యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే! | Hyderabad: Black Marketing Of Black Fungus Drug | Sakshi
Sakshi News home page

యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే!

Published Tue, May 25 2021 10:26 AM | Last Updated on Tue, May 25 2021 10:31 AM

Hyderabad: Black Marketing Of Black Fungus Drug  - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అసరమైన స్థాయిలో ఉత్పత్తి జరగట్లేదు... కేంద్రం ఇస్తున్న కోటా చాలట్లేదు... రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది... ఫలితంగా అనేక రకాలైన యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌కు భారీ డిమాండ్‌ వచ్చింది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక మంది “బ్లాక్‌ దందాలు’ చేస్తున్నారు. వీరిపై నిఘా వేసి ఉంచుతున్న పోలీసులు పలువురిని అరెస్టు చేసి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని డీఎంహెచ్‌ఓల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉండటంతోపాటు ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌తో కూడిన ఇంజెక్షన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్‌ పెరిగింది.

ఓపక్క ఇవి అవసరమైన వారిలో దాదాపు 90 శాతం మంది బ్లాక్‌లో పది నుంచి వంద రెట్లు ఎక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఈ ఔషధాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసే వాళ్లు మాత్రం వివిధ మార్గాల్లో తేలిగ్గా సమీకరించుకుంటున్నారు. ఇలాంటి దందా చేసే వారిపై ఇటు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్, అటు సైబరాబాద్, రాచకొండకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌ (ఎస్వోటీ) నిఘా వేసి ఉంచుతున్నాయి. ఓ వైపు పక్కా సమాచారం, మరో వైపు డెకాయ్‌ ఆపరేషన్లు ద్వారా ఈ దందాలు చేసే వాళ్లను పట్టుకుంటున్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత ఓ మహిళ సహా మొత్తం 86 మందిని పోలీసులు పట్టుకున్నారు.

కీలక నిర్ణయం
వీరి నుంచి 274 వరకు యాంటీ వైరల్, ఫంగల్‌ ఔషధాలతో కూడిన ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నేరానికి సంబంధించి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి నుంచి సొత్తు లేదా వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. నిబంధన ప్రకారం వీటిని సీజ్‌ చేసినట్లు పంచనామా రాసి రిమాండ్‌ రిపోర్టుతో సహా కోర్టుకు అప్పగిస్తారు. అయితే ఈ యాంటీ వైరల్, ఫంగల్‌ ఇంజెక్షన్ల విషయంలో మాత్రం పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్న అధికారులు ఇలా స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. 

బ్లాక్‌ దందా చేస్తూ చిక్కిన నిందితులతో పాటు ఇంజెక్షన్లను టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీలు స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నారు. అప్పటి ఆ ఇంజెక్షన్లు పాడు కాకుండా ఫ్రిజ్‌లలో ఉంచి కాపాడుతున్నారు. పోలీసుస్టేషన్‌లో ఈ సీజ్‌ చేసి ఇంజెక్షన్లను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత సదరు యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌ను స్థానికి డీఎంహెచ్‌ఓలకు అందించి రసీదు తీసుకుంటున్నారు. ఈ రసీదు, ఫొటోలు, వీడియోలు న్యాయమూర్తులకు అందిస్తున్నారు. ఆపై వీటిని జత చేస్తూ కోర్టుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. డీఎంహెచ్‌ఓలు ఈ ఇంజెక్షన్లను కోటా ప్రకారం ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు చేరుస్తున్నారు.

దీనికి ముందు ఆ ఇంజెక్షన్‌ స్థితిగతులు, ఏ దశలో అయినా పాడైందా? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు నల్లబజారులోకి తరలకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో పట్టుబడిన వాటిలో కనీసం ఒక్కటి కూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నామని ఓ అధికారి తెలిపారు. స్వీధీనం చేసుకున్న వెంటనే వాటిని ఫ్రిజ్‌లలో అవసరమైన ఉష్టోగ్రతలో భద్రపరుస్తున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను డీఎంహెచ్‌ఓలకు అందించే వరకు భద్రపరచడానికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫ్రిజ్‌లను సమకూర్చుకున్నారు. వీటి బ్లాక్‌ మార్కెట్‌ దందాను కనిపెట్టడానికి సోషల్‌ మీడియా పైనా పోలీసులు నిఘా ఉంచారు. అలాంటి విక్రేతలపై సమాచారం ఉంటే తమకు తెలపాలని కోరుతున్నారు.  

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మందుల్లేవ్‌...

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మహమ్మారిని జయించి బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన రోగుల ప్రాణాలతో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. పైసలకు కక్కుర్తిపడి అడ్మిట్‌ చేసుకుని, సర్జరీలు చేస్తున్నాయి. ఆ తర్వాత చికిత్సకు అవ సరమైన లైపోజోమల్‌ ఆంపోటెరిసిన్‌–బీ ఇంజక్షన్లు లేవని చెప్పి బయటికి పంపుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో వారంతా చివరకు కోఠి ఈఎన్‌టీ, గాంధీ ఆçసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. నిజానికి చేర్చుకుని చికిత్సలు చేసిన ఆస్పత్రులే ఆయా రోగులకు అవసరమైన మందులను కూడా సమకూర్చాల్సి ఉంది. కేవలం సర్జరీలు చేసి, ఆ తర్వాత మీ చావు మీరు చావండంటూ పట్టించుకోకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 700 మందికిపైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 

నిత్యం 50 మందికిపైగా... 
ఈఎన్‌టీ అవుట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 250 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు వస్తున్నారు. వీరిలో 50–60 మందికి ఇన్‌పేషెంట్‌లుగా అడ్మిషన్‌ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 240 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి సర్జరీ చేశారు. మరో 50 నుంచి 60 మంది వరకు అడ్మిషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 102 మంది కోవిడ్‌ పాజిటివ్‌ బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement