దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న ఊరట లేకుండా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసరటం మొదలైంది. కరోనా వైరస్ కేసులతో పోలిస్తే ఇవి తక్కువైనా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి జాడ కనబడటం ఆందోళన కలిగించే అంశం. ఇంతవరకూ 12,000కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇవింకా పెరిగే అవకాశం కూడా వుందని నిపుణులు చెబుతున్న మాటలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒక రోగికి ఎండోస్కోపీ చేసినప్పుడు అతనిలో ఈ మూడు రకాల ఫంగస్‌లూ వున్నట్టు తేలింది. చివరకు ఆయన మరణించాడు. నిపుణులంటున్నట్టు ఈ ఫంగస్‌లు అంటువ్యాధులు కావచ్చు...కాకపోవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ వీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మహమ్మారిగా గుర్తించారు. కరోనా అరికట్టడానికి రోగులపై మోతాదుకు మించి వాడిన స్టెరాయిడ్లవల్ల ఈ ఫంగస్‌లు పుట్టుకొస్తు న్నట్టు గుర్తించారు. ఫంగస్‌ల నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై ఇప్పటికే వైద్యులకు అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువున్నట్టు తెలుసు కున్నారు. కానీ విషాదమేమంటే చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో వుండటం లేదు. ఈ నెల 19నాడే ఢిల్లీ హైకోర్టు ఈ పరిస్థితిని గుర్తించి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయో గాలించి, ఆ మందులు తక్షణం అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే వాటిని ఉత్పత్తి చేసే సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రపంచ మార్కెట్‌లో కూడా కేంద్రం కొనుగోలు చేయడానికి సిద్ధంగా వున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వారణాసిలోని ఆరోగ్య సిబ్బందినుద్దేశించి జరిపిన ఆన్‌లైన్ సమావేశంలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఏం ప్రయోజనం? పది రోజలు గడుస్తున్నా ఢిల్లీలో ఈ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా మందులు దొరకటం లేదు. అక్కడే కాదు...మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వుంది. వ్యాపారులు డబ్బు చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నా పట్టించుకునేవారు కరువ య్యారు. ఈ విషయంలో కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మొదలుకొని విపక్షా లన్నీ కోరాయి. కానీ ఫలితం లేదని, పది రోజుల తర్వాత కూడా పరిస్థితి యధాతథంగా వున్న దని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనిస్తే అర్థమవు తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నట్టు వెనువెంటనే ప్రకటిం చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా వెనకబడే వున్నాయి.
కరోనా అయినా, దాని పర్యవసానంగా వస్తున్న ఫంగస్ వ్యాధులైనా ఎలా వ్యాపించాయి.. కారకులెవరు అనే ప్రశ్నలు ఇంకా తేలవలసివుంది. కనీసం మందుల లభ్యత విషయంలోనైనా కేంద్రం అప్రమత్తంగా లేకపోవటం...న్యాయస్థానాలు ఆదేశించినా ఫలితం లేకపోవటం దిగ్భ్రాంతికరం. మొన్నటి వరకూ ఆక్సిజన్ కొరతతో సతమతమైన రోగులు ఇప్పుడు ఈ ఫంగస్ నివారణకు మందులు దొరక్క అల్లాడుతున్నారు. ఢిల్లీలో ఒక ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,000 ఇంజక్షన్లు కావాల్సివుండగా కేవలం 350 మాత్రమే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో గ్రహించవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులకు వారానికి 30,000 అవసరమైతే 3,850 మాత్రమే వస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీనగర్ వంటిచోట్ల ఈ ఫంగస్‌లకు సరైన చికిత్స అందించేవారు లేకపోవటంతో అక్కడివారు ఎంత దూరమైనా లక్ష్యపెట్టక మహా రాష్ట్ర, గుజరాత్ వంటిచోట్లకు రావాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా దేశ పౌరులు ఇలాంటి దుస్థితిలో వుండటం మనకు అప్రదిష్ట తెస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా పాలకులకు లేకుండాపోతోంది. పంటి నొప్పితో మొదలై సైనస్‌గా మారి, ఆ తర్వాత నోటికి, కనుబొమలకు వ్యాపించి, చివరకు కళ్లనూ, మెదడునూ కూడా దెబ్బతీసి ప్రాణాలు హరిస్తున్న ఈ ఫంగస్‌లకు చెందిన మందులు అందుబాటులో వుంచాలని గుర్తించకపోవటం విచారకరం.
ఒకవైపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా వెల్లడవుతున్న ప్రతి ఒక్క కేసుకూ, బయటపడని 23 కేసులుండొచ్చని నీతి ఆయోగ్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫెక్షన్లు వున్నా పరీక్షల్లో బయటపడని స్థితి. ఒకపక్క కరోనా వైరస్ జనం ప్రాణాలతో ఆటలాడుతుంటే... వ్యాక్సిన్‌ల కొరత, మందుల కొరత జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఫంగస్‌లకు ఇస్తున్న ఇంజెక్షన్లు కూడా మోతాదు మించితే ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మొదలుకొని రాష్ట్రాల్లో ఆ శాఖను చూసేవారి వరకూ అందరూ చురుగ్గా స్పందించాలి. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా చూడాలి. తగినంతమంది నిపుణుల్ని అందుబాటులో వుండేలా చూసుకోవాలి. అదే సమయంలో ఇంజెక్షన్ల వాడకం హేతుబద్ధంగా వుండేట్టు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ప్రోటోకాల్ కొరవడటం వల్లే ఈ ప్రమాదకర మైన ఫంగస్‌లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వీటి విషయంలో కూడా నిర్లక్ష్యంగా వుంటే మరేం జరుగుతుందో అనూహ్యం. అందుకే మందులు అందుబాటులో వుండేలా చూడటంతోపాటు రోగులకు ఉచిత చికిత్స అందేందుకు ప్రభుత్వాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి.
కొరతలతో రోగుల కలత
Published Mon, May 31 2021 2:23 AM | Last Updated on Mon, May 31 2021 2:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment