సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు.
చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు
పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు.
చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment