సాక్షి, సిటీబ్యూరో: కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం బాధితుల్లో ఎంతో కాలం నిలవడం లేదు. మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ వారిని (మ్యూకర్ మైకోసిస్) బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వైరస్ మళ్లీ వెంటాడుతోంది. మే రెండో వారంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని ఇందుకు నోడల్ సెంటర్‌గా ఎంపిక చేసింది. పడకల సామర్థ్యానికి మించి కేసులు రావడంతో గాంధీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక బ్లాక్ ఫంగస్ విభాగాలు ఏర్పాటు చేసింది.
86 శాతం మంది టీకా తీసుకోని వారే
►ఈఎన్‌టీ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిటైన 300 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై ఇటీవల ఓ సర్వే చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
►వైరస్ బారిన పడిన బాధితుల్లో 86 శాతం మంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఫస్ట్ డోసు పూర్తి చేసుకున్నట్లు వెల్లడైంది.
►అంతేకాదు ఎంపిక చేసిన బాధితుల్లో 280 మంది మధుమేహ బాధితులే. వీరిలో 51 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత డయాబెటిక్, డినోవాలు వెలుగు చూడగా, 43 శాతం మందికి కరోనాకు ముందే మధు మేహం ఉన్నట్లు గుర్తించారు.
►కరోనా చికిత్సల్లో వైద్యులు రెమ్‌డెసివిర్, ఇతర స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగించడమే ఇందుకు కారణమని తెలిసింది.
ప్రస్తుతం మరో 200 మంది బాధితులు
గాంధీలో ప్రస్తుతం 150 కోవిడ్ పాజిటివ్/బ్లాక్ ఫంగస్ కేసులు ఉండగా, ఈఎన్‌టీలో 50 మంది వరకు చికిత్స పొందు™తున్నారు. వీరిలో కొంత మంది దవడ సర్జరీల కోసం ఎదురు చూస్తుండగా, మరికొంత మంది ముక్కు, కన్ను సర్జరీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సెంటర్లలో రోజుకు పది నుంచి పదిహేను సర్జరీలు జరుగుతున్నాయి.
►బ్లాక్ ఫంగస్ కారణంగా కన్ను, ముక్కు, దవడ భాగాలను కోల్పోయిన బాధితులు వాటి స్థానంలో కృత్రిమ అవయవాలను అమర్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జన్‌లను ఆశ్రయిస్తున్నారు.
►పేదలకు ఈ ప్లాస్టిక్ సర్జరీలు భారంగా మారాయి. ఆర్థికస్తోమత ఉన్న వారు యుక్త వయస్కులు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు చేయించుకుంటున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.
150 మందికి దెబ్బతిన్న కంటిచూపు
► ఈఎన్‌టీ, గాంధీ, సరోజినీదేవి ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 2,676 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
► వీరిలో 1896 మందికి వైద్యులు సర్జరీలు చేశారు. వీరిలో 150 మందికి కంటి సంబంధిత సర్జరీలు చేయగా...దాదాపు అందరూ చూపును కోల్పోయినట్లే.
► 650 మందికి దవడ, దంతాలను, 350 మందికి ముక్కు, మరో 746 మందికి ఇతర భాగాల తొలగింపు శస్త్రచికిత్సలు చేశారు.
గాంధీ, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు
మొత్తం బ్లాక్ ఫంగస్ కేసులు : 2676
వీరిలో ఎంత మందికి సర్జరీలు చేశారు : 1896
కంటి సర్జరీలు : 150
పన్ను తొలగింపు సర్జరీలు : 650
ముక్కు తొలగింపు సర్జరీలు : 350
ఇతర భాగాల తొలగింపు : 746
Comments
Please login to add a commentAdd a comment