్‌ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్‌గా చేసుకుని ఈ దందాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్‌గోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కోవిడ్, బ్లాక్ ఫంగస్ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్.. కళ్లు తొలగించిన వైద్యులు
ముంబై: కరోనా కన్నా అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంతవరకు పెద్దల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి తాజాగా చిన్నారుల్లోను వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి ముగ్గురు చిన్నారుల కళ్లు తొలగించాల్సి వచ్చింది. వీరిలో4,6,14 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఫంగస్ బారిన పడిన ముగ్గురిలో ఇద్దరికి ఒక ఆస్పత్రిలో, మరోకరి వేరేక ఆస్పత్రిలో సర్జరీ చేసి ఒక కన్ను తొలగించారు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక డయాబెటిస్ సమస్య ఉంది. ఈ క్రమంలో ఆమెకు కంట్లో ఏదో ఇబ్బందిగా అనిపించి ఆస్పత్రికి వెళ్లింది. అనూహ్యంగా హాస్సిటల్‌కు వెళ్లిన 48 గంటల్లోనే బాలిక కన్ను పూర్తిగా నల్లగా మారింది. ఫంగస్ ముక్కు వరకు సోకింది. బాలిక అదృష్టం కొద్ది మెదడుకు చేరలేదు. బాలిక పరిస్థితి విషమిస్తుండటంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బాలిక కంటిని తొలగించాల్సి వచ్చింది. ఇక పైన చెప్పుకున్న మరో చిన్నారులిద్దరికు డయాబెటిక్ సమస్య లేదు. కానీ కోవిడ్ బారినపడ్డారు. ఆ తర్వాత వీరిలో బ్లాక్ ఫంగస్ వెలుగు చూసింది. చిన్నారులిద్దరిని ముంబైలోని కేబీహెచ్ బచువాలి ఆప్తాల్మిక్ అండ్ ఈఎన్టీ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత చిన్నారులిద్దరికి ఆపరేషన్ చేసి కన్ను తొలగించారు. సర్జరీ చేసి కన్ను తొలగించకపోతే బాధితుల జీవితం ప్రమాదంలో పడేదన్నారు వైద్యులు. ఇక 16 ఏళ్ల బాధితురాలు నెల రోజుల క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. కోవిడ్ బారిన పడి కోలుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె డయాబెటిస్ బారిన పడింది. ఆమె పేగుల్లో రక్తస్రావం కాసాగింది. యాంజియోగ్రఫీ చేసి ఆమె కడుపు దగ్గర రక్తనాళాలకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించామని తెలిపారు వైద్యులు. ‘‘4,6 ఏళ్ల చిన్నారులిద్దరిలో అప్పటికే ఫంగస్ కంటిలోకి చేరి.. వారిని తీవ్రంగా బాధించింది. ఇక వీరిలో ఒకరు గతేడాది డిసెంబర్లో మా వద్దకు రాగా.. రెండవ కేసు సెకండ్‌వేవ్ సమయంలో వచ్చింది’’ అని ఆసుపత్రిలో ఓక్యులోప్లాస్టీ, ఓక్యులర్ ఆంకాలజీ అండ్ ఓక్యులర్ ప్రొస్థెటిక్ డాక్టర్ ప్రితేష్ శెట్టి తెలిపారు. చదవండి: బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే -
బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్‌లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్‌లో ఐదుగురిని, రెండో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు
బనశంకరి/కర్ణాటక: రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్ ఫంగస్ రోగులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్రంలో 2,600 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా, వీరిలో 127 మంది కోలుకున్నారు. 197 మంది మృత్యవాత పడ్డారు. మృతుల సంఖ్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ బాధితులకు బెడ్లు, ఔషధాల కొరత వేధిస్తోంది. యాంఫోటెరిసిన్–బి టీకాలు పెద్దగా అందుబాటులో లేవు. బెంగళూరులో ప్రమాదఘంటికలు బెంగళూరులో ఇప్పటివరకు 900 మంది బ్లాక్ ఫంగస్ బారినపడగా, 70 మంది మృతిచెందారు. కలబురిగిలో 146, బాగల్‌కోటే 97, బళ్లారి 88, బెళగావి 147, ధారవాడ 202, మైసూరు 93, రాయచూరు 81, విజయపుర 99, చిత్రదుర్గ 99 మంది ఫంగస్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా జిల్లో 10– 20 మంది వరకూ బాధితులున్నారు. యాంఫోటెరిసిన్ కొరత రాష్ట్రంలో 9,700 వయల్స్ యాంఫోటెరిసిన్ టీకాల స్టాకు మాత్రమే ఉంది. రోగుల సంఖ్య ప్రకారమైతే నిత్యం 12 వేల వయల్స్ కావాలి. ఒకటీ అరా సూదులతో సరిపెడుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో చికిత్స అందించాలంటే కనీసం లక్ష వయల్స్ కావాలని బ్లాక్ ఫంగస్ నిపుణుల కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. చదవండి: బీపీఎల్ కుటుంబాలకు సాయం: సీఎం -
జానకినందన్ జయించాడు
కాకినాడ క్రైం: బ్లాక్‌ఫంగస్‌ను జయించిన పిన్న వయస్కుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 17 నెలల బాలుడు ఘనత సాధించాడు. కాకినాడ జీజీహెచ్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య ప్రవీణ్‌చంద్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. బాలుడు జానకినందన్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్లాక్ ఫంగస్ బాధితుడని అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ వైద్యులు బాలుడికి పునర్జన్మ ప్రసాదించారని కొని యాడారు. ఇదే చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కనీసం రూ.70 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. కోవిడ్ పీడియాట్రిక్స్ నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం బాలుడు అత్యంత ప్రమాదకర స్థితిలో జీజీహెచ్‌లో చేరాడన్నారు. చంటిపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు, ఈఎన్టి హెచ్‌వోడి డాక్టర్ కృష్ణకిషోర్ పర్యవేక్షణలో సూపరిం టెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సేవలందించామన్నారు. జూన్ 3న సైనస్ ద్వారా డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి, ఫంగస్‌ను తొలగించామన్నారు. శస్త్రచికిత్స తరువాత తిరిగి పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి డాక్టర్ ఎంఎస్ రాజు ఆధ్వర్యం లో వైద్య సేవలు కొనసాగాయని వెంకటేశ్వర్లు చెప్పారు. 12 రోజుల పూర్తి పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. బాలుడిని ప్రతి 10 రోజులకు ఒకసారి పరీక్షిస్తామని, కొన్ని నెలలపాటు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. అత్యుత్తమ వైద్య సేవలు, నిష్ణాతులైన వైద్య బృందాలు కాకినాడ జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని కోరారు. బాలుడి తల్లిదండ్రులు పద్మ, కిరణ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనితతో పాటు ఆర్ఎంఓ డాక్టర్ దీప్తి వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ వ్యాధితో కష్టాలుపడుతున్న బాధితులకు కేంద్రప్రభుత్వం కాస్త ఉపశమనం కల్గించే కబురుతెచ్చింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలపై జీఎస్టీ(వస్తుసేవల పన్ను)ను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో కోవిడ్ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 28న ఏర్పాటైన మంత్రుల బృందమొకటి జూన్ ఏడున ఇచ్చిన నివేదికపై కౌన్సిల్ చర్చించింది. తాజాగా తగ్గిన జీఎస్టీ రేట్లు ఈ సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై వసూలుచేస్తున్న పన్నును తగ్గించాలన్న డిమాండ్లను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వ్యాక్సిన్లపై ప్రస్తుతమున్న 5% పన్ను అలాగే కొనసాగనుంది. ప్రభుత్వమే పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తున్నందున 5% పన్ను అనేది సాధారణ పౌరుడికి ఏమాత్రం భారం కాబోదని నిర్మలా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కౌన్సిల్ భేటీ తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు ఆంఫోటెరిసిన్–బీపై సున్నా జీఎస్టీ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్–బి ఔషధంతో పాటు, టోసిలిజుమాబ్పై జీఎస్టీ పన్ను రేటును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. గతంలో ఈ రెండు ఔషధాలపై 5% జీఎస్టీ ఉండేంది. అంబులెన్స్ సేవలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. కోవిడ్ పరికరాలపై ఇక 5 శాతమే కోవిడ్ సంబంధ ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. హెపారిన్, రెమ్‌డెసివిర్ వంటి యాంటీ కోగ్యులెంట్ల జీఎస్టీ 12 % నుంచి 5 శాతానికి తగ్గింది. పరికరాలు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు/ జనరేటర్లు (వ్యక్తిగత దిగుమతులతో సహా), వెంటిలేటర్లు, వెంటిలేటర్ మాస్క్‌లు/హెల్మెట్లు, హై ఫ్లో నాసల్ కాన్యులా(హెచ్ఎఫ్ఎన్సీ) పరికరాల జీఎస్టీని 12% నుంచి ఐదు శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్టింగ్ కిట్స్, డి–డైమర్, ఐఎల్–6, ఫెర్రిటిన్, ఎల్డీహెచ్ వంటి స్పెసిఫైడ్ ఇన్‌ఫ్ల్లమేటరీ డయాగ్నోస్టిక్ కిట్లపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. హ్యాండ్ శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, బీఐపీఏపీ మెషీన్, టెస్టింగ్ కిట్, టెంపరేచర్ చెక్ చేసే పరికరాలుసహా 18 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించారు. -
లక్ష కోట్ల సూక్ష్మ జీవులు...హాని చేసేవి ఎన్నో తెలుసా?
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టి చూడండి!! వచ్చే అంకెను లక్ష కోట్లు అంటాం! దీంతో పోలిస్తే... 1,400 అనే అంకె ఎంత? సముద్రంలో నీటిబొట్టంత! కచ్చితంగా మాట్లాడాలంటే.. ఒక శాతంలో వెయ్యో వంతు తీసుకుని.. దాన్ని ఇంకో వెయ్యి వంతులు తగ్గిస్తే వచ్చేంత!! ఈ అంకెలేమిటి? ఆ పోలికలేమిటి? ఇప్పుడెందుకీ ప్రస్తావన? అంటున్నారా? ఈ భూమ్మీది అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య లక్ష కోట్లైతే... మనిషికి తెలిసిన... మనకు హాని చేయగలవని స్పష్టమైన వాటి సంఖ్య 1,400!!! అబ్బో మనకు తెలియని విషయం అంతుందా? అని నోరెళ్లబెడుతున్నారా? వివరాలు తెలిసిన కొద్దీ మీ ఆశ్చర్యం అంతకంతకూ పెరిగిపోవడం గ్యారెంటీ! కోవిడ్–19 గురించి తెలిసింది మొదలు.. వైరస్‌పై, ఫంగస్‌లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. వీటి దగ్గరి చుట్టాలు.. అదేనండి బ్యాక్టీరియా, ప్రొటోజోవా, హెల్మింత్స్ వంటి వాటితో ప్రమాదమేమిటన్నది మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 రోజుకో రూపు దాలుస్తూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో కొంతమంది... ‘‘శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఒక చిన్న వైరస్ ఇంత ప్రమాదం సృష్టిస్తోందా? ఇదంతా కుట్ర, తమ లాభాల కోసం కార్పొరేట్ వైద్యశాలలు ఈ సమస్యను సృష్టిస్తున్నాయి’’ ఇలా పలురకాల వ్యాఖ్యానాలు చేయడమూ మనం వినే ఉంటాం. కానీ.. నిజానికి అటు శాస్త్రవేత్తలు, ఇటు వైద్యులు కూడా.. కనిపించని, ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన కూడా లేని పలు శత్రువులతో గుడ్డిగా పోరాడుతున్నారు! తెలిసినవి అతిస్వల్పం... మనిషిని జబ్బున పడేసేవి.. ప్రాణహాని కలిగించే సూక్ష్మజీవుల్లో మనిషి అర్థం చేసుకున్నవి కేవలం 1,400 మాత్రమే. కానీ ప్రకృతిలో ఉన్నవి లక్ష కోట్లు! ఎలా ఉంటాయో? ఎలా బతుకుతాయో? ఎలా పనిచేస్తాయో? విరుగుళ్లేమిటో? ప్రమాదం ఉందా? లేదా? అన్న అనేకానేక సందేహాలున్న సూక్ష్మజీవులు కోటానుకోట్లు మిగిలే ఉన్నాయి. వీటన్నింటి ఆనుపానులు గుర్తించడం సాధ్యమేనా? తెలుసుకుంటే బాగానే ఉంటుంది కానీ.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ.. శాస్త్రవేత్తలు నిత్యం చేస్తున్న పని ఇదే!! కోవిడ్–19 కారక వైరస్ సంగతి చూద్దాం... కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతోనే... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా వంటి సూక్ష్మజీవులపై పరిశోధనలు అత్యంత కట్టుదిట్టమైన బయో కంటెయిన్మెంట్ ల్యాబ్‌లలోనే జరుగుతాయి. బయట ఉన్నవి ఏ రకంగానూ లోపలికి చేరకుండా.. లోపలివి అంతే భద్రంగా అక్కడే ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు ఈ ల్యాబ్‌లలో. కోవిడ్–19 విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోని పది ప్రముఖ పరిశోధన సంస్థలు జన్యుమార్పులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవ కణాల్లోపల వైరస్ ఎలా పనిచేస్తోందో గమనిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ స్పందనలను అర్థం చేసుకునేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఊబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎలా భిన్నమో కూడా తెలుసుకుంటున్నారు. శత్రువు గుట్టుమట్టులను అర్థం చేసుకునే ఈ పరిశోధనలు ఒకవైపు.. వాటిని ఆయుధాలుగా మలుచుకుని వైరస్‌ను మట్టుబెట్టే విధానాలు ఇంకోవైపు అన్నమాట! అన్నింటా ప్రమాదమే...? సూక్ష్మజీవులపై పరిశోధనలు అన్ని రకాలుగా ప్రమాదంతో కూడుకున్నవే. కానీ.. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు సురక్షిత పరిశోధనల కోసం కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. చేస్తున్నారు. ప్రతి పరిశోధనకు ముందుగానే.. లక్ష్యం ఏమిటి. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు పరిశోధనలు చేస్తున్నారు అన్న వివరాలను స్వతంత్రంగా వ్యవహరించే కమిటీలు సమీక్షిస్తాయి. ఆయా సంస్థల్లోని, లేదా ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు.. కమిటీ ఆమోదించిన పద్ధతుల అమలుపై నిఘా ఉంచుతారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులతో పనిచేసే వారు బయోసేఫ్టీ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. సూక్ష్మజీవులపై పరిశోధనలు జరిగే ప్రాంతమైన బయోసేఫ్టీ కేబినెట్లలోకి ప్రత్యేకమైన ఫిల్టర్ల సాయంతో శుద్ధి చేసిన గాలిని మాత్రమే పంపుతారు. అంతేకాకుండా.. పీపీఈ కిట్ల వంటి రక్షణ ఏర్పాట్లు సరేసరి. కొన్నిసార్లు.. శాస్త్రవేత్తలు తాము పీల్చేగాలిని కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశోధనల కోసం సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసినప్పుడూ రిస్క్ ఉంటుంది. ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వీర్య సూక్ష్మజీవులు బాహ్య ప్రపంచంలోకి చేరవచ్చు. ఈ అంశాన్నీ లెక్కలోకి తీసుకుని పరిశోధనశాలల్లో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. నాలుగు రకాల బయోసేఫ్టీ పద్ధతులు.. దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కోవాగ్జిన్ టీకాను బయోసేఫ్టీ లెవెల్–3 పరిశోధనశాలలో తయారు చేశారు. అంటే... శ్వాస ద్వారా వ్యాపించి అనారోగ్యం, మరణాలకు కారణమయ్యే సూక్ష్మజీవులపై పరిశోధనలకు అనువుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. రక్షణ కోసం వాడే సూట్లను ఒక్కసారి మాత్రమే వాడే వీలుంటుంది వీటిల్లో. అంతేకాదు.. ఇందులో పనిచేసే వారి ఆరోగ్యంపై నిత్యం నిఘా ఉంటుంది. గదుల నేలపై, గోడలపై ఎలాంటి అతుకులూ లేకుండా, కార్పెట్ల వంటివాటిని అస్సలు వాడకుండా చూస్తారు. కిటికీల్లాంటివి ఏవీ ఉండవు. అన్నివైపుల నుంచి దిగ్బంధం చేస్తారు. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే గాలిని లోపలికి వదులుతారు. ఈ స్థాయి కంటే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండే బయోసేఫ్టీ లెవెల్ –4 పరిశోధన సంస్థలు ప్రపంచంలో యాభై మాత్రమే ఉన్నాయి. విస్మరిస్తే.. ఏమవుతుంది? వందేళ్లలో మనిషి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సార్స్–కోవ్–2 వంటి కొత్త శత్రువులను ఎదుర్కోవడం సులువు అవుతుంది. సార్స్–కోవ్–2 మాదిరిగా భవిష్యత్తులో కొత్త సూక్ష్మజీవులతో మనిషికి ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహమే లేదు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవులు సరికొత్త వాహనం ద్వారా కొత్త ప్రాంతాలను చేరుతుంటాయి. అత్యంత ప్రమాదకారులైన హాంటా, డెంగ్యూ, జికా, నిఫా వైరస్లు కాకుండా పలు ఇతర వైరస్‌లను పరిశోధనశాలల్లో పరీక్షిస్తున్నారు. కొత్త వ్యాధుల్లో సుమారు 70 శాతం జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నవే. కోవిడ్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. అందుకే భవిష్యత్తులో ఏ రకమైన సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉందో తెలుసుకునేందుకు నిత్య పరిశోధనలు అత్యవసరం. కానీ.. కోటానుకోట్ల సూక్ష్మజీవులు... కొత్త కొత్త వ్యూహాలతో అవి దాడి చేసే తీరును అర్థం చేసుకోవడం సులువైన పనైతేకాదు. -
బ్లాక్ ఫంగస్ పనిపట్టే ఔషధాలు ఇవే
దేశవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్స కోసం వినియోగించే యాంఫోటెరిసిన్ బి, పొసకొనజోల్ ఇంజక్షన్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, ఒక్కో పేషెంటుకు ఎక్కువ ఇంజక్షన్లు వాడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10 శాతం మంది పేషెంట్లకు కూడా యాంఫోటెరిసిన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై కృషి జరుగుతోంది. ఈ క్రమంలో ఆయుర్వేద మందులకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో ఎన్నో రకాల ఫంగస్‌లను నియంత్రించిన చరిత్ర ఆయుర్వేద ఔషధాలకు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆయుర్వేద మందులు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఆయుష్ శాఖ మూడు రకాల ఆయుర్వేద మందులను బ్లాక్‌ఫంగస్ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది. శంషమన వటి 500 మిల్లీగ్రాములు, నిషామలకి వటి 500 మిల్లీ గ్రాములు, సుదర్శన ఘణవటి 500 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడితే మ్యూకార్ మైకోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయమని ఆయుష్ శాఖ పేర్కొంది. దీంతోపాటు ఆయుష్ – 64 అనే మందునూ వాడుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. నిపుణుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అల్లోపతి మందులు వాడుకుంటూనే ఆయుర్వేద మందులూ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో ఇవి తీసుకోవాలి.. ఆహారంలో ప్రధానంగా ఔషధ గుణాలున్నవి ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండాలి. తులసి, దాలి్చన చెక్క, నల్లమిరియాలు కూడా మంచివి. నల్లద్రాక్ష, వేరుశనగ పప్పు, పిస్తా, మల్బరీస్, స్ట్రాబెర్రీ లాంటివి రోగ నిరోధక శక్తి పెరిగేలా దోహదం చేస్తాయి. జామకాయ, బత్తాయి, కమలా, నిమ్మ, కాప్సికం లాంటి వాటితోపాటు, మునగాకుతో వండిన కూరలతో మంచి ఉపయోగం ఉంటుంది. చికిత్స, నివారణ.. రెండిటికీ ‘‘ఆయుర్వేద మందులకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే చాలా రకాల వ్యాధులు వచి్చన తర్వాత వాటిని తగ్గించేందుకు, రాకుండా కాపాడేందుకూ ఉపయోగపడతాయి. ఈ ఔషధాలను వైద్యుడి పర్యవేక్షణలోనే తీసుకోవాలి. బ్లాక్‌ఫంగస్ ప్రధానంగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. క్రమం తప్పకుండా సూచించిన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. శతాబ్దాల క్రితమే చరక సంహితలో ఈ వ్యాధులకు సంబంధించి సూచనలు చేశారు’’ –డా.కె.విజయభాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్, శల్య విభాగం, ఎస్వీ ఆయుర్వేద కాలేజీ, తిరుపతి నియంత్రించే నేత్ర బిందువులు.. ‘‘నిషామలకి, మహాలక్ష్మీ విలాస రస్ మందులతో పాటు ఎలనీర్ కుజాంబు అనే నేత్ర బిందువులు వేసుకుంటే బ్లాక్ ఫంగస్ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి. కబాసురా కుడినీర్ అనే మందు ఉదయం పూట, ఆయుష్ క్వాత అనే మందు రాత్రిపూట తీసుకుంటే ఫంగస్ నియంత్రణకు ఎంతో ఉపకరిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం శరీర పటుత్వాన్ని పెంచుతుంది’’ –డా.కేదార్నాథ్, ఆయుర్వేద వైద్యుడు బ్లాక్ ఫంగస్ చికిత్స, నివారణకు ఆయుర్వేద ఔషధాలు ఇలా ► పంచ వల్కల కషాయంతో వ్యాధి సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచి ఆరిన తర్వాత మహాతిక్త ఘృతం పూయాలి. ► పథ్యాది కాడ మూడు పూటలా 15 ఎంఎల్ మోతా దు మించకుండా వాడాలి ► నింబామృతాది ఏరండ తైలం 10 ఎంఎల్ పడుకునే ముందు 3 రోజుల పాటు వాడాలి ► సంశమనవటి/గిలోయి ఘణవటి మూడు పూటలా వాడాలి ► గంధక రసాయనం 500 ఎంజీ మోతాదుతో మూడు పూటలా వాడాలి ► నిషామలకి 500ఎంజీ ఉదయం, సాయంత్రం వాడాలి ► సుదర్శన ఘణవటి 500 ఎంజీ మూడు పూటలా వాడాలి ► బృహత్వాత చింతామణి ఉదయం, సాయంత్రం వాడాలి ► క్రమేవృద్ధి లక్ష్మీ విలాస రస్ ఉదయం, సాయంత్రం వాడాలి. చదవండి: రాష్ట్రంలో 1,551 బ్లాక్‌ఫంగస్ కేసులు -
ఏపీలో యాక్టీవ్ కేసులు లక్షలోపుకు చేరాయి: అనిల్ కుమార్
సాక్షి,అమరావతి: ఆందధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి.. యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. ప్రస్తుతం ఏపీలో 96,100 యాక్టీవ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేట్ 8.09 శాతంగా ఉంది అని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 202 ఆస్పత్రులకు కరోనా చికిత్స నుంచి డీ-నోటిఫై చేశాం. గతంలో కరోనా ఆస్పత్రుల సంఖ్య 625గా ఉంటే.. ఇప్పుడవి 423కి తగ్గాయి. విదేశాల్లో చదివే విద్యార్ధులకు, ఐదేళ్ల లోపు తల్లులకు సుమారుగా 1.29 లక్షల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశాం. 45 ఏళ్ల పైబడిన వారిలో 53 శాతం వ్యాక్సినేషన్ వేశాం’’ అని అనిల్ కుమార్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 1307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు 138 మంది చనిపోయారు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే కేంద్రం ఇచ్చే యాంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్లు తగ్గుతాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపితే నష్టమే.. ఆ పని ప్రభుత్వం చేయదు. కేంద్రం నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ రెండు రోజుల్లో పూర్తి చేసేస్తున్నాం. పది లక్షల కరోనా డోసులు ఇస్తోంటే ప్రత్యేక కార్యాచరణ అవసరం’’ అన్నారు అనిల్ కుమార్ సింఘాల్. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్‌లో ఏపీ సరికొత్త రికార్డు -
బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటివరకు 114 మంది మృతి
-
పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రాల వారీగా బ్లాక్‌ఫంగస్ కేసులెన్ని.. ఇంజక్షన్లను ఎలా సమకూర్చుకుంటున్నారు.. రాష్ట్రాలకు వాటిని ఎలా కేటాయిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్ల నిల్వలు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నపిల్లల్లో వచ్చే మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్)ను ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజ యలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా విషయంలో హైకోర్టులో పలు ప్ర జాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యాలను కొద్ది వారాలుగా విచారిస్తున్న హైకోర్టు ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్ల విషయంలో ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ మెమోను కోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి గతంలో కేటాయించిన 13,830 ఇంజక్షన్లు కాక, ఈ నెల 5న మరో 7,770 వయల్స్ కేటాయించా మన్నారు. మే నెలాఖరుకు కేంద్రం వద్ద బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు 4.38 లక్షలున్నాయని, వాటిలో 2.02 లక్షలు దేశీయంగా ఉత్పత్తి చేసినవి, 2,33,971 ఇంజక్షన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని వివరించారు. రాష్ట్రాలకు సరఫరా చేయగా ప్రస్తుతం కేంద్రం వద్ద 80 వేల ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో గత నెలాఖరు నాటికి 1,400 ఉన్న బ్లాక్‌ఫంగస్ కేసులు ప్రస్తుతం 1,770కి పెరి గాయని తెలిపారు. బాధితుల చికిత్సకు కేంద్రం కేటాయించిన 7,770 వయల్స్ ఎంతమాత్రం సరిపోవన్నారు. కేటాయింపులను పెంచకపోతే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. అనంతరం ధర్మాసనం కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి సన్నద్ధ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సుమన్ స్పందిస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్ ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితోసహా దాదాపు 38 వేల మంది అదనపు సిబ్బందిని నియమించామని, ఈ విషయంలో ఇప్పటికే కోర్టు ముందు మెమో కూడా దాఖలు చేశామని సుమన్ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టాలని, పారామెడికల్ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలంది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి పీజీ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సేవల్ని కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలని పేర్కొంది.