
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. వారం వ్యవధిలోనే సగానికి పైగా తగ్గడం గమనార్హం. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో 2,850 కేసులు నమోదు కాగా, సరిగ్గా వారానికి అంటే సోమవారంనాటికి 1,380 నమో దయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. ఒమిక్రాన్ తీవ్రత ఒక్కసారిగా పెరిగి, ఇప్పుడు అదేస్థాయిలో తగ్గుముఖం పడుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో సోమవారం 68,720 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 1,380 మంది వైరస్ బారినపడ్డారు. అంటే పాజిటివిటీ 2 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.78 లక్షలకు చేరుకుంది. తాజాగా 3,877 మంది కోలుకోగా, మొత్తం ఏడున్నర లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,101 మంది బలయ్యారు.