Jain Temple
-
దేవుడక్కడ.. గంటలు ఇక్కడ
దేవాలయానికి వెళ్లగానే భక్తులు స్వామి విగ్రహం ముందు నిలబడి.. అప్రయత్నంగానే దైవం ముందున్న గంటను మోగిస్తారు. ఆలయం అనగానే దేవుడి ప్రతిరూపం కళ్లముందు కదలాడితే, అలయ పవిత్ర గంటల శబ్దం చెవుల్లో మారుమోగుతుంది. గంట మోగిస్తే దేవుడు తమ కోరికను ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంట సరిగ్గా గర్భాలయం ముందు మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటుంది. కానీ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొలనుపాక దేవాలయం పరిస్థితి వేరు. ఆ ఆలయ గంటలు మోగిస్తే గర్భాలయంలోని స్వామికి వినిపించవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా ఇది నిజం....ఎందుకంటే.. ఆలయాలు కొలనుపాకలో ఉంటే, ఆ గుడి గంటలు అక్కడికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో ఉన్నాయి. గంటలు దేవాలయంలో ఉండాలిగాని, హైదరాబాద్‌లో ఉండటమేంటన్న గందరగోళానికి పురావస్తుశాఖ నిర్వాకమే కారణం. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సంగతి... కొలనుపాక అనగానే ప్రపంచ ఖ్యాతి పొందిన అద్భుత జైన దేవాలయం మదిలో మెదులుతుంది. ప్రస్తుత యాదాద్రి– భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు సమీపంలో ఈ గ్రామముంది. రాష్ట్రకూటులు పదో శతాబ్దంలో ఇక్కడ విశాలమైన జైన దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఐదడుగుల పచ్చరాతి మహావీరుని విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. రాష్ట్రకూటుల తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కళ్యాణి చాళుక్యులు పదకొండో శతాబ్దంలో దానికి చేరువలో సోమేశ్వరాలయం, పక్కనే వీరనారాయణస్వామి ఆల యాలను నిర్మించారు. వెరసి ఇది జైన, శైవ, వైష్ణవ సంప్రదాయంతో వర్ధిల్లిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. శైవంలో కాలకమైన పంచ ఆచార్యుల్లో రేణుకాచార్య మనుగడ సాగించింది కొలనుపాకలోనే అన్న ఆధారాలుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులొస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన భక్తులు కొలనుపాకకు వచ్చి సేదతీరుతారు. ఈ ఆలయాలకు చెందిన రెండు భారీ గంటలు ఆలయాలకు దూరంగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉండిపోయాయి. నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జైన ఆలయం ధ్వంసమైంది. మిగతా కొన్ని నిర్మాణాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 1970లలో అక్కడ జరిపిన అన్వేషణలో ఆలయాలకు చెందిన భాగాలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. నాడు ధ్వంసమైన జైన దేవాలయం స్థలంలో తర్వాత పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడది జైన భక్తుల ఇలవేల్పు. అక్కడికి సమీపంలో ఊబదిబ్బగా పేర్కొనే వాగు ఇసుకలో 2 భారీ గంటలు లభించాయి. కంచుతో రూపొందిన ఈ గంటలు అద్భుత శిల్పకళానైపుణ్యంతో వెలుగొందుతున్నాయి. ఈ రెండు కూడా కంచుతో రూపొందిన బరువైన గంటలు. వాటిని మోగిస్తే వచ్చే శబ్ద తరంగాలు వినసొంపుగా చాలాదూరం వినిపిస్తాయి. వాటి ని అప్పట్లో స్టేట్ మ్యూజియంకు తరలించి మరిచిపోయారు. ఐదారేళ్లుగా వీటిని తిరిగి ఆలయాలకు తరలించాలన్న విన్నపం భక్తుల నుంచి వస్తోంది. ఇవి ఆ ఆలయాలకు చెందినవే కావటంతో వాటిని మళ్లీ ఆలయాల్లో ఏర్పాటు చేయాలి. కానీ విలువైన ఆ గంటలను స్మగ్లర్ల బారి నుంచి కాపాడాలంటే భద్రత అవసరం. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దుస్థితిలో ఉన్న పురావస్తుశాఖ వాటిని కాపాడలేనని చేతులెత్తేసింది. కాపలా సిబ్బంది ఖర్చులు భరించే స్తోమత లేనందున వాటిని మ్యూజియంలోనే ఉంచి చేతులు దులిపేసుకుంది. గంటపై శాసనం... సాధారణంగా శాసనాలు రాళ్లు, రాతి పత్రాలపై రాస్తారు. కానీ ఈ రెండు గంటల్లో ఓ దానిపై శాసనం లిఖించి ఉండటం విశేషం. ‘స్వస్తిశ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ’అని కన్నడలో లిఖించి ఉంది. కండప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వరదేవుడికి విరాళంగా ఇచ్చిందన్న అర్ధం. కాశీ కొలనుపాక బింభావతి పట్టణంగా చరిత్రలో కొలనుపాక వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల హయాంలో రెండో రాజధానిగా కూడా భాసిల్లింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీనిపేరు కొల్లిపాకైగా ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనంలో కొల్లిపాక అని ఉంది. ఇలా ఈ పేరు రూపాంతరం చెందుతూ కొలనుపాకగా స్థిరపడింది. ఈ గంటల్లో ఒకదానిపై అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మ, పరుశు, పాశం, దంతం, మోదుకం ధరించి లలితాసనంలో ఉన్న గణపతి, రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించిన విష్ణువు, అభయహస్తం, శ్రీఫలం, శూలం, ఖట్వాంగం ధరించిన శివుడు ప్రతిరూపాలున్నాయి. మరో గంటపై ఆసీనుడైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, గణపతి విగ్రహాలున్నాయి. కొంతమంది భక్తులకు ఈ గంటల ఖ్యాతి తెలిసి చూసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కానీ అవి హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వాటిని వెంటనే కొలనుపాక ఆలయంలో ఏర్పాటు చేసి తగు భద్రత కల్పించాలి. అలనాటి ఆ గంటలు మోగించి ఆధ్యాత్మికానందం పొందే అవకాశాన్ని భక్తులకు కల్పించాలి. – రత్నాకరరెడ్డి ఔత్సాహిక పరిశోధకుడు -
జైన గురువు తరుణ్ కన్నుమూత
న్యూఢిల్లీ: జైన మత గురువు తరుణ్ మహరాజ్ (51) శనివారం ఢిల్లీలోని రాధాపురి జైన దేవాలయంలో తుదిశ్వాస విడిచారు. ‘తరుణ్ మహరాజ్‌కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఇటీవల రాధాపురి ఆలయానికి వచ్చి అక్కడే ఉంటున్నారు. తెల్లవారుజామున 3.18కి ఆయన మరణించారు’ అని భారతీయ జైన్ మిలాన్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ఉదయం 6 గంటలకు ఆయన మరణ వార్త తెలిసింది. దీంతో దేవాలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది’ అని అన్నారు. తరుణ్ మహరాజ్ మృతిపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహరాజ్ మృతికి సంతాపం ప్రకటించారు. -
కొల్చారం.. రండి చూసొద్దాం
కొల్చారం(నర్సాపూర్) : కొల్చారం మండల పరిసర ప్రాంతాలు పురాతన కట్టడాలకు, ప్రకృతి రమణీయతకు పేరుగాంచాయి. ఇక్కడ భూమిలో ఎక్కడ తవ్వినా.. కట్టడాలు, విగ్రహాలే దర్శనమిస్తాయి.ప్రస్తుతం కొల్చారంలో దర్శనీయ స్థలాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొల్చారం పూర్వపు నామం కోలాచలం. కోలాచలం కాస్త కొలిచెలిమగా మారి రానురాను అది కొల్చారంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొల్చారంను దర్శించాల్సిందే. కాకతీయుల ఆనవాళ్లు.. మండల కేంద్రానికి పురాతనమైన చరిత్ర ఉంది. ఎన్నో రాజవంశాలు ఈ నేలను పరిపాలించాయి. కొ ల్చారం గ్రామం చుట్టూ భవన నిర్మాణాల కోసం ఎక్క డ తవ్వినా ఏదో ఒక దేవత విగ్రహం, కట్టడాలకు సం బంధించిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. కాకతీయు ల కాలం మొదలుకుని నిజాం కాలం వరకు ఇక్కడి విగ్రహాలు, శాసనాలు నాటి చరిత్రను తెలియజేస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు నిలయం.. చూడదగ్గ మరో ప్రదేశం తిరుమలయ్యగుట్ట. కొల్చారం నుంచి వరిగుంతానికి వెళ్లే ఎడమవైపు ఈ గుట్ట దర్శనమిస్తుంది. పచ్చని ప్రకృతి రమణీయతను చాటుతూ గుట్టపైకి వెళ్తే తిరుమలేశుని దర్శించుకోవచ్చు. ఈ గుట్టకూ ఓ ప్రత్యేకత ఉంది. క్లిష్టమైన వ్యాఖ్యాన ప్రక్రియకు ప్రాణం పోసి కాళిదాసు రచించిన పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసిన సాహితీ వేత్త కోలిచాల మల్లినాథసూరి జ్ఞానసముపార్జన పొందిన స్థలం ఈ గుట్ట. ఇంతటి చరిత్రను తనలో ఉంచుకున్న కొల్చారంను దర్శించడం తప్పనిసరి. మరి ఆలస్యం ఎందుకు నేడే దర్శించుకునేందుకు బయలుదేరండి మరీ. మతసామరస్యానికి ప్రతీక.. ఇక్కడ పురాతనమైన దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ముస్లింల పరిపాలన కొనసాగిందనడానికి షేక్షాబొద్దిన్ దర్గా నిదర్శనం. ఇక్కడ వారంలో ఆరు రోజులు పెద్ద ఎత్తున భక్తులు మతాలకు అతీతంగా వచ్చి దర్శించుకుంటారు. తొమ్మిదిన్నర అడుగుల ఏకశిలా విగ్రహం.. 1984లో వీరభద్రస్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా శెల్యరాతితో చెక్కిన ఏకశిలతో దిగంబరంగా తలపై ఏడు సర్పాలు పడగకప్పి ఉన్న విగ్రహం బయటపడింది. తొమ్మిదిన్నర అడుగులున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా గుర్తించారు. ఆనాటి రాజైన త్రిభువన ఈ శిలావిగ్రహాన్ని చెక్కించినట్లుగా, ఇది జైన గురువైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన జైన ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలో శ్రావణబెలగొళలోని గోమటేశ్వరుని విగ్రహం తర్వాతి స్థానాన్ని ఈ ఏకశిలా విగ్రహం దక్కించుకుంది. పూర్తి ప్రకృతి రమణీయత ప్రతిబింబించేలా ప్రశాంత వాతావరణంలో దేవాలయం నిర్మించడంతో చాలామంది పర్యాటకులు ఈ దేవాలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. -
అలనాటి అద్భుత కట్టడంపై నిర్లక్ష్యం
-
అభివృద్ధికి నోచుకోని కొలనుపాక
ఆలేరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండలంలోని కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కొలనుపాకలో దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద జైనదేవాలయం ఉంది. ప్రాచీన చరిత్ర కలిగిన సోమేశ్వర, వీరనారాయణ ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. మంత్రి దత్తాత్రేయ గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశం. కొలనుపాక గ్రామ జనాభా 9168 ఉంది. గృహాలు 2123 ఉన్నాయి. ఈ గ్రామ పరిధిలో మూడు ఆవాస గ్రామాలున్నాయి. గ్రామంలో ప్రధానంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షితమైన నీటిని అందించాల్సి ఉంది. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు 268 కుటుంబాలకు లేవు. గ్రామంలో రెండు ఐబీ చెరువులు, 40కుంటలు ఉన్నాయి. పీన చెరువును అభివృద్ధి చేస్తే గ్రామంలో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దీంతో నీటిఎద్దడి ఉండదు. అలాగే గ్రామంలో వాటర్‌ట్యాంక్ శిథిలమైంది. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది. కొలనుపాక–బైరాంనగర్, కొలనుపాక–గూండ్లగూడెం, కొలనుపాక–రాఘవాపురం గ్రామాల మధ్య వాగులపై చెక్ డ్యాంలు నిర్మించాల్సి ఉంది. అవి నిర్మిస్తే పంట పొలాలు సస్యశామలమవుతాయి. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాల్సి ఉంది. గ్రామంలోని హైస్కూల్‌ను డిజిటలైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన ప్పటికీ నేరవేరలేదు. గ్రామంలో నాలుగు వైపులా çÔæ్మశానవాటికలు ఉన్నప్పటికీ, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వసూలు కాని పన్నులు .. గ్రామపంచాయితీలు అభివృద్ధి చెందాలంటే పన్నులే ఆధారం. ప్రభుత్వం అందజేసే నిధులు అరకొర మాత్రమే. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. అయితే కొలనుపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి, నల్ల పన్నులు రూ.లక్షల్లో వసూలు కావాల్సి ఉంది. పన్నుల ఎగవేతదారుల సం«ఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాలు లేవు. శ్మశాన వాటికల్లో నీటి సౌకర్యం లేక దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నాయకులు పేర్కొన్న హామీలే తప్ప అమలు లేదు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ప్రజలకు ఒరిగిందేమిలేదు. పేరుకే గ్రామజ్యోతి .. మౌలిక వసతులు కొరవడి అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు పంచేందుకు ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం ముందుకు కదలడం లేదు. పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి వేస్తుందనుకున్న గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టి నెలలు గడుస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమే. ఆలేరు నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దత్తత తీసుకున్నారు. అయితే అ«ధికారుల నిర్లక్ష్యం, ప్రజల భాగస్వామ్యం కొరవడడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆలేరు మండలంలోని గొలనుకొండలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నెరవేరలేదు. సీసీ రోడ్లు మంజూరు కాలేదు. పారిశుద్ధ్యపు చర్యలు అంతంత మాత్రమే. కేవలం చెత్తకుండీల ఏర్పాటు.. గ్రామంలో ఇటీవల దత్తత కింద అక్కడక్కడ చెత్తకుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. నిధులు కేటాయించాలి .. సొంటెం సోములు, కొలనుపాక. కొలనుపాక గ్రామం సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. మంత్రి దత్తాత్రేయ దత్తత తీసుకోవడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాని ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యం. పాలకుల మాటలే తప్పా.. ఆచరణలో మాత్రం ఒరిగిందేమిలేదు. చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. -
దయచేసి జీన్స్, స్కర్ట్స్‌తో రాకండి
ఉజ్జయిని: తమ దేవాలయంలోకి మహిళలు జీన్స్, స్కర్ట్స్ వేసుకొని ప్రవేశించకుండా ఉజ్జయినిలోని జైన దేవాలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లు పైబడిన వారంతా ఈ నిబంధనకు లోబడి ఆలయంలోకి రావాల్సి ఉంటుందని ప్రకటించారు. ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉజ్జయినిలో జైన మత శ్వేతాంబర సమాజానికి చెందిన వృషభదేవ ఆలయం ఉంది. దీనిని చగ్నిరామ్ పెడి ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆలయ గౌరవాన్ని కాపాడేందుకోసం తీసుకునే చర్యల్లో భాగంగా ఆదివారం సమావేశం అయిన ట్రస్ట్ సభ్యులు కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదేళ్లు పైబడిన బాలికలు, మహిళలు జీన్స్, టీ షర్ట్స్, స్కర్ట్స్, టాప్స్ వంటి పాశ్చాత్య దుస్తులు కాకుండా కేవలం భారతీయ సంప్రదాయంతో నిండిన వస్త్రాలనే ధరించాలని నిబంధన తీసుకొచ్చినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర సిరోలియా చెప్పారు. జైన ఆలయంలోకి పాశ్చాత్య దుస్తులకు అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత 'చున్రీ'(తలను కప్పి ఉంచుకునే వస్త్రం) ఇస్తామని చెప్పారు. సరైన వస్త్రాధరణతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు. -
జైన మందిరం సందర్శించిన జగన్
కాకినాడ : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాకినాడ దేవాలయం వీధి విక్టరీ హౌస్ కాలనీలోని మార్వాడీల శీత్రి మందిర్‌ను సందర్శించారు. పార్టీ అభిమాని నిర్మల్‌జైన్ నివాసంలో గురువారం రాత్రి బస చేసిన జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటకు బయలుదేరే ముందు అక్కడకు సమీపంలోని ఈ ఆలయానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డితోపాటు ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ కాకినాడలోని మార్వాడీలు, జైన్లు ఎంతగానో ఆదరించారని చెప్పారు. వీరంతా ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉండాలని కోరారు. కాకినాడ జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవర్లాల్ జైన్, సంఘ ప్రతినిధులు హంసరాజ్ జైన్, మహేందర్, కాంతిలాల్, ఈదారామ్‌చౌదరి, సామర్లకోట, పిఠాపురం జైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబాల్‌లాల్, తారత్‌మాల్ జైన్, పెద్దాపురంలోని జైన్ ప్రతినిధులు కూడా నిర్మల్‌జైన్ నివాసానికి వచ్చి జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మార్వారీ యువమంచ్ ప్రతినిధులు కూడా జగన్‌ను కలిశారు. అధినేతతో కాకినాడ నగర నేతల భేటీ కాకినాడ వచ్చిన జగన్ మోహన్‌రెడ్డిని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కలుసుకున్నారు. నిర్మల్‌జైన్ నివాసం వద్ద వీరందరినీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జగన్మోహన్రెడ్డికి పరిచ యం చేశారు. అధినేతను కలిసిన వారిలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, జిల్లా వక్ఫ్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణరావు, బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, మీసాల దుర్గాప్రసాద్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి జోగా రాజు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కె.ఆదిత్యకుమార్ తోపాటు వివిధ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పూజారిపై దాడి.. ఆలయ సామగ్రి ధ్వంసం
తమిళనాడులోని ఈరోడ్‌లో జైన దేవాలయం పూజారిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి, ఆలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు కారులో రాగా మరో ఇద్దరు ద్విచక్రవాహనాల మీద వచ్చారు. ముగ్గరుఇలో ఒకరు బాగా తప్పతాగి ఆలయంలోకి వస్తుండగా పూజారి ఆపి ప్రశ్నించారు. వెంటనే అతడు పూజారిపై తనవద్ద ఉన్న సీసాతో దాడి చేయడంతో ఆయన ఎడమ చెవికి తీవ్రగాయమైంది. అనంతరం ఆ ముఠా సభ్యులు లోపలున్న సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే అదృష్టవశాత్తు గర్భగుడి తలుపులు మాత్రం తాళం వేసి ఉండటంతో వాళ్లు ఆ లోపలికి ప్రవేశించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఇక్కడ గొడవ విన్న స్థానికులు వెంటనే అక్కడకు రావడంతో ముగ్గురూ మోటారు సైకిళ్ల మీద పారిపోయారు. నిందితులను అరెస్టు చేయాలంటూ స్థానికులు రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు. -
జైన దేవాలయంలో లూటీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : జైన్ దేవాలయంలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డులపై మత్తు మందు చల్లి భారీ మొత్తంలో లూటీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మెజిస్టిక్ సమీపంలోని అక్కిపేట మెయిన్ రోడ్డులోని ఓబయ్య లే ఔట్లో ప్రఖ్యాతి గాంచిన జైన మందిరం ఉంది. ఇక్కడ అమూల్యమైన పురాతన విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఐదు హుండీలు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఆరు సీసీ కెమెరాలతో పాటు ఐదుగురు గార్డులను కూడా ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పూజల అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు అక్కడకు చేరుకుని సెక్యూరిటీ గార్డులపై మత్తుమందు చల్లి అచేతనులను చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం కిటికి ఊచలను కత్తిరించి లోపలకు చొరబడ్డారు. ఆలయంలోని పురాతన పంచలోహ విగ్రహాలు, వస్తువులు, పూజా సామగ్రి, బంగారు నగలు, ఐదు హుండీల్లోని నగదు లూటీ చేసి ఉడాయించారు. ఆదివారం ఉదయం పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకున్న అర్చకుడు విషయాన్ని గుర్తించి సమాచారం అందివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మొత్తం రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు, రూ. మూడు లక్షలకు పైగా లూటీ అయినట్లు ఆలయ నిర్వాహాకులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దినేష్ గుండూరావు, పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, స్నిప్పర్ డాగ్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది.