ప్రతీకాత్మక చిత్రం
ఆస్పత్రుల్లో సర్జికల్ మాస్కులుగా మాత్రమే పరిచయం ఉన్నవి కాస్త.. కరోనా టైం నుంచి మన జీవితాల్లో భాగం అయ్యాయి. వేవ్‌లు విరుచుకుపడుతున్నప్పుడల్లా మూతులకు అతుక్కుపోతున్నాయి. ఆంక్షలు, అభ్యంతరాల నేపథ్యంలో అవసరంకొద్దీ అప్పటికప్పుడు ఎంతైనా సరే చెల్లించి కొనేస్తున్నారు జనాలు. అయితే మాస్క్‌ల ఉత్పత్తి పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం ఇంకా దిగిరాకపోవడంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
హైదరాబాద్ సహా ఇతర పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మూడు పొరల సర్జికల్ మాస్క్ ధర ఒకటి రూ.10 నుంచి 15 రూ. మధ్య ఉంటోంది(డిజైన్లు, ఇతర కంపెనీలవి మినహాయించి). సాధారణ మెడికల్ షాపు ఓనర్ల నుంచి బిజీ ఏరియాల దగ్గర చిరువ్యాపారుల దాకా ఈ ధరకి ఫిక్సయిపోయారు. ఇక మండలాలు, రూరల్ ఏరియాల్లో ఇంతకంటే ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. సాధారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల నుంచి సర్జికల్ బయటకు వచ్చేది రూపాయిలోపు(ఒక్కోటి) ధరకే!. మరి అన్నేసి రేట్ల రేటుకు అమ్మడం ఎందుకు?.
ప్రతీకాత్మక చిత్రం
మధ్యవర్తులే కారణం..
హైదరాబాద్ శివారులో దాదాపు పది యూనిట్ల నుంచి నిత్యం మాస్క్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రోజులో లక్ష నుంచి 4 లక్షల దాకా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. అంటే ఒక్క హైదరాబాద్ నుంచే రోజుకి 30 లక్షల సర్జికల్ మాస్కుల ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. ఇవిగాక మరో పది లక్షల మాస్క్‌లను ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తున్నారు. మొత్తంగా 40 లక్షల మాస్క్‌లతో భారీ సప్లయి నడుస్తోంది. అయినప్పటికీ ధరలు మాత్రం దిగి రావట్లేదు. అయితే దళారులు, మధ్యవర్తుల కారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటున్నాయని ఉత్పత్తిదారులు చెప్తున్నారు.
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు.. రిటైలర్స్‌కు 90పై. నుంచి 1.రూ.మధ్య అమ్ముతున్నారు. మొదటి వేవ్ నుంచి ఇదే ధర కొనసాగుతోంది కూడా. కానీ, రిటైలర్స్ నుంచి కొందరు దళారులు వీటిని కొనుగోలు చేసి.. మూడు నుంచి ఐదు రూపాయల కమిషన్‌తో కిందిస్థాయికి అమ్మకాలు చేస్తున్నారు. అందుకే తామూ అధిక ధరలకు అమ్ముతున్నామని మెడికల్ షాప్ ఓనర్లు, వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాస్క్ ధరించకపోతే ఫైన్లు విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వీళ్ల వ్యాపారానికి మరింత కలిసొస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
మాదేం లేదు
కరోనా మొదటి, రెండో వేవ్‌ల టైంలో తెలంగాణలో మాస్క్‌ల కొరత నడిచింది. ఉత్పత్తి అస్థిరత వల్ల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు డిమాండ్‌కు మించి సప్లయ్ ఉంటున్నా.. అధిక ధరలకు అమ్ముతుండడం విశేషం. ఫస్ట్ వేవ్ కోనా టైంలో ఒక్కో మాస్క్‌ను 8రూ నుంచి 9రూ. గరిష్ట ధరకు అమ్మేవాళ్లు. అయితే తయారీదారులు ఇప్పుడూ పాత రేట్లకే అమ్ముతున్నా.. కస్టమర్‌కి మాత్రం ఐదు నుంచి పది రేట్లకు చిల్లు పడుతోంది. పైగా ఈ ఏడాది వేసవి తర్వాత ఉత్పత్తి గణనీయంగా పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. తెలంగాణలో సరిపడా యూనిట్లు ఉన్నాయని, ధరల విషయంలో మాదేం లేదంటున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. పైగా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి దందాలను, ధరల నియంత్రణను ప్రభుత్వాలే చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్లు.
ప్రస్తుతం స్టాక్ వివరాలు
- ఎన్ 95 మాస్కులు.. 41 లక్షల కుపైనే
- 3 పొరల మాస్క్‌లు, కోటి 50 లక్షలకు పైనే
- పీపీఈ కిట్స్.. 8 లక్షలకుపైనే
- హోం ట్రీట్‌మెంట్ కిట్స్.. 8.71 లక్షలు
కొసమెరుపు.. బల్క్‌గా త్రీ లేయర్స్ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్న కొందరు.. షాపులు, మెడికల్ స్టోర్లు కాకుండా రోడ్ల మీద, ఫుట్‌పాత్‌లపై రూ. 2 నుంచి 7రూ. మధ్య అమ్మేస్తున్నారు కొందరు. కానీ, వాటి క్వాలిటీపై నమ్మకం లేక చాలామంది దూరంగా ఉంటూ వస్తున్నారు.
మాస్క్ మస్ట్.. ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందే వేరియెంట్. గాలి ద్వారా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లేప్పుడు, ఆఫీసుల్లో, ప్రయాణాల్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్‌లకు వెళ్లినప్పుడు మాస్క్‌లు(మూడు పొరలున్న ఎలాంటి మాస్క్‌లైనా సరే వాడడం మరీ మంచిది) ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment