సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం.. వైరస్ బారిన పడి పొరుగు రాష్ట్రాలకు చెందిన రోగులు సిటీకి వచ్చి ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండడంతో రోగులు వాడిపడేసిన వ్యర్థాలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి సేకరణ శాస్త్రీయంగా జరగని పక్షంలో ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం సుమారు 23 వేల కిలోల జీవ వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలనుంచే కావడం గమనార్హం.
ఈ వ్యర్థాల్లోనే కోవిడ్ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. సాధారణ చెత్తతో పాటు.. రోగులు వాడి పడేసిన మాస్కులు, గ్లౌజులు, సిరంజిలు, ఇతర వ్యర్థాలను తరలిస్తే పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కూడా కోవిడ్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి విషమించకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పీసీబీ.. అటు ఆస్పత్రులు.. సిటీజన్లు వ్యర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
చదవండి: భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
శాస్త్రీయ పద్ధతుల్లోనే..
► ఓమిక్రాన్ వైరస్ త్వరితంగా వ్యాపించే అవకాశం ఉండడంతో.. రోగులు వాడిపడేసిన వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడంతో పాటు.. జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాలకు తరలించాలి.
► పలు ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఇంజెక్షన్లు, ప్లాస్టిక్ వస్తువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలు, కవర్లలో వేసి సీల్ చేసిన అనంతరమే శుద్ధి కేంద్రాలకు తరలించాలి. వీటిని ఎవరూ తాకే పరిస్థితి ఉండరాదు. వ్యర్థాలను ఆరుబయట గాలికి ఉంచరాదు.
► ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో వ్యర్థాల నిల్వ, సేకరణ, తరలించే సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనివ్వాలి.
చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు!
► ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీగా వెలువడుతున్న జీవవ్యర్థాలను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు.
► కోవిడ్ రోగులు వాడిపడేసిన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, సిరంజిలు తదితరాలను తరలిస్తున్న సిబ్బంది తాకితే వారు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంది.
► వ్యర్థాలను నిర్లక్ష్యంగా నిల్వచేయడం, తరలించే ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయా లి. ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పౌరులకు పీసీబీ విస్తృత అవగాహన కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment