Kolanupaka
-
ఆధ్యాత్మిక పల్లె.. కొలనుపాక
యాదగిరిగుట్ట: స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం. వీరశైవ పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్ధేశ్వరుని జన్మభూమి. శ్వేతాంబర జైనుల ఆధ్యాత్మిక కేంద్రం. దైవారాధనకు అందరూ అర్హులేనని చాటిన సమతా సందేశం. వీరశైవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన దక్షిణ కాశీ. అష్టాదశ కులాల వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరి. రాష్ట్రకూట, చాళుక్య, కందూరు చోళ, కాకతీయుల పాలనా కేంద్రం. గత వైభవ ఘనకీర్తి పతాక.. కొలనుపాక. ఇది శతాబ్దాల కిందట ఓ సుందర నగరం. ఇప్పుడు అచ్చమైన పల్లెటూరు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు పట్టణానికి 6 కి.మీ. దూరంలో ఉంది. వెయ్యేళ్లకు పూర్వమే ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగస్థలి. జైన వైభవానికి, వీరశైవ విజృంభణకు నిలువెత్తు సాక్ష్యం. కానీ శైవ, బౌద్ధ, జైన, వైష్ణవాల ఘర్షణలో తన అస్థిత్వాన్ని కోల్పోయింది. నాటి కులమఠాల ఆనవాళ్లు కొలనుపాక సామాజిక జీవితాన్ని మనకు కథలుగా చెబుతాయి. పంచముఖాలు.. ఐదు పీఠాలు రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళుల ఉప రాజధానిగా తెలుగు నేలపై అర్ధభాగాన్ని శాసించినా కొలనుపాక ఏనాడూ చరిత్ర కెక్కలేదని పలువురు అంటున్నారు. విధ్వంసకారులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినట్లే.. చరిత్రకారుల నిర్లక్ష్యం సాంస్కృతిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. వీరశైవ మత వ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుంచి రేవణసిద్ధ (బాళెహొణ్నూరు పీఠం), మరులసిద్ధ (ఉజ్జయిని పీఠం), ఏకోరామ (కేదారనాథ్ పీఠం), మల్లికార్జున పండితారాధ్య (శ్రీశైల పీఠం), విశ్వారాధ్య (కాశీ పీఠం) ఉద్భవించినట్టు శైవాగమాలు పేర్కొంటున్నాయి. స్వయంభువులుగా భావించే ఈ శివాచార్యులను ‘వీరశైవ పంచాచార్యులు’గా కీర్తిస్తారు. పంచాచార్యులలో ప్రథముడైన రేవణసిద్ధ (రేణుకాచార్యులు) కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించినట్టు స్వయంభువాగమం చెబుతోంది. శైవాగమాలలోని వీరాగమ, సుప్రభేదాగమాలు రేణుకాచార్యులను ప్రస్తావించాయి. శైవం.. జైనం బహుళ ఆదరణ కొలనుపాకలో శైవం, జైనం బహుళ ఆదరణ పొందాయి. వేల సంవత్సరాలు ఈ రెండు మతాలు సహజీవనం చేశాయి. కొలనుపాకలో క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి సోమనాథ ఆలయం అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇక్కడ జైనం ఎక్కువ. కొలనుపాకలో వెయ్యేళ్లకు పూర్వమే శ్వేతాంబర శాఖకు చెందిన ఆలయాన్ని నిర్మించారు. జైన ప్రాబల్యం ఉన్నా.. సోమేశ్వరుడు నిర్విఘ్నంగా పూజలందుకున్నాడు. చాళుక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు. కాకతీయులు తొలినాళ్లలో జైనాన్ని ఆదరించారు. చివరి కాకతీయులు మాత్రం శైవాన్ని ప్రోత్సహించారు. కొలనుపాకలో అప్పటికే వైష్ణవం కూడా ఉంది. పారమార జగద్దేవుడు నిర్మించిన వీరనారాయణ ఆలయం సుప్రసిద్ధం. తర్వాత వచ్చిన పాలకులు ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు. కన్నడ దేశపు కాలచూరిని ఏలుతున్న బిజ్జలుని మంత్రి బసవన్న వీరశైవ వ్యాప్తికి కృషి చేశాడు. రేణుకాచార్యులు కొలనుపాకలో వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు. వీరశైవం తెలుగు నేలపై రాజాదరణ పొందింది. కాకతీయల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి చేరింది. శైవాలయాలు, శైవపీఠాలు, శైవమఠాల నిర్మాణాలకు కాకతీయులు సహకరించారు. కొలనుపాకలోని కోటిలింగాల గుడి, ప్రతాపరుద్ర ఆలయం కాకతీయులు కట్టినవే. వీరశైవ విజృంభణ కాకతీయ గణపతి దేవుడి కాలానికి తెలుగు నేలపై శైవం ఆధిపత్యంలోకి వచి్చంది. రాణీరుద్రమదేవి పాలనా కాలానికి వీరశైవం విజృంభించింది. శివుడు తప్ప ఎవరూ ఉండకూడదనే వాదన మొదలైంది. 11వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో శైవ, జైన మతాలు ఘర్షణ పడ్డాయి. కొలనుపాకలోని జైన ఆలయాలను, బసదులను వీరశైవులు ధ్వంసం చేశారు. జైన, వైష్ణవాలయాలను శివాలయాలుగా మార్చారు. కొన్ని ఆలయాల పేర్లు శాసనాలకే పరిమితం అయ్యాయి. వీరశైవం ప్రబలిన తర్వాత ఆరాధ్య శైవం, వైష్ణవం వెనుకబడిపోయాయి. కాకతీయుల నిరాదరణ, వీరశైవుల విజృంభణతో కొలనుపాకలో జైనం క్షీణదశకు చేరుకుంది. రేవణ సిద్ధేశ్వరుల ప్రభావంతో కొలనుపాకలో అన్ని కులాల వారు వీరశైవంలో చేరారు. ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది. అష్టాదశ కులాల వారికి కొలనుపాకలో మఠాలున్నాయి. ప్రస్తుతం ఆ కుల మఠాల సంఖ్య 18 కంటే ఎక్కువే. శివుడొక్కడే.. కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. వీటన్నింటిలో శివలింగం, నంది విగ్రహం మాత్రమే ఉంటాయి. మరో విగ్రహానికి కానీ, ఇంకో దేవుడికి కానీ ఇక్కడ స్థానం లేదు. ఈ మఠాల నిర్వహణ, పూజా విధానాల్లో ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ప్రతి కుల మఠానికి ఒక గురువు, కులపెద్ద బాధ్యులుగా ఉంటాడు. మఠ గురువు, మఠ పెద్ద, సభ్యులైన వీరశైవులు ఇష్టలింగాన్ని ధరిస్తారు. నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి, పత్రి, పుష్పాలతో పూజ చేసి, నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే భోజనం చేస్తారు. మఠాలన్నిటికీ జంగమ దేవరలే గురువులు. ‘గురువు’అంటే విద్యా బోధన చేసేవాడని అర్థం. మత బోధన మఠం ప్రధాన బాధ్యత. వీరశైవం వైపుగా ఆకర్షితులైన నిమ్న కులాల వారికి వీరశైవ తత్తా్వన్ని, మోక్ష మార్గాన్ని బోధించేందుకు ఆ కులానికే చెందినవారికి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. కొలనుపాకలోని కులమఠాలన్నీ రంభాపురి పీఠాన్ని అనుసరిస్తాయి. కుల మఠాలకు ఉన్నట్లుగా పెద్ద మఠానికి ప్రత్యేకమైన కట్టడం ఏమీ లేదు. పెద్ద మఠం గురువుని కులమఠాలన్నీ అనుసరిస్తాయి. కులానికో పురాణం.. కొలనుపాకలోని అన్ని కులాలకూ ప్రత్యేకమైన పురాణాలున్నాయి. మఠ గురువుల దగ్గర ఆ ప్రాచీన ప్రతులు ఉంటాయి. వీటిని పండుగ రోజుల్లో మాత్రమే పఠిస్తారు. తమ కులం ఎలా పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది? తమదైన కుల పురాణాల్లో ప్రస్తావించారు. ఎవరికి వారు తమ కులం గొప్పదనే భావనతో ఈ గ్రంథాన్ని రాసుకున్నారు. మిగతా కులాలకు తమ కులమే మూలమనే ప్రతిపాదనా ఉంది. ఇలా ఎవరి కుల సాహిత్యం వారిదే. కాలక్రమంలో కొన్ని కుల చరిత్రలు అంతరించిపోయాయి. మఠానికో శివుడు అందరికీ శివుడే ఆరాధ్య దైవం. ఆ దేవుడిని కూడా తమ కులంవాడిని చేసుకోవడం మఠాల ప్రత్యేకత. కులమఠాల వాళ్లు ఎవరికి వారు.. తమ కులానికి అనుగుణంగా శివుడికి నామకరణం చేశారు. సురాభాండాన్ని తీసే గౌడవారు శివుడిని ‘సురాభాండేశ్వరుడు’అని పిలుచుకున్నారు. కోమట్లు ‘నగరేశ్వర స్వామి’అని కొలుస్తున్నారు. మేదర మఠంలోని శివుడిని ‘కేతేశ్వర స్వామి’గా వ్యవహరిస్తారు. అదే ఆదిదేవుడు మేరు మఠంలో ‘శంకర దాసమయ్య’అయ్యాడు. 7 వేల గ్రామాలకు రాజధాని కొలనుపాక ఒకప్పుడు 7 వేల గ్రామాలకు రాజధాని. ఆ గ్రామ ప్రజలకు వీరశైవ తత్తా్వన్ని బోధించి, మోక్షమార్గాన్ని అనుసరించేలా చేయడం కుల గురువుల బాధ్యత. ఆచార్యుల బతుకుదెరువు, కులమఠంలోని సన్యాసుల పోషణ, శివ పూజల నిర్వహణ కోసం 7 వేల గ్రామాలవారు ధనం, ధాన్యం ఇచ్చేవారు. కాబట్టే, కులమఠాల్లో ధూపదీప నైవేద్యాలకు లోటు రాలేదు. శివారాధన, వీరశైవ బోధన నిరాటంకంగా కొనసాగింది. కాకతీయుల పతనం తర్వాత ఓ వర్గం అధికారంలోకి వచ్చారు. దీంతో వీరశైవులకు కష్టాలొచ్చాయి. కొలనుపాక కుల మఠాలకు ఇచ్చే దానాలపై ఓ వర్గం పన్ను విధించినట్టు తమ తాతలు చెప్పేవారని పలువురు చెబుతున్నారు. దక్షిణ కాశీ కొలనుపాక దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కొలనుపాక సమీపంలో ‘కాశీ బుగ్గ’అనే నడబావి ఉంది. దానికి పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది. శివ భక్తులు కాశీ బుగ్గలోని నీటిని అపర గంగగా భావిస్తారు. ఈ గుడిలోని శివుడిని అపర (కాశీ) విశ్వేశ్వరుడిగా కొలుస్తారు. కాశీ బుగ్గను దర్శించుకుంటే వారణాసిని దర్శించుకున్నట్లేనని శైవుల భావన. ఒకప్పుడు కుల మఠాల్లో జరిగే శివపార్వతుల కల్యాణ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన శివభక్తులు తమతమ కుల మఠాల్లో జాగారం చేసేవారు. తమ కుటుంబీకులు చనిపోతే దశదిన కర్మ తర్వాత కొలనుపాకకు వచ్చి కులమఠంలో నిద్ర చేసేవారు. తెల్లవారు కాశీ బుగ్గలో అస్థికలు కలిపిపోయేవారు. -
శివాలయంలో బౌద్ధ సంతాన దేవత విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు. చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు. చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు -
కొలనుపాక జైన మందిరాలు
జైన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం. కొలనుపాకలో జైన మందిరాన్ని ఒక ఎకరా విస్తీర్ణంలో నిర్మించారు. చుట్టూ ఉన్న ధర్మశాలలు ఇతర కట్టడాలన్నీ కలిపి ఈ మందిరం ఇరవై ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ మందిరాన్ని భరతుడు కట్టించాడని స్థానిక కథనం ఒకటి వ్యవహారంలో ఉంది. శకుంతల– దుష్యంతుల కుమారుడు భరతుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ‘భరతుడు కట్టించాడనే అనుకోవడానికి... మరి భారతదేశం రెండు వేల ఏళ్లకంటే ముందే ఉండేది కదా. ఈ మందిరం ఆవరణలో ఉన్న దాదాపు ఇరవై శాసనాలను బట్టి చూస్తే రాష్ట్రకూటుల చారిత్రక కాలానికి వర్తిస్తోంది. పురాతన మందిరాన్ని రాష్ట్రకూటులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఇక్కడ బౌద్ధం కూడా బాగానే విస్తరించింది. కానీ పర్యాటక ప్రదేశంగా జైనమందిరమే ప్రాచుర్యంలోకి వచ్చింది. వర్ధమానుడి విగ్రహం జైన తీర్థంకరులు రిషభనాధుడు, నేమినాథుడు, మహావీరుల విగ్రహాలతోపాటు ఆదినాధుడు, వర్ధమాన మహావీరుడి శిష్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో తెల్లటి పాలరాతి విగ్రహాలతోపాటు ఆకుపచ్చ పాలరాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. గడచిన శతాబ్దంలో ఈ మందిరానికి మరమ్మత్తులు చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పాలరాతి నిర్మాణాల్లో నిపుణులు వచ్చి మెరుగులుదిద్దారు. మహావీర సూత్రాలు ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ జైనమందిరం హైదరాబాద్‌కి ఎనభై కిలోమీటర్ల దూరాన యాదాద్రి జిల్లాలో ఉంది. రైల్లే వెళ్లాలంటే ఆలేరు రైల్వేస్టేషన్లో దిగాలి. ఆలేరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. వారాంతపు సెలవుకు ఇది మంచి ప్రదేశం. రోజంతా ఆహ్లాదంగా గడపవచ్చు. చదవండి: మానా గ్రామం.. ఇది మన ఊరే! రంగులు మార్చే సూర్యుడు -
అభివృద్ధికి నోచుకోని కొలనుపాక
ఆలేరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండలంలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొలనుపాకలో దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద జైనదేవాలయం ఉంది. ప్రాచీన చరిత్ర కలిగిన సోమేశ్వర, వీరనారాయణ ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. మంత్రి దత్తాత్రేయ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశం. కొలనుపాక గ్రామ జనాభా 9168 ఉంది. గృహాలు 2123 ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలో మూడు ఆవాస గ్రామాలున్నాయి. గ్రామంలో ప్రధానంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షితమైన నీటిని అందించాల్సి ఉంది. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు 268 కుటుంబాలకు లేవు. గ్రామంలో రెండు ఐబీ చెరువులు, 40కుంటలు ఉన్నాయి. పీన చెరువును అభివృద్ధి చేస్తే గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దీంతో నీటిఎద్దడి ఉండదు. అలాగే గ్రామంలో వాటర్‌ట్యాంక్ శిథిలమైంది. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది. కొలనుపాక–బైరాంనగర్, కొలనుపాక–గూండ్లగూడెం, కొలనుపాక–రాఘవాపురం గ్రామాల మధ్య వాగులపై చెక్ డ్యాంలు నిర్మించాల్సి ఉంది. అవి నిర్మిస్తే పంట పొలాలు సస్యశామలమవుతాయి. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాల్సి ఉంది. గ్రామంలోని హైస్కూల్‌ను డిజిటలైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన ప్పటికీ నేరవేరలేదు. గ్రామంలో నాలుగు వైపులా çÔæ్మశానవాటికలు ఉన్నప్పటికీ, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వసూలు కాని పన్నులు .. గ్రామపంచాయితీలు అభివృద్ధి చెందాలంటే పన్నులే ఆధారం. ప్రభుత్వం అందజేసే నిధులు అరకొర మాత్రమే. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. అయితే కొలనుపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి, నల్ల పన్నులు రూ.లక్షల్లో వసూలు కావాల్సి ఉంది. పన్నుల ఎగవేతదారుల సం«ఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాలు లేవు. శ్మశాన వాటికల్లో నీటి సౌకర్యం లేక దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులు పేర్కొన్న హామీలే తప్ప అమలు లేదు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ప్రజలకు ఒరిగిందేమిలేదు. పేరుకే గ్రామజ్యోతి .. మౌలిక వసతులు కొరవడి అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు పంచేందుకు ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ముందుకు కదలడం లేదు. పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి వేస్తుందనుకున్న గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టి నెలలు గడుస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దత్తత తీసుకున్నారు. అయితే అ«ధికారుల నిర్లక్ష్యం, ప్రజల భాగస్వామ్యం కొరవడడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆలేరు మండలంలోని గొలనుకొండలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నెరవేరలేదు. సీసీ రోడ్లు మంజూరు కాలేదు. పారిశుద్ధ్యపు చర్యలు అంతంత మాత్రమే. కేవలం చెత్తకుండీల ఏర్పాటు.. గ్రామంలో ఇటీవల దత్తత కింద అక్కడక్కడ చెత్తకుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. నిధులు కేటాయించాలి .. సొంటెం సోములు, కొలనుపాక. కొలనుపాక గ్రామం సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. మంత్రి దత్తాత్రేయ దత్తత తీసుకోవడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాని ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. పాలకుల మాటలే తప్పా.. ఆచరణలో మాత్రం ఒరిగిందేమిలేదు. చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
కొలనుపాక(ఆలేరు) వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్(ఎం) మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులైన ఆరుగురు మహిళలు రాజాపేట మండలం సోమారంలో స్లాబ్ వేసేందుకు పని నిమిత్తం ట్రాలీ ఆటోలో బయల్దేరారు. అయితే ట్రాలీ ఆటోకు మిల్లర్‌ను కట్టారు. డ్రైవర్ ఆటోను వేగంగా నడుపుతుండడంతో కొలనుపాకలోని జైనదేవాలయం వద్ద మిల్లర్ ఊడిపోయి ఓ స్తంభానికి తాకి ఆటోకు తగిలింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ(51) అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రేగు సరిత తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరు ఎడవల్లి లక్ష్మి, కాలె వినోదలకు కూడా గాయపడ్డారు. రేగు సరితను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగత ఇద్దరిని భువనగిరిలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నర్సింహులు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన విప్ మండలంలోని కొలనుపాకలో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన పొల్కంపల్లి లక్ష్మినర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పరామర్శించారు. ఆమె వెంట ఎంపీపీ గడ్డమీది స్వప్న, కర్రె వెంకటయ్య తదితరులున్నారు. బైక్, టాటాఎస్ ఢీకొట్టుకోవడంతో.. ఆత్మకూరు(ఎం): తుర్కల రేపాక గ్రామానికి చెందిన మూల రాజు(23) వదిన సంతోష హైదరాబాద్‌లో ఉంటుంది. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి రావడం కోసం కప్రాయపెల్లి స్టేజీ వద్ద బస్సు దిగింది. దీంతో వదినను తీసుకరావడానికి రాజు బైక్‌పై తుర్కల రేపాక నుంచి కప్రాయపెల్లి స్టేజీ వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం ఢీకొనడంతో రాజు, సంతోషకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతిచెందాడు. గ్రామ సర్పంచ్ జక్కు ఉర్మిళాసోంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొలనుపాకలో పోస్టర్ల కలకలం
నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని ప్రముఖ జైన క్షేత్రమైన కొలనుపాకలో ఇండియన్ సోషలిస్టు పార్టీ పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనె చదివించాలని, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిని అరికట్టాలని పోస్టర్ లో పేర్కాన్నారు. రెవెన్యూ అధికారులు ఆస్తులను ప్రకటించాలని హెచ్చరించారు. రియల్ మాఫియాను అదుపులోకి తేవాలని ప్రకటించారు. కొలనుపాకలోని మెయిన్‌రోడ్డు, పంచాయతి కార్యాలయాల వద్ద జనగాం ఏరియా కమిటీ, ఇండియన్ సోషలిస్టు పార్టీ పేరిట ఈ పోస్టర్లు వెలిసాయి. అకస్మాత్తుగా వెలుగు చూసిన పోస్టర్లు ప్రజలను కలవర పెడుతున్నాయి. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కొలనుపాక (ఆలేరు) : నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన డి.నర్సయ్య(60) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సయ్య వ్యవసాయ బావి వద్ద పనులు ముగించుకుని అక్కడే ఉన్న రేకుల షెడ్డు కింద సేద తీరి తిరిగి బయటకు వస్తున్న క్రమంలో అతని చేతులు రేకులకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రేకుల షేడ్డు మీదుగా ఉన్న సర్వీస్ వైర్లు రేకులకు తాకడంతో.. విద్యుదాఘాతానికి గురయ్యాడని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.