డాక్టర్ వీవీ రమణప్రసాద్
►కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే ఔట్‌పేషెంట్లు, ఇతర విభాగాలకు వచ్చేవారు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేసుకుంటున్న వారూ పెద్దసంఖ్యలో ఉంటున్నారు. పలువురు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు కనిపించగానే ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు.
ఇప్పుడున్న ఈ భిన్నమైన వాతావరణంలో ఆయావర్గాల ప్రజల్లో కోవిడ్ టెస్ట్, ఐసోలేషన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చింది ఒమిక్రానా, డెల్టానా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన కిమ్స్ ఆసుపత్రి పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణప్రసాద్ ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇవీ ముఖ్యాంశాలు...
– సాక్షి, హైదరాబాద్
ప్రస్తుత పరిస్థితి..
90 శాతం ఒమిక్రాన్‌తోపాటు 10 శాతం డెల్టా కేసులు కూడా వస్తున్నాయి. డెల్టా తీవ్రత పట్ల జాగ్రత్త పడాలి. ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చేవారిలో ఎక్కువమందిలో ఒకే రకమైన స్వల్ప లక్షణాలుంటున్నాయి. త్రీ జీన్ డ్రాపౌట్ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అధికంగా ఒమిక్రాన్ కేసులే బయటపడుతున్నాయి. ఒకవేళ టెస్ట్‌ల్లో ఎస్ జీన్ పాజిటివ్ వస్తే అవి డెల్టా లేదా ఒమిక్రాన్, మరో వేరియెంట్ బీ ఏ 2 కావొచ్చు. అందువల్ల అయోమయంతో కొందరు వైద్యులు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్‌టెయిల్ థెరపీ ఇస్తున్నారు.
ఇది అవసరం లేదు. ఐదురోజుల వరకు వేచి చూసి, లక్షణాలు తగ్గకుంటే, అప్పుడు కాక్‌టెయిల్ ఇవ్వొచ్చు. ఒక్క డోస్ టీకా కూడా తీసుకోనివారు లేదా ఒక్కడోసే తీసుకున్నవారు, పెద్దవయసు వారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గి, ‘లంగ్ షాడో’స్‌తో డెల్టా కేసులొస్తున్నాయి. అందువల్ల డెల్టా అనేది పూర్తిగా లేదని చెప్పలేం.
మరి, చికిత్స..
ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలున్న కేసుల్లో మామూలు చికిత్స అందిస్తే సరిపోతుంది. మోల్నుపిరవిల్ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీ బాడీ మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండురోజులు జ్వరం వచ్చి తగ్గినా, 2, 3 రోజులు జలుబు ఉండి తగ్గినా, 4, 5 రోజులకు గొంతులో గరగర తగ్గిపోయినా వీరంతా ఐదురోజులు ముగిసేనాటికి దాదాపు సాధారణస్థాయికి చేరుకుంటున్నారు. రక్తం పలుచన చేసే మందులు వాడాల్సిన అవసరం అంతగా పడటంలేదు. ఎక్కువ శాతం మంది 3 నుంచి 5 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటున్నారు. కొంచెం నీరసంగా ఉన్నా ఏడో రోజుకల్లా విధుల్లో చేరుతున్నవారే ఎక్కువ.
ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే..
ఐదురోజుల తర్వాత కూడా హైగ్రేడ్ టెంపరేచర్‌తో జ్వరం, కొత్తగా దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరడం, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయంటే అలాంటివి డెల్టా వేరియంట్ కేసులయ్యే అవకాశాలు ఎక్కువ. ఐదురోజుల తర్వాత కూడా తీవ్రత తగ్గని వారికి దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కొనసాగే వారు యాంటీ డికంజెస్టెంట్లు, బ్రాంకోడైలేటరల్‌తో చికిత్స చేయించుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి పదార్థాలు తినకపోవడం, వేడిపదార్థాలే భుజించడం, వేడి పానీయాలు వంటివి తీసుకున్నవారిలో అత్యధికులు పదోరోజుకల్లా సాధారణస్థితికి వచ్చేస్తున్నారు.
ఒమిక్రాన్ కేసుల గుర్తింపు...
గొంతులో నస, జ్వరం, జలుబు, తలనొప్పి, 3 నుంచి 5 రోజుల్లో తగ్గే ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోతే వాటిని ఒమిక్రాన్ కేసులుగా చెప్పవచ్చు.
డెల్టా లక్షణాలు...
ఇప్పటికీ డెల్టా కేసులు వస్తున్నాయి. రుచి, వాసన లేకపోవడం, విరేచనాలు, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలను డెల్టా లక్షణాలుగా భావించి జాగ్రత్తపడాలి. లేదంటే వ్యాధి ముదిరి న్యూమోనియాకు దారితీసి, నీరసం, జ్వరం వంటివి కొనసాగి ఆసుపత్రుల్లో, ఐసీయూల్లో చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వీళ్లు అంటించేస్తున్నారు...
ఒమిక్రాన్ లేదా డెల్టా బారిన పడినా ఆ లక్షణాలు బయటపడని, కనిపించని పేషెంట్లు సమాజంలో, కుటుంబంలోని ఇతరులకు అంటించేస్తున్నారు. ఒమిక్రాన్‌లో డబ్లింగ్ ఇంపాక్ట్ రెండురోజులే కావడంతో కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేని వారిని వారం సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెడితే సరిపోతుంది. ఆసుపత్రుల్లో టెస్ట్ చేశాక పాజిటివ్‌గా తేలిన కేసుల్లో అత్యధికుల ఇళ్లలోని వాళ్లకు అప్పటికే లక్షణాలున్నట్టు తేలింది. దీంతో వాళ్లు ఆస్పత్రులకు వస్తున్నట్టు నిర్ధారణైంది.
Comments
Please login to add a commentAdd a comment