అభివృద్ధికి నోచుకోని కొలనుపాక
అభివృద్ధికి నోచుకోని కొలనుపాక
Published Mon, Aug 29 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ఆలేరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండలంలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొలనుపాకలో దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద జైనదేవాలయం ఉంది. ప్రాచీన చరిత్ర కలిగిన సోమేశ్వర, వీరనారాయణ ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. మంత్రి దత్తాత్రేయ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశం. కొలనుపాక గ్రామ జనాభా 9168 ఉంది. గృహాలు 2123 ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలో మూడు ఆవాస గ్రామాలున్నాయి. గ్రామంలో ప్రధానంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షితమైన నీటిని అందించాల్సి ఉంది. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు 268 కుటుంబాలకు లేవు. గ్రామంలో రెండు ఐబీ చెరువులు, 40కుంటలు ఉన్నాయి. పీన చెరువును అభివృద్ధి చేస్తే గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దీంతో నీటిఎద్దడి ఉండదు. అలాగే గ్రామంలో వాటర్‌ట్యాంక్ శిథిలమైంది. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది. కొలనుపాక–బైరాంనగర్, కొలనుపాక–గూండ్లగూడెం, కొలనుపాక–రాఘవాపురం గ్రామాల మధ్య వాగులపై చెక్ డ్యాంలు నిర్మించాల్సి ఉంది. అవి నిర్మిస్తే పంట పొలాలు సస్యశామలమవుతాయి. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాల్సి ఉంది. గ్రామంలోని హైస్కూల్‌ను డిజిటలైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన ప్పటికీ నేరవేరలేదు. గ్రామంలో నాలుగు వైపులా çÔæ్మశానవాటికలు ఉన్నప్పటికీ, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వసూలు కాని పన్నులు ..
గ్రామపంచాయితీలు అభివృద్ధి చెందాలంటే పన్నులే ఆధారం. ప్రభుత్వం అందజేసే నిధులు అరకొర మాత్రమే. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. అయితే కొలనుపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి, నల్ల పన్నులు రూ.లక్షల్లో వసూలు కావాల్సి ఉంది. పన్నుల ఎగవేతదారుల సం«ఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాలు లేవు. శ్మశాన వాటికల్లో నీటి సౌకర్యం లేక దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులు పేర్కొన్న హామీలే తప్ప అమలు లేదు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ప్రజలకు ఒరిగిందేమిలేదు.
పేరుకే గ్రామజ్యోతి ..
మౌలిక వసతులు కొరవడి అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు పంచేందుకు ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ముందుకు కదలడం లేదు. పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి వేస్తుందనుకున్న గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టి నెలలు గడుస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దత్తత తీసుకున్నారు. అయితే అ«ధికారుల నిర్లక్ష్యం, ప్రజల భాగస్వామ్యం కొరవడడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆలేరు మండలంలోని గొలనుకొండలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నెరవేరలేదు. సీసీ రోడ్లు మంజూరు కాలేదు. పారిశుద్ధ్యపు చర్యలు అంతంత మాత్రమే.
కేవలం చెత్తకుండీల ఏర్పాటు..
గ్రామంలో ఇటీవల దత్తత కింద అక్కడక్కడ చెత్తకుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు.
నిధులు కేటాయించాలి .. సొంటెం సోములు, కొలనుపాక.
కొలనుపాక గ్రామం సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. మంత్రి దత్తాత్రేయ దత్తత తీసుకోవడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాని ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. పాలకుల మాటలే తప్పా.. ఆచరణలో మాత్రం ఒరిగిందేమిలేదు. చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది.
Advertisement